https://oktelugu.com/

Nirmala Sitharaman: చరిత్రకు అడుగు దూరంలో నిర్మలమ్మ.. రికార్డు సృష్టించనున్న ఆర్థిక మంత్రి..

కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. నరేంద్రమోదీ వరుసగా మూడోసారి ప్రధాని పదవి చేపట్టి.. జవహర్‌లాల్‌ నెహ్రూపేరిట ఉన్న రికార్డును సమం చేశారు. ఇక ఇప్పుడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చరిత్ర లిఖించబోతున్నారు. మోరార్జీ దేశాయ్‌, చిదంబరం, ప్రణబ్‌ముఖర్జీ, మన్మోహన్ సింగ్ ను దాటేయబోతున్నారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : July 23, 2024 / 09:38 AM IST

    Nirmala Sitharaman

    Follow us on

    Nirmala Sitharaman: ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఎన్డీఏ మూడోసారి విజయం సాధించింది. నరేంద్రమోదీ ప్రధానిగా మూడోసారి పదవి చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని మోదీ సర్కార్‌ నిర్ణయించింది. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ గడువు ఈనెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్‌కు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ దాదాపు 20 రోజులుగా కసరత్తు చేస్తున్నారు. పార్లమెంట్‌ బడె‍్జట్‌ సమావేశాలు సోమవారం(జూలై 22న) ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో మంగళవారం(జూలై 23న) కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టెందుకు నిర్మలా సీతారామన్‌ సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆమె ఎన్నో రికార్డుల్ని సాధించబోతున్నారు. వరుసగా ఏడుసార్లు కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మొట్టమొదటి ఆర్థిక శాఖ మంత్రిగా నిలవనున్నారు. ఇప్పటికే వరుసగా ఆరుసార్లు ఆమె బడ్జెట్ ప్రవేశపెట్టి.. మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్‌ సరసన నిలిచారు. తాజాగా ప్రవేశపెడుతున్న బడ్జెట్‌తో ఆమె మోరార్జీ దేశాయ్‌ను అధిగమించనున్నారు. ఇదే సమయంలో పార్లమెంటులో ఎక్కువసార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మహిళా ఆర్థిక మంత్రిగా కూడా నిర్మలా సీతారామన్‌ రికార్డు సృష్టించారు. ప్రధాని హోదాలో ఉంటూ నాడు ఇందిరాగాంధీ బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. స్వతంత్ర భారతదేశంలో తొలి పూర్తిస్థాయి మహిళా ఆర్థిక మంత్రిగా ఎక్కువ కాలం కొనసాగిన నేతగా నిర్మలా సీతారామన్ ఇప్పటికే రికార్డును నమోదు చేసుకున్నారు. ఇక అత్యధిక సమయం బడ్జెట్ ప్రసంగం చేసిన ఘనత కూడా నిర్మలా సీతారామన్‌ పేరిటే ఉంది. 2020 ఫిబ్రవరి ఒకటో తేదీన ఆమె ఏకంగా 2:40 నిమిషాలు బడ్జెట్ ప్రసంగం చేశారు. ఇప్పటివరకు ఇదే రికార్డు.

    మొరార్జీ పేరిటే రికార్డు…
    ఇదిలా ఉండగా దేశంలో పదిసార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టి మొరార్జీ దేశాయ్ తిరుగులేని రికార్డును తన పేరిట నిలుపుకున్నారు. అయితే ఇది వరుసగా కాదు. 1959-64 మధ్య తర్వాత 1967-69 మధ్య మొత్తం బడ్జెట్ పదిసార్లు సమర్పించారు. 1959 నుంచి 1964 వరకు ఆర్థిక మంత్రిగా ఉన్న మొరార్జీ దేశాయ్‌ ఐదు పూర్తి బడ్జెట్లు, ఒక మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. మొత్తంగా మొరార్జీ దేశాయ్ 10సార్లు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర ఆర్థిక మంత్రిగా పనిచేసిన పి.చిదంబరం మొత్తం 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. నిర్మలా సీతారామన్‌ 2019 నుంచి వరుసగా బడ్జెట్ సమర్పిస్తూ వస్తున్నారు. ప్రణబ్ ముఖర్జీ 8 సార్లు, సీడీ దేశ్‌ముఖ్, యశ్వంత్ సిన్హా 7 సార్లు, మన్మోహన్ సింగ్, అరుణ్ జైట్లీ 5 సార్లు బడ్జెట్ సమర్పించారు.

    8 నెలల కాలానికి…
    2024-25 బడ్జెట్ రూపకల్పన ప్రక్రియ తుది దశకు చేరుకుంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఓటాన్‌ అకౌంట్ బడ్జెట్‌ను కేంద్రం ప్రవేశపెట్టింది. లోక్‌సభ ఎన్నికలు ముగిసి కొత్త సర్కారు ఏర్పడినందుకు.. ఇప్పుడు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగతా 8 నెలల కాలానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతుంది. ఇక సోమవారం రోజు.. నిర్మలమ్మ ఆర్థిక సర్వేను పార్లమెంటు ముందుకు తీసుకురానున్నారు.

    బడ్జెట్‌లో కొత్త పోకడలు..
    వాస్తవానికి బడ్జెట్‌ ప్రవేశపెట్టడంలోనూ నిర్మల సీతారామన్‌ కొత్త పోకడలు తీసుకొచ్చారు. సంప్రదాయ బ్రీఫ్‌కేస్‌ విధానానికి ఆమె మంగళం పాడారు. జాతీయ చిహ్నంతో కూడిన ఖాతా పుస్తకం తరహాలో ఉండే బ్యాగులో ఆమె బడ్జెట్‌ పత్రాలు తీసుకొచ్చే సంప్రదాయానికి ఆమె శ్రీకారం చుట్టారు. 2019లో తొలి బడ్జెట్‌ నుంచి ఆమె ఖాతా బుక్‌ విధానాన్ని అనుసరిస్తున్నారు.