BRS Manifesto: అనారోగ్యం, సుదీర్ఘ విశ్రాంతి తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల శంఖారావం పూరించారు. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. ఆదివారం ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్లో భారత రాష్ట్ర సమితి అభ్యర్థులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తాను ప్రకటించిన అభ్యర్థులకు బీ ఫామ్ లు అందచేస్తారు. అంతేకాకుండా పార్టీ తరఫున ఎన్నికల ప్రచారానికి సంబంధించి అభ్యర్థులకు చెక్కులు అందజేశారు. అలాగే ఎన్నికలకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ మేనిఫెస్టో కూడా విడుదల చేశారు. రైతులు, యువత, మహిళలు, మధ్యతరగతి ప్రజలు టార్గెట్ గా కెసిఆర్ మేనిఫెస్టో రూపొందించారు.
ఆసరా పింఛన్లను 2016 నుంచి 3016 వరకు పెంచారు. కల్యాణ లక్ష్మిని 100,116 నుంచి 200,116 కు పెంచారు. మహిళలకు ప్రతినెల పెన్షన్ తో పాటు, ఉచితంగా బస్సులలో ప్రయాణించే అవకాశం కల్పించారు. సీనియర్ సిటిజన్ల కోసం సంక్షేమ కార్యక్రమాలను రూపొందించారు. వృద్ధులకు పౌష్టికాహారం అందించే పథకానికి శ్రీకారం చుట్టారు. మహిళా సాధికారత కోసం మహిళా బంధులాంటి పథకాన్ని తీసుకొస్తామని ప్రకటించారు. రైతు బంధు పథకంలో ఎకరానికి 16,000 వరకు పెంచుతారు. రైతులకు ఉచితంగా ఎరువులు అందజేస్తారు. కౌలు రైతులకు ఆర్థిక సహాయాన్ని ఇస్తారు. 50 సంవత్సరాలు దాటిన రైతులకు 2000 వరకు పెన్షన్ ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. పేదలకు వైద్య ఖర్చుల నిమిత్తం ఉచిత వైద్య బీమా పథకాన్ని అమలు చేస్తారు. నిరుద్యోగ భృతి పై కూడా కేసీఆర్ కీలక ప్రకటన చేశారు.
కాగా, ఆదివారం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు. 17 రోజుల్లో 42 సభల్లో కేసీఆర్ పాల్గొంటారు. హుస్నాబాద్ సభ నుంచి కెసిఆర్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు. ఇక ఆదివారం ఐదు పెండింగ్ స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించి వారికి బీ ఫారాలు అందజేసే అవకాశం ఉంది. నర్సాపూర్ స్థానానికి సునితా లక్ష్మారెడ్డి, జనగామ స్థానాన్ని పల్లా రాజేశ్వర్ రెడ్డి కి, మాల్కాజ్ గిరి స్థానాన్ని మర్రి రాజశేఖర్ రెడ్డి కి, నాంపల్లి స్థానాన్ని ఆనంద్ గౌడ్ కు, గోషామహల్ స్థానాన్ని ప్రేమ్ సింగ్ కు ముఖ్యమంత్రి ఖరారు చేసారు. వీరికి బీ
ఫారాలు కూడా అందజేశారు. అనంతరం అభ్యర్థులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇష్టా గోష్టిగా మాట్లాడారు. క్షేత్రస్థాయిలో కొంతమంది అభ్యర్థులు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని హితబోధ చేశారు. సోషల్ మీడియాలో జాగ్రత్తగా ఉండాలని, ఎన్నికల సంఘం అత్యంత కఠినంగా నిబంధనలు అమలు చేస్తున్న నేపథ్యంలో అభ్యర్థులు సమయమనం పాటించాలని సూచించారు.