BJP Silent in Telangana : తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పొలిటికల్ రేస్ నుంచి పూర్తిగా సైడ్ అవుతున్నట్లు కనిపిస్తోంది. మొన్నటి వరకు అధికార బీఆర్‌ఎస్‌తో ఢీ అంటే ఢీ అన్నట్లుగా వ్యవహరించిన బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ సైలెంట్ అయ్యారు. ఇదే సమయంలో కర్ణాటకలో బీజేపీ ఓడిపోయింది. కాంగ్రెస్ బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. దీంతో తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. టీపీసీసీ చీఫ్ రేంత్‌రెడ్డి ఇదే ఉత్సాహంతో దూసుకుపోతున్నారు. పార్టీని పకడ్బందీగా ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇదే సమయంలో బీజేపీ స్టేట్ చీఫ్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ బండి సంజయ్‌కి పార్టీని నడపడం చేతకాదు అని విమర్శించారు. దీనికి స్పందించిన బండి తనకు రేవంత్‌రెడ్డిలా పార్టీలు మారడం.. నోటుతో ఓట్లు కొనడం రాదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పతనానికి పరోక్షంగా రేవంత్‌రెడ్డే కారణమని విమర్శించారు.
కర్ణాటక ఎన్నికల తర్వాత..
కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణ భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఒక్కసారిగా తిరగబడింది. పార్టీలోకి వచ్చే వారు కాకుండా పోయేవారిపై చర్చ జరుగుతోంది. మరోవైపు కవిత విషయంలో దర్యాప్తు సంస్థల తీరు .. ఆ రెండు పార్టీలు ఒకటే అనుకునేలా చేశాయి. ఇదే అదనుగా బీజేపీలో ఉక్కపోతకు గురవుతున్న నేతల విషయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మైండ్ గేమ్ మొదలు పెట్టారు. బీజేపీలో చేరిన నేతలంతా ఇప్పుడు కాంగ్రెస్‌వైపు చూస్తున్నారని ప్రచారం జరగడంలో రేవంత్‌రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారు.
బీఆర్‌ఎస్‌తోనే ఢీ..
ఇక టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్‌కు ముఖాముఖి పోరు జరిగేలా ప్లాన్ చేస్తున్నారు. బీజేపీ అసలు రేసులో లేదన్న అభిప్రాయాన్ని ప్రజల్లో తీసుకువచ్చేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఇందు కోసం ప్రతీ అంశాన్ని ఉపయోగించుకుంటున్నారు. ముఖాముఖి పోరు అంటూ జరిగితే అది కాంగ్రెస్‌కు అడ్వాంటేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.
ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా..
తెలంగాణలో బీఆర్‌ఎస్ రెండుసార్లు అధికారంలో ఉంది. సహజంగానే ఆ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. మరోవైపు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, వారి అనుచరులు సాగిస్తున్న దౌర్జన్యాలు, అరాచకాలు, అక్రమ దందాలు, భూ కబ్జాలు.. ఆ పార్టీపై వ్యతిరేకతను మరింత పెంచాయి. అయితే వచ్చే ఎన్నికల్లో ఈ వ్యతిరేక ఓట్లుల చీలకుండా చేసేందకు రేవంత్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ముఖాముఖి పోరు జరిగితే అది కాంగ్రెస్‌కు లాభిస్తుందని భావిస్తున్నారు. బీజేపీ బలంగా ఉండి ఓట్లు చీలిపోతే బీఆర్‌ఎస్ విజయం సునాయాసం అవుతుందని లెక్కలు వేస్తున్నారు. కర్ణాటక విజయం ఇచ్చిన ఉత్సాహంతో ముఖాముఖి పోరు కోసం రేవంత్ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు.