CM Revanth Reddy: కొంత కాలంగా బీఆర్ఎస్ ముఖ్యనేతలు ప్రెస్మీట్లలో చేసిన డిమాండ్లు.. సాయంత్రానికి సర్కారు ఉత్తర్వులుగా వెలువడడం కనిపిస్తున్నది. దీనిని బట్టి చూస్తుంటే ప్రభుత్వ యంత్రాంగంలోని వివిధ శాఖల్లో ఇంకా గులాబీ కోవర్టులు ఉన్నారన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఏకంగా ముఖ్యమంత్రి నిర్వహించబో్యే సమీక్షలు, అందులోని అంశాలు ముందుగానే ప్రతిపక్ష బీఆర్ఎస్ ముఖ్యనేతలకు తెలిసిపోతున్నాయన్న సందేహాలు కలుగుతున్నాయి.
తాజాగా నిన్న మంగళవారం ఉదయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్మీట్ పెట్టారు. నిరుపేదలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే వారి ఇండ్లను హైడ్రా కూల్చుతున్నదని, పెద్దల ఇండ్లకు మాత్రం నోటీసులు ఇచ్చి అటువైపు కన్నెత్తి చూడడం లేదని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కట్టిన 40వేల డబుల్ బెడ్ రూం ఇండ్లు ఖాళీగా ఉన్నాయని, వాటిని హైడ్రా బాధితులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎలాంటి దిక్కు లేని నిరుపేదలే నాలాల పైన నిర్మాణాలు కట్టుకుంటారని, అలాంటి వారిని గుర్తించి ప్రత్యామ్నాయం చూపిన తర్వాతనే వారి నిర్మాణాలు తొలగించాలని కోరారు.
మంగళవారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో ముఖ్యంగా మూసీ రివర్ ఫ్రంట్, మెట్రో రైలు మార్గం విస్తరణ ప్రధాన అంశాలుగా ఉన్నాయి.
మూసీ పరీవాహక ప్రాంత బఫర్ జోన్లో ఉన్న వారి వివరాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు. వారికి ప్రత్యామ్నాయం చూపి నది పరీవాహకంలో నిర్మాణాలను తొలగించాలని సూచించారు. ఔటర్ రింగు రోడ్డు లోపల ఉన్న చెరువులు, కుంటల ఆక్రమణ వివరాలు తెలుసుకుని నివేదిక ఇవ్వాలని, వాటి పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశం ముగిశాక సాయంత్రం మూసీ పరీవాహక నిర్వాసితులకు 16వేల డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఉదయం కేటీఆర్ విలేకరుల సమావేశం పెట్టడం, హైడ్రా బాధితుల సమస్యలను ప్రస్తావించడం, బీఆర్ఎస్ నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను బాధితులకు ఇవ్వాలని డిమాండ్ చేయడం, ఇదే క్రమంలో ప్రభుత్వం సాయంత్రమే మూసీ పరీవాహక నిర్వాసితులకు 16వేల డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ కావడం చూస్తుంటే పలు అనుమానాలు కలుగుతున్నాయి.
వివిధ శాఖల్లోని ఉన్నత అధికారులు ప్రభుత్వం నిర్వహించే సమీక్షలపై ముందే బీఆర్ఎస్ ముఖ్యనేతలకు ఉప్పందిస్తున్నారన్న అనుమానాలు కలుగుతున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి ఏ అంశాలపై సమీక్ష నిర్వహించబోతున్నారు? ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? అనే విషయాలు ముందుగానే ప్రతిపక్ష పార్టీ పెద్దలకు చేరుతున్నట్టు సందేహాలు వస్తున్నాయి. మంగళవారం నిర్వహించే సమీక్ష వివరాలు సైతం బీఆర్ఎస్ ముఖ్య నేతలకు తెలియడం వల్లే ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమీక్షలో తీసుకోబోయే నిర్ణయాలకు తగినట్టుగా మాట్లాడారనే సందేహాలు కలుగుతున్నయి. ఇప్పటికీ గత ప్రభుత్వంతో కలిసి పని చేసిన అధికారులు, బీఆర్ఎస్ నాయకులతో సత్సంబంధాలు మెయింటేన్ చేస్తున్నారని, ప్రభుత్వం పెద్దల హెచ్చరిలకు బేఖాతరు చేస్తూ ఇంటర్నల్ విషయాలను లీక్ చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
అదీగాక గత ప్రభుత్వ పెద్దల నిర్ణయాలు, సమీక్షల తీరు, పాలకుల ఆలోచనలు ఉన్నతంగా ఉండేవని, వారిని ఆదర్శంగా తీసుకున్న అధికార పెద్దలు కొందరు ఇప్పటికీ వారికి బంట్లుగా పనిచేస్తున్నారన్న వాదనలు ఉన్నాయి. ఇలా ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం ముందుగానే ప్రతిపక్షానికి తెలుస్తుండడం, వివిధ శాఖల్లో బీఆర్ఎస్ దోస్తులు ఉన్నట్టు తెలుస్తుండడం అధికార పార్టీకి మింగుడుపడని వ్యవహారంలా మారిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.