CM Revanth Reddy: తెలంగాణలో త్వరలో కుల గణన చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికల సమయంలో ప్రజలకు హామీ ఇచ్చామని, మాటకు కట్టుబడి కులగణన చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈమేరకు చర‍్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలో బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమ విభాగాలపై శనివారం సీఎం సమీక్ష నిర్వహించారు. బీసీ కుల గణనపై సుదీర్ఘంగా చర్చించారు.
బీసీల ఉద్యమం..
బీసీ కుల గణన నిర్వహించి జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని బీసీ సంఘాలు చాలాకాలంగా ఉద్యమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో కొన్ని రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు కుల గణన నిర్వహిస్తున్నాయి. మన పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ లోనూ కుల గణన చేపట్టారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో కుల గణన అంశాన్ని చేర్చింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కులగణనపై నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
గురుకులాలకు సొంత భవనాల…
ఇక రాష్ట్రంలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న సంక్షేమ గురుకుల పాఠశాలల వివరాల ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు. వీటికి సొంత భవనాలు నిర్మించేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. ఈమేరకు స్థలాలు ఎంపిక చేయాలని ఆదేశించారు. ఒక్కో భవన నిర్మాణానికి ఎంత ఖర్చవుతుందో అంచనా వేసి బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తెలిపారు. హాస్టళ్లు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు ఇచ్చే డైట్, కాస్మోటిక్, వంట బిల్లులు పెండింగ్‌లో లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.