Pawan Kalyan
Pawan Kalyan: 175 నియోజకవర్గాలు ఉన్న రాష్ట్రం ఏపీ. 100 స్థానాల్లో గెలిస్తే హ్యాపీగా ఐదు సంవత్సరాల అధికారం వెలగబెట్టొచ్చు. పాలనను సజావుగా చేసుకోవచ్చు. కానీ పవన్ మాత్రం కేవలం 24 స్థానాలనే పొత్తులో భాగంగా పొందగలిగారు. అందులో కూడా మూడు స్థానాలను త్యాగం చేశారు. అయితే రమారమి 144 స్థానాలను ఉన్న చంద్రబాబు మాత్రం ఎటువంటి త్యాగం చేయలేదు. కనీసం రాజకీయాలపై అవగాహన ఉన్నవారు పవన్ లాంటి త్యాగాలకు అంగీకరించరని.. కానీ చంద్రబాబు ఎలా చెబితే అలా పవన్ ఆడుతున్నాడు అన్న విమర్శలు ఎదురవుతున్నాయి.
తొలుత పవన్ అధికారంలో వాటా తీసుకుంటామని చెప్పుకొచ్చారు. తమ భాగస్వామ్యంతో ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని తేల్చి చెప్పారు. తప్పు జరిగితే ప్రశ్నిస్తామని.. బాధ్యతగా ఉంటామని.. రాష్ట్రాన్ని మోస్తామని.. ఇలా చాలా రకాల వ్యాఖ్యలు చేశారు. చివర ఆఖరుకు 21 స్థానాలకు పరిమితం అయ్యారు. అయితే తొలి జాబితా ప్రకటన సమయంలో 24 అసెంబ్లీ స్థానాలను దక్కించుకున్న పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అత్యంత శక్తివంతమైన గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు ఉంటాయి. కాబట్టి మేము పవర్ ఫుల్ గా 24 సీట్లు తీసుకున్నామంటూ సమర్థించుకున్నారు.
అయితే కూటమిలోకి బిజెపి ఎంట్రీ ఇవ్వడంతో.. చంద్రబాబు బదులు తాను త్యాగానికి సిద్ధమయ్యారు. గాయత్రి మంత్రంలోని అక్షరాల సంఖ్యను వదులుకునేందుకు ముందుకు వచ్చారు. ఇప్పుడు మిగిలిన 21 సీట్లను ఎలా సమర్థించుకుంటావ్ పవన్ అంటూ సోషల్ మీడియాలో రాజకీయ ప్రత్యర్థులు, అల్లరి మూకలు ప్రశ్నించడం ప్రారంభించాయి. రకరకాల ప్రశ్నలతో వేధిస్తున్నాయి. ప్రస్తుతం ఇవి వైరల్ గా మారుతున్నాయి.’ స్కాండియం యొక్క పరమాణు సంఖ్య 21. కోడి పొదగడానికి పట్టే సమయం 21 రోజులు. ఈరోజు తేదీ 12.. తిరగేస్తే వచ్చేది 21. వినాయకుడికి పూజ చేసే ఆకుల రకాలు 21. నేను ఏడు అడుగులు మూడుసార్లు వేసా..7*3=21. పెళ్లి చేసుకోవడానికి వయసు 21 ఏళ్లు. 21st సెంచరీ=21 సీట్లు, జగన్ పుట్టినరోజు 21′.. ఇలా చెప్పుకుంటూ పోస్టింగులు పెడుతున్నారు. పవన్ పై వ్యక్తిగత హననానికి దిగుతున్నారు. కానీ తక్కువ సీట్లు ఒప్పుకోవడం.. అందులోనూ సీట్లు త్యాగం చేయడం వంటి కారణాలతో ఏం స్పందించాలో జనసైనికులకు తెలియడం లేదు.