High speed Trains : తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్. త్వరలో సెమీ హై స్పీడ్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. గంటకు 220 కిలోమీటర్ల వేగంతో నడిచే రైళ్ల రాకపోకలకు వీలుగా ప్రత్యేక కారిడార్ ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడనున్నాయి. సగటున ప్రతి 49 కిలోమీటర్లకు ఒక స్టేషన్ మాత్రమే ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. శంషాబాద్ – విశాఖపట్నం, వయా సూర్యపేట మీదుగా కర్నూలుకు కలుపుతూ ఈ హై స్పీడ్ రైలు క్యారిడార్ నిర్మితం కానుంది. ఈ కీలక ప్రాజెక్టు ప్రాథమిక అంచనా వ్యయంగ 21 వేల కోట్ల రూపాయలు. ఏపీలో విశాఖపట్నం, కర్నూలు నగరాలను అనుసంధానం చేయాలన్న ప్రతిపాదన చాలా రోజుల నుంచి ఉంది. అందుకే సూర్యాపేటను కేంద్రంగా ప్రతిపాదించారు. అటు శంషాబాద్, ఇటు విశాఖ, వయా సూర్యపేట మీదుగా కర్నూలుకు ఈ సెమీ హై స్పీడ్ క్యారీడర్ నిర్మాణం చేపట్టడానికి డిసైడ్ అయ్యారు. నవంబర్లో రైల్వే బోర్డుకు సమర్పించే ప్రిలిమినరీ ఇంజనీరింగ్ ట్రాఫిక్ సర్వే నివేదికతో.. ఈ ప్రాజెక్టుకు ఖర్చు చేసే నిధులపై స్పష్టత రానుంది. అటు తరువాతే డిపిఆర్ రూపొందించేందుకు తుది సర్వే నిర్వహిస్తారు. దీంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది.
* రవాణా సులభతరం
ఈ ప్రాజెక్టు నిర్మాణంతో తెలుగు రాష్ట్రాల మధ్య రవాణా మరింత సులభతరం కానుంది.తక్కువ సమయంలోనే తెలంగాణ నుంచి ఏపీకి ప్రజలు చేరుకోవచ్చు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలకు ఈ ప్రాజెక్టు ఎంతగానో ఉపయోగపడుతుంది. సగటున ప్రతి 49 కిలోమీటర్లకు ఒక స్టేషన్ మాత్రమే ప్రతిపాదించారు. కానీ తుని రాజమండ్రి రైల్వే స్టేషన్ల మధ్య 88 కిలోమీటర్ల దూరం ఉండనుంది. అతి తక్కువ సమయంలో ప్రయాణికులకు గమ్యానికి చేర్చడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. శంషాబాద్ విశాఖపట్నం మార్గంలో మొత్తం 12 స్టేషన్లను ప్రతిపాదించారు. అందులో తెలంగాణలో ఆరు స్టేషన్లు, ఏపీలో ఆరు స్టేషన్లు ఉండనున్నాయి. మధ్యలో సూర్యాపేట నుంచి కర్నూలుకు వేరే మార్గం నిర్మించాలన్నది ఈ ప్రాజెక్టులో భాగమే. ఈ రూట్లో వచ్చే ఎనిమిది అదనపు స్టేషన్లలో కర్నూలు మినహా మిగిలిన అన్ని తెలంగాణలో ఉండనున్నాయి.
* ఎంతో ప్రయోజనం
శంషాబాద్ విశాఖపట్నం సెమీ హై స్పీడ్ క్యారీడార్ నిర్మాణంతో రెండు రాష్ట్రాల ప్రజల రవాణా కష్టాలు తీరనున్నాయి. రైల్వే శాఖలో అనేక సంస్కరణలను తీసుకొచ్చారు. కానీ ఇంకా లోటు కనిపిస్తోంది. అందుకే ఇప్పుడు సెమీ హై స్పీడ్ క్యారీడర్ నిర్మాణం చేపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఉభయ తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి అవకాశం కలుగుతుందని కేంద్రం అంచనా వేస్తోంది. వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్టు పట్టాలెక్కించాలని భావిస్తోంది.