CM Revanth Reddy : హైదరాబాద్ మహానగరంలో ఒకవైపున చెరువుల, నాళాల ఆక్రమణలు, మరోవైపున మూసీ ఆక్రమణలు తొలగించడంపై రేవంత్ సర్కార్ దూకుడు వివాదాస్పదంగా మారింది. హైడ్రా, హైదరాబాద్ పోలీస్, రెవెన్యూ శాఖలు చేపట్టిన ఈ కూల్చివేతలతో పేద, మధ్యతరగతి వర్గాలకు చెందినవారు తీవ్రంగా నష్టపోతుండడం,వారంతా రోడ్లెక్కి నిరసనలకు దిగుతుండడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. హైడ్రా ఆపరేషన్ సమయంలో గళం విప్పలేకపోయిన ప్రతిపక్షాలు తాజాగా నిర్వాసితుల తరుపున స్వరం విప్పుతున్నాయి.
మూసీ నిర్వాసితుల తరుపున ఉద్యమిస్తోన్న బీఆర్ఎస్: మూసీ కూల్చివేతల్లో నిరాశ్రయులయ్యే వారి తరుపున బీఆర్ఎస్ గట్టిగా నిలబడాలని నిర్ణయించింది. నిర్వాసితులకు పార్టీ తరుపున న్యాయ సహాయం చేయడమే కాదు అన్ని విధాలా అండగా ఉంటామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి , హరీష్ రావు, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హామీ ఇచ్చారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించి నిర్వాసితులయ్యే వారు భయపడవద్దని, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
గొంతు సవరించుకున్న బీజేపీ, సీపీఎం :
హైడ్రా ఆపరేషన్, మూసీ ప్రాజెక్ట్ విషయంలో పార్టీ నుంచి స్పష్టత లేకపోవడంతో బీజేపీ గందరగోళానికి లోనయ్యింది. మల్కాజిగిరి యంపీ ఈటెల రాజేందర్ మొదటి నుంచీ పేద, మధ్యతరగతి వర్గాల ఇల్లు కూల్చితే సహించేది లేదని, హెచ్చరిస్తుంటే, మెదక్ ఎంపీ రఘునందన్ రావు ,గోషా మహల్ ఎమ్మెల్యే రాజసింగ్ మాత్రం కూల్చివేతలని సమర్ధించారు. తాజాగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా కూల్చివేతల్ని వ్యతిరేకించారు. పేదల ఇళ్లు కూలిస్తే సహించబోమని హెచ్చరించారు. మరోవైపున మూసీ నిర్వాసితులు సోమవారం నిర్వహించిన కలెక్టరేట్ ధర్నాకు సీపీఎం మద్దతు ఇచ్చింది.
ఆలోచనలో పడ్డ రేవంత్ సర్కార్:
హైడ్రా దూకుడుపై హై కోర్టు కన్నెర్ర జేయడం, మూసీ ఆక్రమణల తొలగింపులపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత రావడంతో ప్రభుత్వంపై వత్తిడి పెరిగింది. నిర్వాసితులని ఒప్పించి, మెప్పించాకే వారు స్వచ్చంధంగా ఖాళీ చేశాకే మూసీ ఆక్రమణలు కూల్చాలనే డిమాండ్ బలపడుతోంది. సామాన్య, మధ్యతరగతి వర్గాల వారు కావడంతో ఏకపక్షంగా ఖాళీ చేయిస్తే పిల్లల చదువులు, తమ ఉపాధి కూడా కోల్పోవాల్సి వస్తుందని వాపోతున్నారు. ఈ పరిణామాలతో రేవంత్ సర్కార్ ఒత్తిడికి లోనవుతోంది. పిల్లలు, వృద్ధులు, మహిళలు పెద్ద సంఖ్యలో ఆందోళనల్లో పాల్గొంటుండడంతో ప్రభుత్వానికిబ్బందిగా మారింది.