HomeతెలంగాణTelangana : అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్.. తిప్పుడులో మాత్రం తేడా రాలేదు..

Telangana : అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్.. తిప్పుడులో మాత్రం తేడా రాలేదు..

Telangana : ఇటీవల శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ గా నియమించిన నేపథ్యంలో వివాదం మొదలైంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేకు ఇవ్వాల్సిన ఆ పదవిని భారత రాష్ట్ర సమితికి రాజీనామా చేసి కొద్దిరోజుల కిందట కాంగ్రెస్ లో చేరిన గాంధీకి ఇవ్వడాన్ని భారత రాష్ట్ర సమితి నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఈ విషయాన్ని తీవ్రంగా ప్రశ్నించారు. ” పార్టీ నుంచి పదిమంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయారు. వాళ్లకు సిగ్గు శరం ఉండాలి.. వారందరికీ చీరలు, గాజులు కొరియర్ చేస్తాను. వాటిని వేసుకొని తిరగండి” అంటూ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించడం కలకలం రేపింది. పార్టీలో చేరిన గాంధీ.. ఇప్పుడు దేవుడి కండువా కప్పుకున్నానని మాట మారుస్తున్నారని.. ఆయన మా పార్టీ సభ్యుడు అయితే తెలంగాణ భవన్ కు రావాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు.. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం 11 గంటలకు ఆయన ఇంటికి వెళ్లి కండువా కప్పుతానని కౌశిక్ రెడ్డి అన్నారు. ఆయన ఇంటిపై భారత రాష్ట్ర సమితి జెండా ఎగరవేసి.. తెలంగాణ భవన్ కు తీసుకెళ్తామని అన్నారు. ఈ క్రమంలోనే కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు. గురువారం ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు..

అరికెపూడి గాంధీ తీవ్రస్థాయిలో..

కౌశిక్ రెడ్డి జెండా ఎగరవేస్తానని చెప్పిన నేపథ్యంలో అరెకపూడి గాంధీ కూడా తీవ్రస్థాయిలో స్పందించారు. రాయలేని భాషతో కౌశిక్ రెడ్డిని విమర్శించారు..” నేను భారత రాష్ట్ర సమితి నుంచి ఎమ్మెల్యేగా గెలిచాను. ఇదే విషయాన్ని స్పీకర్ చెప్పారు. కౌశిక్ రెడ్డి ఒక కోవర్టు. అతడికి నా గురించి మాట్లాడే స్థాయి లేదు. ధైర్యం ఉంటే రా.. లేకపోతే నేనే వస్తానని” గాంధీ సవాల్ విసిరారు. ఇదే క్రమంలో గాంధీ 20 వాహనాల కాన్వాయ్ తో తన అనుచరులతో కొండాపూర్ లోని కొల్లా విల్లాస్ లో కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు. కౌశిక్ రెడ్డి ఇంటికి గాంధీ, ఆయన అనుచరులు వెళ్లారు. కొంతమంది కౌశిక్ రెడ్డి ఇంటి ప్రధాన ద్వారాన్ని బ్రేక్ చేశారు.. కౌశిక్ రెడ్డి వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. కౌశిక్ రెడ్డి అనుచరులపై కోడిగుడ్లు, టమాటలతో దాడి చేశారు. కొంతమంది రాళ్లతో కిటికీ అద్దాలు, పూల కుండీలు పగలగొట్టారు. భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు, కౌశిక్ రెడ్డి అనుచరులు చెప్పులు విసిరారు. ఇదే సమయంలో సైబరాబాద్ పోలీసులు గాంధీని అరెస్టు చేసి నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. అనంతరం స్టేషన్ బెయిల్ పై ఆయన విడుదల చేశారు.

సైబరాబాద్ కమిషనరేట్ కు..

కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి నేపథ్యంలో మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, రంగుల కమలాకర్, ఇతరులు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కు వెళ్లారు.. తన ఇంటి పై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని కౌశిక్ రెడ్డి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు.. మాదాపూర్ ఏసిపి, ఇతర పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.. ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. ఇదే సమయంలో వేలు పైకి చూపించి కౌశిక్ రెడ్డి జాగ్రత్త అంటూ హెచ్చరించారు.. ఇదే సమయంలో హరీష్ రావు కలగజేసుకొని సముదాయించారు.. ఇదే సమయంలో భారత రాష్ట్ర సమితి నాయకులు పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ఎదుట బైఠాయించడంతో.. తమ విధులకు ఆటంకం కలిగిస్తున్నారని పోలీసులు హరీష్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కేపీ వివేకానంద పై కేసులు నమోదు చేశారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసిన భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలను పోలీసులు దాదాపు మూడు గంటలపాటు రంగారెడ్డి జిల్లాలో తిప్పారు. తలకొండపల్లి నుంచి కేశంపేట పోలీస్ స్టేషన్ వరకు తరలించారు. ఇదే సమయంలో తమను ఇంత దూరం ఎందుకు తీసుకువెళ్తున్నారని హరీష్ రావు పోలీసులను ప్రశ్నించారు. పోలీస్ స్టేషన్ లోనే బైఠాయించారు. తోపులాటలో హరీష్ భుజానికి గాయమైంది. ఆ సమయంలో ఆయన చెయ్యి నొప్పితో బాధపడుతున్నట్టు కనిపించింది. చివరికి డిజిపి హామీ ఇవ్వడంతో హరీష్ ఆందోళన విరమించారు. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన వారిపై క్రిమినల్ కేసులు పెడతామని డిజిపి హామీ ఇవ్వడంతో ఇంటికి వెళ్ళామని హరీష్ రావు అన్నారు.

గతంలోనూ ..

భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు లిక్కర్ స్కాం కేసు వెలుగులోకి వచ్చినప్పుడు కవితను ఉద్దేశించి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై అప్పటి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎక్కడికి తీసుకెళ్తున్నామో చెప్పకుండా గంటలపాటు పోలీసులు పలు ప్రాంతాలలో తిప్పారు. చివరికి వరంగల్ జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్లో ఆయనను ఆదుపులో ఉంచారు. ఆ తర్వాత ఆయన కోర్టును ఆశ్రయించి బెయిల్ తెచ్చుకున్నారు.. అప్పట్లో పోలీసులు ప్రతిపక్ష నేతలను అరెస్టు చేసి.. పోలీసు వాహనాలలో తిప్పగా.. నేడు కాంగ్రెస్ పార్టీ అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే ఇలాంటి పరిణామాలు మంచివి కావని చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular