Chandrababu Heritage Foods : గత ఏడాది చివర్లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఇక అటు ఆంధ్రప్రదేశ్లోనూ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఓడిపోయింది. చంద్రబాబు – పవన్ కళ్యాణ్ – బిజెపి కలయికలతో ఏర్పడిన కూటమి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు.. అటు రేవంత్.. ఇటు చంద్రబాబు రెండు తెలుగు రాష్ట్రాలను ఏలుతున్న నేపథ్యంలో.. ఇక్కడ కూడా ఒక సెక్షన్ పైకి లేస్తోంది. పెట్టుబడులు.. కంపెనీలు.. ప్రభుత్వ భూములు.. ఇలా రకరకాల వ్యవహారాలు సాగుతున్నాయి. రేవంత్ ఒకప్పటి టిడిపి కాంపౌండ్ ఎమ్మెల్యే. చంద్రబాబుకు అత్యంత ఇష్టమైన నాయకుడు. పైగా వారిద్దరి మధ్య విభేదాలు ఎన్నడూ లేవు.. ఇటీవల రేవంత్ తో చంద్రబాబు భేటీ అయ్యారు. విభజన సమస్యలపై మాట్లాడుకున్నారు. పరస్పరం ఒక అంగీకారంతో సమస్యలను పరిష్కరించుకోవాలనే అభిప్రాయానికి వచ్చారు.. ఇదేం చంద్రబాబు వర్సెస్ కేసీఆర్ జమానా కాదు కాబట్టి.. పెద్దగా రెండు రాష్ట్రాల మధ్య తగాదాలు లేవు. తగువులు అంతకన్నా లేవు. బట్టర్ అండ్ బ్రెడ్ లాగా సాగిపోతుంది.
చంద్రబాబు కుటుంబ సభ్యుల కంపెనీ విస్తరణ
రేవంత్ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి.. చంద్రబాబు కుటుంబ సభ్యుల కంపెనీ హెరిటేజ్ విస్తరణను కొనసాగిస్తోంది. గతంలో వారికి ప్రణాళికలు ఉన్నప్పటికీ.. ఎందుకనో వాటిని ఆశించిన స్థాయిలో అమల్లో పెట్టలేకపోయారు. ఇప్పుడు ఎలాగూ రేవంత్ అనుకూలమైన ముఖ్యమంత్రి కాబట్టి విస్తరణకు ప్రణాళికలు రూపొందించారు. ఇందులో భాగంగా హైదరాబాదు నగరానికి దగ్గర్లో ఉన్న షామీర్ పేట ప్రాంతంలో 204 కోట్ల పెట్టుబడితో హెరిటేజ్ ఐస్ క్రీం ప్లాంట్ ఏర్పాటు చేయబోతోంది. దీనికి సంబంధించి బోర్డు సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి కూడా అనుమతులు వచ్చాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది నవంబర్ లోగా ప్లాంట్ ప్రారంభమవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఐస్ క్రీమ్ కు ఉన్న గిరాకీని దృష్టిలో పెట్టుకొని ఈ యూనిట్ నెలకొల్పామని హెరిటేజ్ చెబుతోంది. ఇక్కడి నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు ఐస్ క్రీమ్ సరఫరా చేస్తామని హెరిటేజ్ వివరిస్తోంది. ఈ ప్లాంట్ నిర్మాణ బాధ్యతలను చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి పర్యవేక్షిస్తున్నారు. హెరిటేజ్ ఐస్ క్రీమ్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో సహజంగానే భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా విభాగం.. వైసిపి సోషల్ మీడియా విభాగం ఎదురుదాడి మొదలుపెట్టాయి. తెలంగాణ రాష్ట్రంలో తన గురువుకు రేవంత్ రెడ్డి మేళ్లు చేసే పనిలో బిజీగా ఉన్నాడని ఆరోపించడం ప్రారంభించాయి. అయితే దీనిపై అటు టిడిపి సోషల్ మీడియా విభాగం, ఇటు కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం సైలెంట్ గా ఉన్నాయి. చూడాలి ఏం జరుగుతుందో?!