Avinash Reddy: నిన్న పుంగనూరు.. నేడు పులివెందుల..వైసీపీ కౌన్సిలర్లు టిడిపిలోకి?

మొన్న ఎన్నికల ఫలితాల్లో ఓటమి అనంతరం జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల వెళ్లిన విషయం తెలిసిందే. ఐదు రోజుల పర్యటనకు గాను.. కేవలం మూడు రోజులు పార్టీ అక్కడ ఉన్న జగన్.. ఉన్నపలంగా బెంగళూరు వెళ్ళిపోయారు.

Written By: Dharma, Updated On : June 29, 2024 5:14 pm

Avinash Reddy

Follow us on

Avinash Reddy: పులివెందులలో ముసలం ప్రారంభమైందా? అధికార వైసీపీలో అసమ్మతి రేగిందా? అది మరింత పెరగనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పుంగనూరు మున్సిపాలిటీలో చైర్మన్ తో పాటు12 మంది కౌన్సిలర్లు టిడిపిలో చేరికకు రంగం సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పులివెందుల మున్సిపాలిటీలో కూడా కదలిక ప్రారంభమైనట్లు తెలుస్తోంది. మున్సిపల్ పాలకవర్గంలో మెజారిటీ కౌన్సిలర్లు నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

మొన్న ఎన్నికల ఫలితాల్లో ఓటమి అనంతరం జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల వెళ్లిన విషయం తెలిసిందే. ఐదు రోజుల పర్యటనకు గాను.. కేవలం మూడు రోజులు పార్టీ అక్కడ ఉన్న జగన్.. ఉన్నపలంగా బెంగళూరు వెళ్ళిపోయారు. పులివెందుల నియోజకవర్గంలో చేసిన పనులకు గాను బిల్లులు చెల్లించకపోవడంతో నేతల నుంచి తీవ్ర ఒత్తిడి పెరిగినట్లు సమాచారం. బిల్లులు ఎలా వస్తాయని వారంతా ప్రశ్నించడంతోనే జగన్ అక్కడి నుంచి వెళ్లిపోయారని తెలుస్తోంది. అయితే ఇన్ని రోజులు పాటు బిల్లులు చెల్లించని విషయాన్ని తన దృష్టికి ఎందుకు తీసుకు రాలేదని జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే ఇదంతా నేతల అసంతృప్తిని మెత్త బరిచేందుకే నన్న కామెంట్స్ ఉన్నాయి. అయితే కొంతమంది కౌన్సిలర్లు బిల్లుల కోసం అవసరమైతే టీడీపీలోకి వెళ్లి పోతామని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి పులివెందుల మున్సిపల్ కౌన్సిలర్లతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నం చేశారు.

జగన్ తరువాత పార్టీలో నెంబర్ 2 గా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గం పుంగనూరులో అధికార వైసీపీలో తిరుగుబాటు ప్రారంభమైన సంగతి తెలిసిందే. పుంగనూరు మున్సిపల్ చైర్మన్ తో పాటు 12 మంది కౌన్సిలర్లు పార్టీ మారేందుకు సిద్ధపడ్డారు. మూకుమ్మడిగా అందరు కౌన్సిలర్లు ఒకేసారి టిడిపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు పులివెందులలో సైతం పుంగనూరు ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. కోట్లాది రూపాయలతో పనులు చేపట్టిన కౌన్సిలర్లకు ఇంతవరకు బిల్లులు కాలేదు. న్యాయ పోరాటం చేస్తామని జగన్ చెప్పినా.. గత ఐదేళ్లలో టిడిపి నేతలకు చెల్లించాల్సిన బిల్లుల విషయంలో జరిగిన వ్యవహారం తెలియంది కాదు. అందుకే మెజారిటీ కౌన్సిలర్లు పార్టీ మారేందుకు సిద్ధపడినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి ఎంపీ అవినాష్ రెడ్డి వారితో సమావేశమై సముదాయించినా, సర్దుబాటు చేసినా.. ఎక్కువమంది పార్టీ మారేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.