Telangana GSDP: “తెలంగాణ పాటిస్తున్నది.. దేశం అనుసరిస్తున్నది. సాధించింది చాలా ఉంది. సాధించాల్సింది ఇంకా ఉంది” కెసిఆర్ నిర్వహించే ప్రెస్మీట్ లలో, ఎన్నికల బహిరంగ సభలో పదేపదే అనే మాటలివి. కాంగ్రెస్ వాళ్లకు సోయి లేదు. అభివృద్ధి చేయాలనే తలంపూ లేదని ఎదురు ప్రశ్నిస్తాడు. ఇక ఆ నమస్తే తెలంగాణలో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అది ఏకంగా కేసీఆర్ లేకుంటే ఈ భూమి మీద తెలంగాణ అనే ప్రాంతమే లేదు అన్నట్టుగా బిల్డప్ ఇస్తుంది. సరే అవన్నీ పొలిటికల్ అవసరాలు, ప్రతిపక్ష పార్టీల మీద చల్లే బురదలు. మరి అసలు నిజాలు ఏంటి? నిజంగానే కెసిఆర్ చెబుతున్నట్టు తెలంగాణ వెలిగిపోతోందా? తెలంగాణ ఆ స్థాయిలో వెలిగిపోతుంటే ఉద్యోగుల జీతాలకు కూడా అప్పులు తీసుకురావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రశ్నలన్నింటికీ సమాధానమే ఈ కథనం.
భారీ ప్రచారం
కొన్ని సంవత్సరాలుగా భారత రాష్ట్ర సమితి తెలంగాణ అభివృద్ధిపై విపరీతమైన ప్రచారం మొదలుపెట్టింది. ప్రధానంగా స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి, రాష్ట్రాల తలసరి ఆదాయం, తలసరి విద్యుత్ వినియోగం, విద్యుత్ స్థాపిత సామర్థ్యం, రాష్ట్రంలో జరిగిన పారిశ్రామికీకరణ, హైదరాబాద్ అభివృద్ధి సూచికలలో మన రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని విపరీతమైన డబ్బా కొడుతోంది. కానీ ఇక్కడే అసలు విషయాలను దాస్తోంది. జి ఎస్ డి పి అంటే స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి. అంటే, ఒక రాష్ట్రంలో ఒక ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి అయిన మొత్తం వస్తువులు ( గూడ్స్), సేవల( సర్వీస్) మొత్తం విలువ. ఈ జి ఎస్ డి పి, తలసరి ఆదాయ లెక్కలను ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే “తెలంగాణ స్టాటిస్టికల్ రిపోర్ట్స్” లో ఉంటాయి. తాజాగా 2022వ సంవత్సరం సంబంధించి ప్రభుత్వం ప్రచురించిన నివేదికలో 2020_21 నాటికి తెలంగాణ రాష్ట్ర జిఎస్డీపీ, తలసరి ఆదాయ వివరాలు ఒకసారి పరిశీలిస్తే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి అంటే 2013_14 ఆర్థిక సంవత్సరంలో ఉన్న జీఎస్డీపీని, ప్రస్తుత 2020_21 సంవత్సర జిఎస్ డిపి తో పోల్చి చూస్తే.. 2013_ 14లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదు కాబట్టి ఆ సంవత్సరానికి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం వరకు జిఎస్డిపిని ప్రాతిపదికగా తీసుకుందాం. 2021_22, 2022_23 కు సంబంధించి కేవలం ప్రాథమిక అంచనాలు మాత్రమే ఉన్నాయి. అయితే వీటి వివరాలను దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా పెద్దగా పొందుపరచలేదు. కాబట్టి 2020_21 సంవత్సరాన్ని మాత్రమే ప్రస్తుత సంవత్సరంగా తీసుకోవాల్సి వస్తోంది.
ప్రస్తుత ధరల ఆధారంగా..
బహిరంగ మార్కెట్లో ప్రస్తుత ధరల ఆధారంగా తెలంగాణ జిఎస్ డిపి అత్యంత అద్వానంగా ఉంది. 2013_14 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ప్రాంత జిఎస్ డిపి రూ. 4,51,580 కోట్లు. 2013_14 లో దేశంలోని ఇతర రాష్ట్రాల్లో పోలిస్తే తెలంగాణది పదవ స్థానం. అప్పట్లో తెలంగాణ కంటే 1 మహారాష్ట్ర, 2 తమిళనాడు, 3 ఉత్తర ప్రదేశ్, 4
కర్ణాటక, 5 గుజరాత్, 6 పశ్చిమ బెంగాల్, 7 రాజస్థాన్, 8 కేరళ, 9 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉండేవి. ఇక 2020_21 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర జిఎస్డీపీ రూ.9,61,800 కోట్లు. అంటే దేశంలో ఇప్పటికి తెలంగాణ స్థానం పదే. ప్రస్తుతం తెలంగాణ కంటే 1 మహారాష్ట్ర, 2 తమిళనాడు, 3 ఉత్తర ప్రదేశ్, 4
కర్ణాటక, 5 గుజరాత్, 6 పశ్చిమ బెంగాల్, 7 ఆంధ్రప్రదేశ్, 8 రాజస్థాన్, 9 మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. ఇక ప్రస్తుతం ఆధారంగా తెలంగాణ రాష్ట్ర జిఎస్టిపి స్థానం కేసీఆర్ చెప్పినట్టు లేదు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో కొన్ని సౌలభ్యాలు చెంతకే వచ్చినప్పటికీ.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఉన్న అప్పులకు 9 రెట్లు అదనంగా అప్పులు చేసినప్పటికీ రాష్ట్ర జిఎస్ డిపి పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదని అర్థమవుతోంది. అధికారం కోసం, ప్రతిపక్షాల నోర్లు మూయించడానికి అధికార పక్షం ఎలాంటి గారడీ చేసిందో అర్థమవుతున్నది. ఇలాంటి విపత్కర పరిస్థితులు ఉన్నాయి కాబట్టే.. ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించలేని దుస్థితికి రాష్ట్ర ఆర్థిక శాఖ దిగజారిపోయింది.. ఉద్యోగులకు ఒకటో తారీఖు జీతాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఏకంగా ఎన్నికల మేనిఫెస్టో హామీల్లో పెట్టింది అంటే భారత రాష్ట్ర సమితి ప్రభుత్వ పనితీరును అర్థం చేసుకోవచ్చు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More