Telangana Talli Statue
Telangana Talli Statue: డిసెంబర్ 9న తెలంగాణ సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి అడుగులు పడుతున్నాయి. కెసిఆర్ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించినప్పటికీ.. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించలేదు. ఇదేందని అడిగితే అప్పుడు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి, మేము చేయలేకపోయామని భారత రాష్ట్ర సమితి కార్యవర్గం సన్నాయి నొక్కులు నొక్కింది. ఇవాల్టికి భారత రాష్ట్ర సమితి ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మించిన అమరవీరుల స్థూపం లో.. అమరవీరుల పేర్లు లేవు. చివరికి ఆ స్థూపాన్ని ఎవరో ఆంధ్ర కాంట్రాక్టర్ కట్టాడు. ఇదేందని అడిగితే టెండర్లలో వాళ్ళు పాల్గొన్నారు కాబట్టి.. ఇచ్చామని బీఆర్ఎస్ ముక్తాయింపులు ఇచ్చారు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నాడు. సోషల్ మీడియాలో, మీడియాలో తెలంగాణ తల్లి విగ్రహ నమూనాలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. అంతే.. ఇక భారత రాష్ట్రపతి నాయకులు మొదలుపెట్టారు.” తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు మార్చుతున్నారు? నూతన విగ్రహం పేరుతో తెలంగాణ చరిత్రపై దాడి చేస్తున్నారు. అస్తిత్వాన్ని దెబ్బ కొడుతున్నారు. తెలంగాణ తల్లి నిండుదనం మూర్తిభవించిన కల్పవల్లి. ఆమెకు ఒక కిరీటం ఉంటుంది. మెడలో నగలు ఉంటాయి. అసలు ఆమె చేతిలో బతుకమ్మ అనేది లేదు. తెలంగాణ ఆత్మ మొత్తాన్ని సర్వనాశనం చేశారు. స్థూలంగా చూస్తే నా తెలంగాణ తల్లి పిచ్చోడి చేతిలో రాయిలాగా విలవిలాడుతోంది. రేవంత్ ఆవిష్కరించే తెలంగాణ తల్లి ముమ్మాటికి కాంగ్రెస్ తల్లి మాత్రమే అవుతుంది. తెలంగాణకు తల్లి ఎప్పటికీ కాలేదు, కాదు కూడా. కెసిఆర్ మీద ద్వేషంతో రేవంత్ రెడ్డి చేస్తున్న పనులన్నీ. దారుణంగా ఉన్నాయి. రేవంత్ రెడ్డిని చరిత్ర క్షమించదు” ఇలా సాగిపోతున్నాయి గులాబీ క్యాంపు విమర్శలు..
పది సంవత్సరాలు ఏం చేశారు?
కొద్దిరోజులపాటు రాజీవ్ విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేశారు.. సచివాలయం ముంగట ఆయన విగ్రహం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏంటి.. గులాబీ క్యాంపు రచ్చ రచ్చ చేసింది.. ఇప్పుడు తెలంగాణ తల్లి విషయంలోనూ భారత రాష్ట్ర సమితి నాయకులు ఇదే గాయి గత్తరకు తెర లేపారు. గత పది సంవత్సరాలలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటులో ఎందుకు చొరవ చూపలేదు అని ప్రశ్నిస్తే.. గులాబీ నాయకుల వద్ద సమాధానం లేదు. ఇన్ని చర్చల మధ్య ఏకంగా తల్లి విగ్రహాన్ని సచివాలయం ఎదుట మాత్రమే కాదు, ఏకంగా సచివాలయంలోనే ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తూనే ఉన్నాడు. అయితే ఈ విగ్రహం నమూనా గురించి ఇంతవరకు ప్రభుత్వం బయటకు అధికారికంగా ఎటువంటి ఫోటోలు విడుదల చేయలేదు.. అయినప్పటికీ భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా బ్యాచ్ తమ ప్రచారాన్ని ఆపడం లేదు.. వారు అనుకున్నట్టుగానే రేవంత్ రెడ్డి ఆవిష్కరించబోయే తెలంగాణ తల్లికి కిరీటం లేదు.. తల్లికి కిరీటం ఉండాలా? అలా ఉంటేనే దేవత మృతి ఎలా అవుతుంది? తెలంగాణ తల్లి సగటు మహిళగా, చేతిలో సజ్జలు, మొక్కజొన్నలు పండించే గ్రామీణ మహిళా రైతుగా ఉంటే అందులో తప్పు ఎంచడానికి ఏముంది? పచ్చని పంటలకు ప్రతీకగా.. ఆకుపచ్చని రంగు చీరలో హరిత తెలంగాణను ప్రతిబింబించే మహిళగా ఉంటే తప్పేముంది. వాస్తవానికి తెలంగాణ తల్లి అంటే ఇలానే ఉంటుందని ఎవరైనా చెప్పారా? పోనీ దానికి ఏమైనా ప్రాతిపదిక ఉందా. తెలంగాణ రాష్ట్రంలో నదులను గొప్పగా భావిస్తారు. ప్రాంతాలను తల్లులుగా ఆరాధిస్తారు. అది అభిమానం.. గౌరవం. అంత తప్ప తెలంగాణ తల్లిని ఇలాగే ఉండాలని ఎవరు సూత్రీకరించారు? విగ్రహం రూపు రేఖలు మార్చితే అందులో కెసిఆర్ మీద కోపం ఎలా ఉంటుంది. ఇందులో తెలంగాణ మీద దాడి ఏముంది? అస్తిత్వాన్ని దెబ్బ కొట్టే ప్రయత్నం ఏముంది? భారత రాష్ట్ర సమితి నాయకులు చెబుతున్నట్టుగా లోగోలు స్థిరంగా ఉండవు. వాటికి స్థిర రూపాలు అంటూ ఉండవు. బతుకమ్మ ఉంటేనే తెలంగాణ తల్లి అయితే.. దానిని ఇంకొక చేతిలో పెడితే.. అప్పుడు పాలపిట్ట ఏది? జమ్మి కొమ్మలు ఏవి? ప్రశ్నలు ఉదయిస్తాయి. చేయి చూపిస్తే అది కాంగ్రెస్ తల్లి అనడం ముమ్మాటికి భావ దారిద్ర్యం.. దేవుళ్ళు, దేవతా మూర్తులు ఆశీర్వదిస్తున్నప్పుడు అభయ హస్తాన్ని చూపిస్తుంటారు. యాదగిరి నరసింహుడైనా, తిరుమల వెంకన్న అయినా అభయహస్తం చూపిస్తుంటారు. అలాంటప్పుడు వాళ్ళు కాంగ్రెస్ దేవుళ్ళు అవుతారా..
తెలంగాణ మీద దాడి ఎలా అవుతుంది?
రాజకీయ లక్ష్యాల ప్రకారం రేవంత్ రెడ్డికి కేసీఆర్ అంటే కోపం ఉండొచ్చు. అతడి ముద్రలు మొత్తం కాలగర్భంలో కలిపేయాలనే కసి ఉండొచ్చు. కాని దానిని తెలంగాణ మీద దాడి అని అనడమే పూర్తి అబ్సర్డ్.. ఇటీవల చార్మినార్, కాకతీయ తోరణం, గంగా జమున మీద ఎంత రచ్చ జరిగిందో చూశాం కదా.. చార్మినార్ హైదరాబాదు నగరంలో చోటు చేసుకున్న విపత్తు నుంచి సమాజం తేరుకున్న తర్వాత నిర్మించుకున్న ఒక స్మారక భవనం. కాకతీయతోరణం అనేది రాజరికానికి గుర్తు. చివరికి కొంతమంది భారత రాష్ట్ర సమితి నాయకులు ఏకంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి భార్య, కూతురి ఫోటోలతో పోల్చడం నిజంగా విడ్డూరం. వాళ్ల చేష్టలు చూస్తుంటే ఏపీ రాజకీయాల స్థాయికి దిగజారుతున్నారు.. వాస్తవానికి భారత రాష్ట్ర సమితి నాయకులు చేస్తున్న విమర్శలో విషయం లేకుండా పోయింది. ప్రతి దానికి తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఆస్తిత్వం అనే పదాలు వాడటం పరిపాటిగా మారింది. మేము చెప్పిందే శాసనం, రాసిందే చరిత్ర అంటే ఎలా.. జార్ఖండ్ తల్లి బొమ్మ, ఉత్తరాఖండ్ తల్లి బొమ్మ ఎప్పుడైనా ఈ భారత రాష్ట్రపతి నాయకులు చూశారా.. అప్పట్లో చంద్రబాబు దగ్గర కెసిఆర్ పనిచేస్తున్నప్పుడు తెలంగాణ తల్లి బొమ్మను ఏదో పత్రికలో గీశారు.. అది ఎలా ఉంటుందో ఇప్పటి భారత రాష్ట్రపతి నాయకులకు తెలుసా.. అప్పట్లో గీసిన తెలంగాణ తల్లి బొమ్మలో కాళ్లకు కడియాలు ఉన్నాయి. పట్టా గొలుసులు ఉన్నాయి. మెడలో చిన్న చిన్న ఆభరణాలు ఉన్నాయి. నిండుగా పుస్తెలు కనిపిస్తున్నాయి. కాలి వేళ్ళకు మట్టెలున్నాయి. చేతిలో వరి, మక్క కంకులు కనిపిస్తున్నాయి. స్థూలంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డికి, కెసిఆర్ కు తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో పెద్ద తేడా ఏం లేదు. తెలంగాణ ఆస్తిత్వాన్ని ఎలా ప్రదర్శించాలో కనీస ఇంగితం లేదు. ఈ విషయంలో వారు పక్కా రాజకీయ నాయకులు మాత్రమే. అంతే అంతకుమించి ఏమీ లేదు.. ఇందులో బట్టలు చింపుకునే వాళ్ళు చింపుకుంటూనే ఉంటారు. సోషల్ మీడియాలో యుద్ధం చేసుకునే వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు. సమాజం రాజకీయంగా అలా డివైడ్ అయిపోయింది మరి..
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Brs leaders attacked the congress government over the design of the new statue of telangana talli statue
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com