HomeతెలంగాణRevanth Reddy : ఆ కరెంట్‌ లెక్కలతోనే రేవంత్‌ లాగింది.. బీఆర్‌ఎస్‌ చీకట్లోకి వెళ్లింది

Revanth Reddy : ఆ కరెంట్‌ లెక్కలతోనే రేవంత్‌ లాగింది.. బీఆర్‌ఎస్‌ చీకట్లోకి వెళ్లింది

Revanth Reddy : 24 గంటల కరెంట్‌ విషయంలో అమెరికాలోని తానా మహాసభల వేదికగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వేసిన పాచిక పారింది. ఇది సహజంగానే అధికార బీఆర్‌ఎస్‌కు కోపం తెప్పించింది. అయితే రేవంత్ కు దీటుగా సమాధానం చెప్పే దశలో లైన్‌ తప్పింది. నిరసనను కూడా ఫక్తు రాజకీయ ప్రచార కార్యక్రమంగా చేపట్టింది. ఇది అంతిమంగా ప్రజల్లో చులకన భావం కలిగేందుకు కారణమైంది. ఇదే సమయంలో క్షేత్రస్థాయిలో పరిస్థితులను తనకు అనుకూలంగా మలచుకోవడంలోనూ బీఆర్‌ఎస్‌ విఫలమైనట్టు కన్పిస్తోంది. పైగా ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు ‘‘విద్యుత్తు ఎన్ని గంటలు ఇస్తున్నామనే విషయం ముఖ్యం కాదు. నాణ్యమైన విద్యుత్తు ఇస్తున్నామా? లేదా? అనేదే ముఖ్యం’’ అని మాట్లాడటం అధికార బీఆర్‌ఎస్‌ను ఒకింత డైలమాలోకి నెట్టేసింది. దీంతో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తున్నామంటూ ప్రభుత్వం ఇన్నాళ్లుగా చెబుతూ వస్తున్నది నిజం కాదా? అవసరమైన చోట్ల, అవసరం మేరకు మాత్రమే విద్యుత్తు సరఫరా జరుగుతోందా? అంటే.. ఇటు అధికార యంత్రాంగం, మరోవైపు అధికార పార్టీ చేస్తున్న ప్రకటనలు ఇది నిజమేనని నిర్ధారిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

లాగ్‌ బుక్కులతో..

వాస్తవానికి సబ్‌స్టేషన్ల వద్ద ఉండే కీలకమైన లాగ్‌బుక్కులే కేంద్రంగా ప్రతిపక్ష కాంగ్రెస్‌ చేసిన సవాల్ అధికార పక్షాన్ని ఇరుకున పెట్టిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వాస్తవానికి రెండేళ్లుగా వ్యవసాయ రంగానికి త్రీఫేజ్‌ కరెంట్‌ సరఫరాపై డిస్కమ్‌లు నియంత్రణ విధిస్తున్నా, పలు చోట్ల 9 నుంచి 12 గంటలే వ్యవసాయానికి త్రీఫేజ్‌ కరెంట్‌ ఇస్తున్నారని వారు చెబుతున్నారు. త్రీఫేజ్‌ కరెంట్‌ సరఫరాపై నియంత్రణ కొనసాగుతుండగా, ‘మూడు గంటల కరెంట్‌ ఇచ్చే సర్కారు వద్దు’ అనే నినాదంతో అధికార పక్షం ప్రతిపక్ష కాంగ్రెస్ ను టార్గెట్‌ చేస్తూ ఉద్యమించడం బుమారాంగ్‌ అవతోందని వారంటున్నారు. ఈ ప్రచారాన్ని తిప్పికొట్టే క్రమంలో తమకు లాగ్‌బుక్‌ అనే బలమైన ఆయుధం లభించిందని కాంగ్రెస్‌ నాయకులు అంటున్నారు.” క్షేత్రస్థాయిలో సబ్‌స్టేషన్ల నుంచే అన్నిరంగాలకు కరెంట్‌ సరఫరా అవుతోంది. ఇక్కడ షిఫ్టుల వారీగా పనిచేసే సిబ్బంది, విద్యుత్తు సరఫరా ఏ సమయంలో ఆగిపోతుంది? ఏ సమయంలో ఇస్తున్నామనే వివరాలన్నీ సమయం వేసి మరీ రికార్డు చేస్తుంటారు. అయితే 24 గంటల పాటు రైతులకు త్రీఫేజ్‌ కరెంట్‌ ఇవ్వడం లేదనే విషయం కూడా నల్లగొండ జిల్లాలోని సబ్‌స్టేషన్‌లలో ఉండే లాగ్‌ బుక్‌లతోనే తేటతెల్లమయిందని’’ కాంగ్రెస్‌ నాయకులు అంటున్నారు. “లాగ్‌బుక్‌లే కేంద్రంగా తాము అధికారపక్షాన్ని టార్గెట్‌ చేయడంతో ఆ బుక్‌లను ఆపరేటర్లంతా ఏఈల చేతికి అప్పగించాలనే ఆదేశాలు వెళ్లాయి. దీంతో ఆ బుక్‌లన్నీ సబ్‌స్టేషన్‌లలో మాయమయ్యాయని” వారు చెబుతున్నారు.

వారికి ఎందుకు ఇచ్చినట్టు?

విద్యుత్‌ శాఖ అధికారుల ఆదేశాల మేరకు రాష్ట్రంలోని పలు సబ్‌స్టేషన్లలో లాగ్‌బుక్‌లను ఏఈలు స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. మరికొన్ని చోట్ల లాగ్‌బుక్‌లను ఎవరికీ చూపించొద్దని సబ్‌స్టేషన్లలోని ఆపరేటర్లకు ఏఈలు, ఇతర ఉన్నతాధికారులు మౌఖికంగా ఆదేశించినట్లు విద్యుత్‌ శాఖ సిబ్బంది చెబుతున్నారు. సబ్‌స్టేషన్లలోని లాగ్‌బుక్‌లన్నింటినీ ఏఈలు తెప్పించుకొని తమ వద్ద ఉంచుకున్నారంటున్నారు. లాగ్‌బుక్స్‌ సబ్‌స్టేషన్లలోనే ఉన్నా.. వాటిని ఎవరికీ చూపించవద్దని, ప్రజాప్రతినిధులు, విలేకరులు వచ్చినా ఫొటోలు తీయనివ్వవద్దని ఆపరేటర్లుకు అనధికారిక ఆదేశాలు ఇచ్చారని కాంగ్రెస్‌ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇతర సబ్‌స్టేషన్లకు ఇంకా ఇవ్వకపోవ డంతో నోట్‌ బుక్కుల్లో నమోదు చేస్తున్నారని వారం టున్నారు.

పెరిగిన కరెంటు సరఫరా..

ఐదు రోజుల క్రితం దాకా రోజుకు 12 గంటలపాటే త్రీఫేజ్‌ కరెంట్‌ ఇచ్చిన డిస్కమ్‌లు.. ప్రస్తుతం 20 గంటలపైనే కరెంట్‌ సరఫరా చేస్తున్నారని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. రాష్ట్రంలో ఐదు రోజుల క్రితం వరకు 9 గంటలు విద్యుత్తు సరఫరా ఉండగా, నాలుగు రోజులుగా 24 గంటలు సరఫరా చేస్తున్నారని వారు చెబుతున్నారు. తమ నాయకుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల ఫలితంగా విద్యుత్‌ సరఫరా పెంచారని కాంగ్రెస్‌ నేతలు పేర్కొం టున్నారు..

రేవంత్‌ రెడ్డి ఇలా లాగారు

తానా మహాసభల్లో రేవంత్‌రెడ్డి విద్యుత్‌ తుట్టెను కదిపేందకు పెద్ద కసరత్తే చేశారు. దీనికి సంబంధించి విద్యుత్‌ శాఖలో కీలకమైన అధికారుల నుంచి సమాచారం సేకరించారని తెలుస్తోంది. 2022 ఏప్రిల్‌లో ఎన్పీడీసీఎల్‌లో షెడ్యూల్‌ విడుదల చేసి, ఏ సర్కిల్‌ పరిధిలో ఎంత మేర కరెంట్‌ ఇవ్వాలనేది అధికారికంగా నిర్ణయించారు. కానీ, ఏడు గంటల పాటే విద్యుత్తు అందించారు. ఏ రోజుకారోజు షెడ్యూల్‌ విడుదల చేసి.. అధికారికంగా కోతలు అమలు చేశారు. అయితే ఈ వివరాల ఆధారంగానే రేవంత్‌రెడ్డి విద్యుత్‌ లెక్కలు బయటకు తీశారు. వాస్తవానికి ప్రభుత్వం అప్పట్లో షెడ్యూల్‌ను పక్కనపెట్టి, మౌఖిక ఆదేశాలతో కరెంట్‌ కోతలు అమలు చేసింది. వాస్తవానికి ఉదయం 6 నుంచి 9 గంటల దాకా పీక్‌ పీరియడ్‌ ఉంటుంది. తిరిగి సాయంత్రం 6నుంచి 10 గంటల దాకా డిమాండ్‌ అధికంగా ఉంటుంది. ఆ సమయంలో బహిరంగ విపణిలో కరెంట్‌ కొనుగోలు చేయాలంటే భారీగా వెచ్చించాలి. ఇది వ్యయంతో కూడుకున్న వ్యవహారం కావడంతో చాలా సందర్భాల్లో డిస్కమ్‌లు కరెంట్‌ కోతలు అమలు చేస్తున్నాయి. రాష్ట్రంలో 24 గంటల కరెంట్‌పై చర్చ మొదలైన తర్వాత కూడా డిస్కమ్‌లు వ్యవసాయానికి 12 గంటలలోపే కరెంట్‌ను సరఫరా చేస్తున్నాయని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular