Producer Sivaramakrishna : పవన్ కల్యాణ్ ప్రొడ్యూసర్ కాస్త కబ్జాదారుడయ్యాడు.. వేలకోట్ల ప్రభుత్వ భూమికి స్కెచ్ వేశాడు.. చివరికి ఏం జరిగిందంటే..

ఆయన ఓ సినీ నిర్మాత. పేరు బూరుగుపల్లి శివరామకృష్ణ. 1999లో అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, ప్రీతి జింగానియాతో కలిసి తమ్ముడు అనే ఒక సినిమాను నిర్మించారు. ఆ నిర్మాత ఇప్పుడు అంత యాక్టివ్ గా లేరు. పెద్దగా సినిమాలు నిర్మించిన దాఖలాలు లేవు. అయితే ఆయన ఒకసారిగా ఇప్పుడు వార్తల్లో వ్యక్తి అయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

Written By: Anabothula Bhaskar, Updated On : October 23, 2024 3:27 pm

Producer Sivaramakrishna

Follow us on

Producer Sivaramakrishna : బూరుగుపల్లి శివరామకృష్ణ వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని తన వశం చేసుకోవడానికి నకిలీ పత్రాలు సృష్టించారు. 2002లో ఈ వ్యవహారానికి శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత ఆ భూమిని దక్కించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు. నాటి ప్రభుత్వం 2003లో హైకోర్టును ఆశ్రయించింది. ఆ కేసు కాస్త సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. చివరికి సుప్రీంకోర్టు బూరుగుపల్లి శివరామకృష్ణ దోషి అని నిర్ధారించడంతో.. ఆయన కబ్జాపర్వం వెలుగులోకి వచ్చింది. అంతేకాదు ఆయనను, ఆయనకు సహకరించిన ఇతర వ్యక్తులను హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు అరెస్టు చేసి.. రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు.

83 ఎకరాలపై కన్ను

తెలంగాణ రాష్ట్ర ఆర్కైవ్స్ అండ్ రీసర్చ్ ఇనిస్టిట్యూట్ కు రాయదుర్గంలోని సర్వే నెంబర్ 46 లో 83 ఎకరాల భూమి ఉంది. బహిరంగ మార్కెట్లో దీని విలువ వేల కోట్లు ఉంటుంది. ఈ భూమిని కబ్జా చేసేందుకు శివరామకృష్ణ ప్లాన్ వేశారు. ఆర్కైవ్స్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ డిపార్ట్మెంట్ సీనియర్ అసిస్టెంట్ చంద్రశేఖర్ తో కలిసి ఆ భూమికి సంబంధించి పత్రాలు తెప్పించుకున్నారు. తన పేరు మీద నకిలీవి సృష్టించుకున్నారు. ఆ భూమి తనదేనని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ప్రభుత్వం ఈ వ్యవహారంపై కోర్టుకు వెళ్ళింది. మరోవైపు ఎన్ని ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ జరీనా పర్వీన్ ఈ ఏడాది ఆగస్టులో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు జీరో ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి.. ఆ కేసును ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.

ఇలా వెలుగులోకి వచ్చింది

ఆర్కియాలజీ విభాగంలో షాజహాన్ చక్రవర్తి కాలం నుంచి మొగలుల వరకు.. అసఫ్జాహీల నుంచి బహమని, దక్కన్ రాజవంశాలు, కుతుబ్ షాహీ, ఆదిలాషాహి వరకు దాదాపు అత్యంత విలువైన రికార్డులను కలిగి ఉంది. ఈ రికార్డులను పూర్తిగా డిజిటలైజేషన్ చేస్తున్నారు. ఈ క్రమంలో రాయదుర్గంలోని 83 ఎకరాలు, ఇబ్రహీంపట్నం పరిధిలోని యాచారంలో పది ఎకరాల భూమికి సంబంధించిన పహాణీ, సేత్వార్ లు కనిపించలేదు. అయితే ఈ భూములు తనవేనని శివరామకృష్ణ గతంలో కోర్టును ఆశ్రయించడంతో అధికారులకు అనుమానం కలిగింది. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో 1993 నుంచి చంద్రశేఖర్ అనే వ్యక్తి రికార్డ్ అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు. అతన్ని శివరామకృష్ణ సంప్రదించి.. దగ్గర చేసుకున్నాడు. అతడి సహకారంతో అప్పటి రికార్డులలోని కీలకమైన పదాలను మాయం చేశాడు. దీంతో చంద్రశేఖర్ ను నాటి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆ తర్వాత హైకోర్టులో కేసు దాఖలు చేసింది. అయితే చంద్రశేఖర్ ద్వారా పత్రాలను సేకరించిన శివరామకృష్ణ.. రియల్ ఎస్టేట్ బిల్డర్ మారగోని లింగం గౌడ్ సహకారంతో వాటిని తన పేరు మీద మార్చుకున్నాడు. నకిలీ పత్రాలు సృష్టించి.. ఆ 83 ఎకరాల భూమి తనదని కోర్టుకు డాక్యుమెంట్లు సమర్పించాడు. ఆ తర్వాత హైకోర్టు నుంచి కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సుదీర్ఘ న్యాయ పోరాటం అనంతరం శివరామకృష్ణను సుప్రీంకోర్టు దోషి అని తేల్చింది. దీంతో శివరామకృష్ణను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం అక్కడ ఎకరం భూమి 100 కోట్ల వరకు పలుకుతోంది. ఈ లెక్కన ఆ భూమి విలువ 8,300 కోట్లు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ వ్యవహారాల్లో శివరామకృష్ణ, చంద్రశేఖర్, లింగం గౌడ్ మాత్రమే ఉన్నారా? ఇంకా ఎవరి పాత్రయినా ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు యాచారంలో పది ఎకరాల భూమి కబ్జాకు గురి కావడంతో.. దానిపై కూడా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.