Telugu News » Sports » Team india has big plans for the wtc final do you know what they are doing
WTC Final : డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం టీమిండియా పెద్ద ప్లాన్లు.. ఏం చేస్తుందో తెలుసా?
సుబ్ మన్ గిల్ ఈ ఆకుపచ్చ బంతితో క్యాచ్ ప్రాక్టీస్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారాయి. వీటి గురించి పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతోంది.
WTC Final : ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నెల ఏడో తేదీ నుంచి 11వ తేదీ మధ్య డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్ లండన్ వేదికగా జరగనుంది. ఈ ఫైనల్ పోరులో భారత్ – ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే భారత్ – ఆస్ట్రేలియా జట్లు మ్యాచ్ జరగనున్న లండన్ చేరుకున్నాయి. అక్కడ పరిస్థితులకు అలవాటు పడేందుకు భారత ప్లేయర్లు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే నెట్స్ లో ప్రాక్టీస్ ప్రారంభించారు. ఈ ప్రాక్టీస్ లో భారత ఆటగాళ్లు రంగుల బంతితో ప్రాక్టీస్ చేస్తుండడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
డబ్ల్యుటీసీ ఫైనల్ మ్యాచ్ కోసం భారత – ఆస్ట్రేలియా జట్లు జోరుగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. లండన్ చేరుకున్న ఇరు జట్ల ఆటగాళ్లు నెట్ ప్రాక్టీస్ లో బిజీగా ఉన్నారు. పోర్ట్స్ మౌత్ లోని అరుణ్డెల్ మైదానంలోని నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. నెట్ ప్రాక్టీస్ లో బ్యాటింగ్, బౌలింగ్ పైనే కాకుండా ఫీల్డింగ్ పై కూడా రోహిత్ సేన దృష్టి సారించింది. ఈ క్రమంలోనే రంగు రంగుల రబ్బరు బంతులతో భారత జట్టు క్యాచింగ్ ప్రాక్టీస్ చేస్తోంది. ఇంగ్లాండు వంటి స్వింగింగ్ పరిస్థితులున్న దేశాల్లో చివరి నిమిషాల్లో బంతి గమనంలో మార్పునకు ఆటగాళ్లు అలవాటు పడేందుకు ఈ ప్రత్యేక బంతులను వాడుతున్నారు. సుబ్ మన్ గిల్ ఈ ఆకుపచ్చ బంతితో క్యాచ్ ప్రాక్టీస్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారాయి. వీటి గురించి పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతోంది.
ప్రత్యేకంగా తయారు చేసిన బంతులతో ప్రాక్టీస్..
ఇంగ్లాండ్ లోని పరిస్థితులకు అలవాటు పడే ఉద్దేశంతో ముందుగానే భారత జట్టు ఆటగాళ్లు వెళ్లిపోయారు. కొద్ది రోజుల నుంచి ఇక్కడ ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే ప్రత్యేక బంతులతో ప్రాక్టీస్ చేస్తుండడం అభిమానులకు ఆసక్తిని కలిగిస్తోంది. ‘ఈ ఆకు పచ్చ బంతులు గల్లీ క్రికెట్ లో చూసేవి కావు. ఇవి ప్రత్యేకంగా తయారు చేయబడిన రబ్బరు బంతులు. ఇవి ఫీల్డింగ్ డ్రిల్స్ కోసం తయారు చేస్తారు. వీటిని రియాక్షన్ బాల్స్ అని అంటారు. వీటిని కొన్ని దేశాల పరిస్థితుల బట్టి మాత్రమే వాడతారు. ఎక్కువగా గాలి, చల్లని వాతావరణ పరిస్థితులు ఉండే ఇంగ్లాండు లేదా న్యూజిలాండ్ లో వీటిని ఫీల్డింగ్ ప్రాక్టీస్ కోసం ఉపయోగిస్తారు’ అని ఎంసీఏలో పని చేసిన ప్రముఖ ఫీల్డింగ్ కోచ్ ఒకరు బయటకు వెల్లడించారు.
ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రికెట్ అభిమానులు..
డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో జరిగిన తొలి డబ్ల్యూటిసి ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు న్యూజిలాండ్ చేతిలో ఘోరంగా ఓటమిని పాలైంది. ఈసారి పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టును భారత్ ఢీ కొట్టబోతోంది. ఈసారి ఎలాగైనా గధను దక్కించుకోవాలన్న లక్ష్యంతో భారత జట్టు ముందుకు సాగుతోంది. ఆస్ట్రేలియా జట్టు కూడా బలంగా ఉండడంతో ఈ టైటిల్ ఎవరికి దక్కుతుందో అన్న ఆసక్తి క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. సుమారు పదేళ్లుగా ఐసీసీ టోర్నీ గెలుచుకోలేక ఇబ్బంది పడుతున్న భారత జట్టు డబ్ల్యూటిసి ఫైనల్లో విజయం సాధించి ఆ లోటు తీర్చాలన్న కసితో ఉంది. అభిమానులు కూడా ఈ మ్యాచ్ కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.