Bhatti Vikramarka: యాదాద్రి వివాదంపై ఎట్టకేలకు స్పందించిన ‘భట్టి’.. సంచలన వ్యాఖ్యలు

భట్టి మంగళవారం ఎలాంటి వివరణ ఇచ్చాడంటే.. " నేను ఎవరికో తలవంచే రకం కాదు. రాష్ట్రాన్ని ఉప ముఖ్యమంత్రి హోదాలో పరిపాలిస్తున్నాను. ఆత్మగౌరవాన్ని చంపుకుని ఎంత స్థాయిలో నేను ఉండను.

Written By: Anabothula Bhaskar, Updated On : March 12, 2024 8:51 pm

Bhatti Vikramarka

Follow us on

Bhatti Vikramarka: యాదగిరిగుట్టలో సోమవారం జరిగిన ఘటనపై గులాబీ క్యాంప్ చేసిన రచ్చ.. సోషల్ మీడియాలో ఓ వర్గం చేసిన ప్రచారం.. మొత్తానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను తాకినట్టుంది. దీనికి సంబంధించి ఆయన మంగళవారం స్పందించారు. ఆ ఘటనపై సాగుతున్న చర్చకు అడ్డు పుల్ల వేశారు. వాస్తవానికి సోమవారం ముఖ్యమంత్రి రేవంత్, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, ఉత్తంకుమార్ రెడ్డి యాదగిరిగుట్ట వెళ్లారు. అక్కడ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో స్వామివారికి పూజలు చేశారు. అర్చకుల నుంచి ఆశీర్వచనాలు అందుకున్నారు. ఇక్కడ వరకు కథ మొత్తం సాఫీగానే జరిగిపోయింది. అయితే అక్కడ ముఖ్యమంత్రి, ఆయన సతీమణి, అటు కోమటిరెడ్డి, ఇటు ఉత్తంకుమార్ రెడ్డి కుర్చీలపై కూర్చున్నట్టు ఫోటోలో కనిపించింది. భట్టి విక్రమార్క, కొండా సురేఖ చిన్నపిట్టలపై కూర్చున్నట్టు అగుపించింది. ఇక దీనిపై నిన్నటి నుంచి చర్చ మొదలైంది. అసలు కాంగ్రెస్ వార్తలకు ప్రయారిటీ ఇవ్వని గులాబీ మీడియా దీని గురించి చర్చలు పెట్టింది. కవిత ఏకంగా భట్టి, సురేఖ తరఫున వకల్తా పుచ్చుకుంది. రేవంత్ బుక్కయ్యాడు అన్నట్టుగా గులాబీ అనుకూల సోషల్ మీడియా గ్రూప్ దారుణంగా విమర్శించింది. వాస్తవానికి ఆ ఫోటో చూస్తే భట్టి విక్రమార్కకు, సురేఖకు అవమానం జరిగినట్టుగానే కల్పించింది. చివరికి మాజీ కలెక్టర్ ఆకునూరి మురళి కూడా దీనిపై స్పందించారు. దీంతో తీవ్రంగా విమర్శలు వ్యక్తం అయ్యాయి.

ఈ సోషల్ మీడియా కాలంలో జరిగింది ఎవరికి అవసరం లేదు. కంటికి ఏది కనిపిస్తే అది నిజం అనుకోవడమే. సోమవారం జరిగింది కూడా అదే. కాకపోతే ఆ ఘటనను రేవంత్ పై దళిత వ్యతిరేకి అని ముద్ర వేసేందుకు గులాబీ పార్టీ ఉపయోగించుకుంది. అంతే వేగంగా దీనిపై రకరకాల ప్రచారాలు చేయడంతో జనంలోకి ఈజీగా వెళ్లిపోయింది. తీరా నష్టం జరిగిన తర్వాత.. గులాబీ పార్టీ కోరుకున్న ప్రయోజనం దక్కిన తర్వాత.. భట్టి విక్రమార్క స్పందిస్తే ఉపయోగం ఉంటుందా? దానిపై ఆయన ఇచ్చిన సమాధానం జనాలను ఆకట్టుకుంటుంది? ఛాన్సే లేదు.. ఏ మాటకా మాట పార్లమెంటు ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గులాబీ పార్టీ కోరుకున్న స్థాయిలో కాకపోయినా ఎంత కొంత నష్టం జరిగిందనేది మాత్రం వాస్తవం.

భట్టి మంగళవారం ఎలాంటి వివరణ ఇచ్చాడంటే.. ” నేను ఎవరికో తలవంచే రకం కాదు. రాష్ట్రాన్ని ఉప ముఖ్యమంత్రి హోదాలో పరిపాలిస్తున్నాను. ఆత్మగౌరవాన్ని చంపుకుని ఎంత స్థాయిలో నేను ఉండను. నేను యాదగిరిగుట్టలో వేద పండితులు ఆశీర్వచనం ఇస్తున్న సమయంలో చిన్న పీట మీద కూర్చున్నాను. ఫోటోను కావాలనే సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నారు. వారందరికీ నా ధన్యవాదాలు. పాదయాత్రలో భాగంగా యాదగిరిగుట్ట పైకి వెళ్లాను. ఆరోజు స్వామివారిని కోరుకున్న.. కావాలనే నేను కింద కూర్చొని స్వామి ఆశీర్వచనం తీసుకున్న. ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇల్లు ప్రారంభిస్తున్నామని కింద కూర్చున్న. ఇది ఎవరు కావాలని చేసింది కాదు. నేనే కింద కూర్చొని స్వామివారి సేవలో భాగమయ్యాను”.

వాస్తవానికి భట్టి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు. ఆయన తండ్రి కూడా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను శాసించారు. అతడి సోదరులు కూడా దాదాపు అదే స్థాయిలో చక్రం తిప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భట్టికి మాస్ ఫాలోయింగ్ ఉంది. పైగా ఆయన ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. రాహుల్ గాంధీ కూడా అత్యంత దగ్గర వాడు. అలాంటి వ్యక్తిని రేవంత్ కింద కూర్చోబెట్టగలడా? కావాలని కించపరచగలడా? అవమానానికి గురి చేయగలడా? ఒకవేళ తన ఆత్మ గౌరవానికి ఏమాత్రం ఇబ్బంది అనిపించినా భట్టి స్పందన వేరే విధంగా ఉండేది. కాకపోతే ఇప్పుడు భారత రాష్ట్ర సమితికి ఒక ప్రచారం కావాలి. అదికూడా కాంగ్రెస్ పార్టీపై చేయాలి. వెతకబోతున్న తీగ కాలికి తగినట్టు యాదగిరిగుట్ట సంఘటన ఆ పార్టీ నాయకులకు ఆయాచిత వరమైంది. పైగా ఇప్పుడు బహుజన సమాజ్వాది పార్టీ భారత రాష్ట్ర సమితి ఫోల్డ్ లోనే ఉంది. కాబట్టి ప్రవీణ్ కుమార్ స్పందించారు. గులాబీ పార్టీ కోరుకున్న కామెంట్స్ చేశారు. దానికి సిపిఐ (ఎం) కూడా జతయింది.

ఇక్కడ భట్టి చెప్పింది చాలా హుందాగా ఉంది. అలాంటప్పుడు మిగతా మంత్రులు, ముఖ్యమంత్రి, ఆయన సతీమణి కూడా కిందనే కూర్చుంటే బాగుండేది. అది కాంగ్రెస్ పార్టీ మైలేజ్ ని మరింత పెంచేది. రేవంత్ కు కూడా ప్లస్ అయ్యేది. వాస్తవానికి రేవంత్ కు, భట్టికి మంచి మంచి టర్మ్స్ ఉన్నాయి. గులాబీ పార్టీ కోరుకునేంత స్థాయిలో విభేదాలు లేవు. అయినా జనం ఇవేవీ పట్టించుకోరు. ఎందుకంటే వారి కళ్ళకు ఏది కనిపిస్తే అదే నిజం అనుకుంటారు. వాస్తవానికి ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద స్థాయి వ్యక్తులకు అక్కడి అర్చకులు లేదా ఈవో గర్భగుడిలో ఎర్రతీవాచివేసి అర్చనలు జరిపిస్తారు. నిన్నటి భద్రాచలం గుడిలో కూడా అదే జరిగింది. కానీ యాదగిరిగుట్టలోనే అనవసర వివాదం చెలరేగింది. అక్కడ ఈవో ఆ కుర్చీలు వేసి ఉండకుంటే ఇంత రచ్చ జరిగి ఉండేది కాదు. భట్టి వివరణ ఇచ్చినా గులాబీ క్యాంప్ ఊరుకోదు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల ముందు దానికి ఏదో ఒకటి కావాలి. అలాంటప్పుడు రేవంత్ రంగంలోకి దిగాలేమో..