KTR doing good to Revanth: ఏ రాష్ట్రంలో అయినా.. చివరకు దేశంలో అయినా.. ప్రతిపక్షాలు అధికార పార్టీ మీద కొట్లాడుతుంటాయి. ప్రతిపక్ష హోదా ఉన్నదే అందుకు. ప్రజల సమస్యల పరిష్కారానికి సర్కారును నిలదీయడం.. ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లడం.. ఇది తంతు. కానీ.. అదేంటో తెలంగాణలో రివర్స్ సీన్ నడుస్తోంది. ప్రతిపక్షాలే ఒకరి మీద ఒకరు కొట్లాడేసుకుంటున్నాయి. ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు నేతలు తాపాత్రయపడుతున్నారు. నిత్యం బలప్రదర్శనకు దిగుతున్నట్లుగా పరిస్థితులను బట్టి చూస్తుంటే అర్థం అవుతోంది.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగుతోంది. బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. అటు మరో జాతీయ పార్టీ బీజేపీ కూడా ఉంది. అయితే.. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై కొట్లాడకుండా.. ఈ రెండు పార్టీలో గొడవపడుతుండడం ఇప్పుడు రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడాల్సిన నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఒకరిని ఒకరు టార్గెట్ చేసుకుంటున్నారు. చివరకు ఆ వివాదం లీగల్ నోటీసులు పంపించుకునే వరకూ వెళ్లడంతో మరింత చర్చకు దారితీసింది. వీరిద్దరు పొట్లాడుకొని రేవంత్ రెడ్డికి మేలు చేస్తున్నారా..? అన్న అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. అటు రాజకీయ నిపుణులు సైతంఇదే అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్న రెండు పార్టీల నేతలు గొడవ పడితే అధికార పార్టీకి మేలు జరుగుతుందే తప్పితే నష్టం ఉండదని అంటున్నారు. వీరి గొడవలతో ప్రజల సమస్యలు మూలకు పడే ప్రమాదం ఉందంటూ హెచ్చరిస్తున్నారు. అటు పథకాలను కూడా మరిచిపోయే ప్రమాదం ఉందని సూచిస్తున్నారు.
ఇటీవల బండి సంజయ్ ప్రెస్‌మీట్ పెట్టి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. కేటీఆర్ డ్రగ్స్ వాడడంతోపాటు.. డ్రగ్స్ అమ్ముతున్నారని అన్నారు. అంతటితో ఆగకుండా అధికారంలో ఉన్న సమయంలో ఫోన్ ట్యాపింగ్‌కూ పాల్పడ్డాడని అభిప్రాయపడ్డారు. దీంతో ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేగాయి. సంజయ్ వ్యాఖ్యలు మీడియా, సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. దీనిని అటు కేటీఆర్ సైతం సీరియస్‌గా తీసుకున్నారు. కేంద్ర మంత్రి హోదాలో ఉండి.. సంజయ్ తనపై నిరాధార ఆరోపణలు చేశారంటూ మండిపడ్డారు. ఆయనపై లీగల్‌గా వెళ్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తూ సంజయ్‌కి నోటీసులు పంపించారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం పోరాడుతున్న తనపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో తనకు, తన ఫ్యామిలీ పరువుకు భంగం కలిగిందని అభిప్రాయపడ్డారు. సంజయ్ చేసిన వ్యాఖ్యలకు వారంలోగా బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే లీగల్ ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. అయితే.. ఈ నోటీసులపై కేంద్ర మంత్రి సంజయ్ కూడా స్పందించారు. ఇప్పటివరకు మాటకు మాటతోనే సమాధానం ఇచ్చానని చెప్పారు. ఇకపై లీగల్ నోటీసులకు.. లీగల్ నోటీసులతోనే సమాధానం చెబుతానని చెప్పుకొచ్చారు. ఇలా.. ఇద్దరు కీలక నేతలు ఇలా రోడ్డున పడి కొట్టుకుంటుండడంతో రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ప్రతిపక్ష హోదాలో ఉండి ప్రజాసమస్యలపై పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు సూచిస్తున్నారు.