Liquor Sales: సాధారణంగానే తెలంగాణలో మద్యం అమ్మకాలు మిగతా రాష్ట్రాల్లో కంటే ఎక్కువగా ఉంటాయి. అయితే ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసుకున్న మద్యం షాపులకు ఈసారి మరింత బూస్ట్ ఇచ్చినట్లు అయింది. ఎందుకంటే కొత్తగా మద్యం షాపులు ఏర్పాటు చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికల వాతావరణం మొదలైంది. దీంతో గతంలో కంటే ఇప్పుడు మద్యం అమ్మకాలు పెరిగినట్లు అధికారిక లెక్కలు తెలుపుతున్నాయి. ప్రతినెల సాధారణంగా ఒక జిల్లాలో రూ. 50 కోట్ల వరకు మద్యం అమ్మకాలు జరుగుతూ ఉంటాయి. కానీ నవంబర్ నుంచి డిసెంబర్ వరకు రూ.3 కోట్లు అదనంగా విక్రయాలు జరిగినట్లు ఇటీవల వికారాబాద్ ఎక్సైజ్ అధికారులు తెలిపారు. అంటే మద్యంకు ఎంత ప్రాధాన్యత పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ పెరుగుదలకు కారణం ఏంటంటే?
ఎన్నికల వాతావరణం మొదలవగానే ప్రచార హోరు, హామీల వర్షం కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఓటర్లను ఆకట్టుకోవడానికి నాయకులు రకరకాల ప్రలోభాలకు గురి చేస్తూ ఉంటారు. ఇందులో మద్యం ఏరులై పారుతుంది. నవంబర్ 25వ తేదీన స్థానిక సంస్థల షెడ్యూల్ విడుదల అయినప్పటి నుంచి మద్యం అమ్మకాలు పెరిగినట్లు తెలుస్తోంది. నామినేషన్ల పర్వం మొదలైన సమయం నుంచి మద్యం అమ్మకాలు మరింతగా పెరిగాయి. ఈ అమ్మకాలు ఎలక్షన్ అయ్యే నాటికి మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు. అయితే గతంలో కంటే ఈసారి గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థిగా గెలిచేందుకు నాయకులు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ముందుకు వెళుతూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా వివిధ హామీలను ఇస్తున్నారు.
అయితే చాలామంది నాయకులు ముందే కొందరు ఓటర్లను గుర్తించి వారికి మద్యం సరఫరా ఇప్పటి నుంచే చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కుల సంఘాలు, ప్రత్యేక వర్గాలను ఆకట్టుకునేందుకు వారికి ప్రత్యేకంగా మందుతో విందు ఏర్పాటు చేస్తున్నట్లు కొందరు చర్చించుకుంటున్నారు. గ్రామాల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు నాయకులు ఎక్కువగా మద్యం వైపే చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో మాంసం విక్రయాలు కూడా జోరుగా సాగుతున్నాయి. గతంలో కంటే ఇప్పుడు మాంసం విక్రయాలు పెరగడంతో వీటి ధరలు కూడా పెరుగుతున్నాయి. కొన్నిచోట్ల డిమాండ్ ను బట్టి అదనపు రేట్ల తో విక్రయిస్తున్నారు. అయినా కూడా నాయకులు ఓటర్లను ఆకట్టుకునేందుకు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.
చాలామంది గతంలో సర్పంచులుగా పనిచేసే చాలా నష్టపోయామని చెబుతున్నా.. ఈసారి కొంతమంది అవేమీ పట్టించుకోకుండా సర్పంచ్ గా గెలిచి తీరాలని పట్టుబడుతున్నారు. అందుకోసం ఎంత ఖర్చైనా వెనకాడకుండా ఉండొద్దని భావిస్తున్నారు. ఇప్పటికే చాలామంది కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. పోలింగ్ తేదీ నాటికి మరింతగా హోటలను ఆకట్టుకునేందుకు రకరకాలుగా ఖర్చులు చేయనున్నారు. వీటిలో మద్యం, మాంసం విక్రయాలు జోరందుకునే అవకాశం ఉంది.