Telangana Assembly Session 2024: అసెంబ్లీకి కేసీఆర్‌.. ప్రతిపక్ష నేతగా తొలిసారి అడుగు.. బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో సభకు..!

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. పదేళ్లు సీఎంగా తెలంగాణను ఆయన ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను గెలిపించడంలో విఫలమయ్యారు. దీంతో ప్రతిపక్షానికి ఆ పార్టీ పరిమితమైంది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కేసీఆర్‌ను శాసన సభాపక్ష నేతగా ఎన్నుకున్నారు.

Written By: Raj Shekar, Updated On : July 23, 2024 9:25 am

Telangana Assembly Session 2024

Follow us on

Telangana Assembly Session 2024: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి.. లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సైలెంట్‌ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తన ఇంట్లో జారిపడడంతో తుంటి విరిగింది. దీంతో దాదాపు మూడు నెలలు ఆయన బయటకు రాలేదు. లోక్‌సభ ఎన్నికల వేళ.. ప్రచారం కోసం.. కార్యకర్తల్లో నైరాశ్యం తొలగించేందుకు బస్సు యాత్ర నిర్వహించారు. ఎన్నికల ప్రచారం చేశారు. కానీ ఈ ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటును కూడా బీఆర్‌ఎస్‌ గెలవలేదు. దీంతో నెల రోజులుగా కేసీఆర్‌ ఫామ్‌ హౌస్‌కే పరిమితమయ్యారు. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉన్నారు. కేటీఆర్‌, కేసీఆర్‌ మాత్రమే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ప్రతిపక్ష పాత్ర పోసిస్తున్నారు. అయితే తాజాగా మళ్లీ కేసీఆర్‌ యాక్టివ్‌ కాబోతున్నారని తెలుస్తోంది. ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారిగా ఆయన తెలంగాణ అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన‍్న నేపథ్యంలో ఇన్నాళ్లూ ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టడానికి ఇబ్బంది పడ్డారు. కానీ ప్రస్తుతం బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం అసెంబ్లీకి రావాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఈమేరకు మంగళవారం(జులై 23న) మధ్యాహ్నం బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి కేసీఆర్ అధ్యక్షత వహించనున్నారు. ఇందులో అసెంబ్లీ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు.

ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి..
కేసీఆర్‌ రాజకీయ జీవితంలో ప్రతిపక్ష నేతగా ఎన్నడూ వ్యవహరించలేదు. టీడీపీలో ఉన్న సమయంలో ఆయన ప్రతిపక్ష నేతగా ఛాన్స్‌ రాలేదు. తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టిన తర్వాత ఆయన ఎంపీగానే పోటీచేశారు. ఇక తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్‌ సారథ్యంలో టీఆర్‌ఎస్‌(బీఆర్‌ఎస్‌) అధికారంలోకి వచ్చింది. దీంతో ఆయన ముఖ్యమంత్రిగానే తెలంగాణ అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఈ నేపథ్యంలో తొలిసారిగా 2023 ఎన్నికల తర్వాత ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఆయన బీఆర్‌ఎస్‌ ఎల్పీ నేతగా, ప్రతిపక్ష నేతగా తొలిసారి అసెంబ్లీకి రాబోతున్నట్లు తెలుస్తోంది.

బడ్జెట్‌ ప్రవేశపెట్టే రోజు..
అసెంబ్లీ సమావేశాలు మంగళవారం(జూలై 23న) ప్రారంభం అవుతున్నాయి. బుధవారం(జూలై 24న) అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. బుధవారం చవితి, మంచిరోజు కావడం.. కేసీఆర్‌కు కలిసి వచ్చే 6 నంబర్‌ తేదీ(2+4=6) ఉండడంతో ఆయన ఆ రోజే అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా అడుగు పెట్టాలని డిసైడ్‌ అయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే… బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ ప్రతిపక్ష నేతగా అడుగు పెట్టనుండడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆయన అసెంబ్లీలో ఏం మాట్లాడతారని ఇటు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతోపాటు తెలంగాణ ప్రజలు కూడా ఆసక్తిగా చూస్తున్నారు.

కేసీఆర్‌ లేవనెత్తే అంశాలు…

– నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు

– జాబ్ కేలండర్ విడుదల కోరుతూ ఉద్యమించిన ఉద్యోగార్డులపై ప్రభుత్వ దమనకాండ

– రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణలో వైఫల్యం

– చేనేత కార్మికుల ఆత్మహత్యలు ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి

– ఆరు గ్యారంటీల అమలు .. శాసన సభలో చట్టబద్ధత

– రైతు రుణ మాఫీ అమల్లో ఆంక్షలు-నష్టపోతున్న రైతాంగం

– పంటలకు మద్దతు ధరకు అదనంగా బోనస్ చెల్లింపులో ప్రభుత్వ వైఫల్యం

– రైతుభరోసా చెల్లింపులో జాప్యం.. రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులు

– గ్రామాలు, పట్టణాలకు నిధుల విడుదలలో అలసత్వం – పారిశుధ్య నిర్వహణ సరిగా లేక కుంటుపడుతున్న ప్రజారోగ్యం