Seeta Rama Kalyanam: భద్రాచలంలో ఏటా సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. స్వామివారి కల్యానాన్ని తిలకించేందుకు తెలంగాణతోపాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి లక్షల మంది భక్తులు తరలి వస్తారు. ప్రత్యక్షంగా కళ్యాణ వేడుక చూసేందుకు వీలుకాని కోట్లాది మంది భక్తులు.. లైవ్ టెలికాస్ట్ ద్వారా టీవీల్లో వీక్షించి తరిస్తుంటారు. స్వామివారి కల్యాణం జరుగుతున్నంతసేపు భక్తిపారవశ్యంలో మునిగిపోతారు. అయితే ఈసారి లోక్‌సభ ఎన్నికల కోడ్ కారణంగా రాములోరి కల్యాణం టీవీల్లో వీక్షించే అవకాశం లేనట్లే కనిపిస్తోంది.
లైవ్ టెలికాస్ట్‌పై ఆంక్షలు
భద్రాద్రి రామయ్య కళ్యాణంపై ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ కాస్త ఎక్కువగానే పడినట్లు అనిపిస్తోంది. కళ్యాణం లైవ్ టెలికాస్ట్‌పై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. ప్రభుత్వ చానెల్‌లో ప్రసారం చేయకూడదని తెలిపింది. దీంతో దేవాదాయ శాఖ ఈసీకి లేఖరాసింది. లైవ్ టెలికాస్ట్‌కు అనుమతి ఇవ్వాలని కోరింది. అయితే ఎన్నికల కోడ్ కారణంగా భద్రాద్రి సీతారాముల కళ్యాణం లైవ్ టెలికాస్ట్‌కు అనుమతి ఇవ్వలేమని ఈసీ తేల్చి చెప్పింది. 40 ఏళ్లుగా స్వామివారి కళ్యాణాన్ని టీవీల్లో లైవ్ టెలికాస్ట్ చేస్తున్నామని, ఇప్పుడు ఇవ్వకపోవడం సరికాదని దేవాదాయ శాఖ మరోమారు రిక్వెస్ట్ చేసింది. లైవ్‌లో వేడుకలను కోట్ల మంది తిలకిస్తారని తెలిపింది. అయినా ఈసీ అనుమతి ఇవ్వలేదు.
వెళ్తారా?.. లేదా?..
ఇక ఏటా శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచల రామయ్యకు ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఎన్నికల కోడ్ కారణంగా సీఎం పర్యటనకు కూడా అనుమతి ఉంటుందా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిజాం కాలం నుంచి ఈ సంప్రదాయం వస్తున్నందున రాజకీయంగా కాకుండా ఈసారి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చేతలు మీదుగా రాముడికి పట్టువస్త్రాలు సమర్పించే అవకాశం కల్పిస్తుందని భావిస్తున్నారు. దీనిపై మంగళవారం సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.