Somnath Shiveshwara Temple Triveni Sangam: తెలంగాణ రాష్ట్రంలో గోదావరి,క్రిష్ణ, ప్రాణహిత, ఇంద్రావతి వంటి జీవనదులు ప్రవహిస్తాయి. ఈ నదుల పరివాహకంలో మెండుగా పంటలు పండుతాయి. గోదావరి పరివాహకంలో సారవంతమైన నేలలు ఉన్నాయి. ఈ ప్రాంతాలలో విస్తారంగా పంటలు పండుతాయి. తెలంగాణ రాష్ట్రంలో మేజర్ ప్రాజెక్టులు మొత్తం గోదావరి నది మీదనే నిర్మితమయ్యాయి.
జీవనదులు అనేకం ఉన్న తెలంగాణ రాష్ట్రంలో త్రివేణి సంగమం కూడా ఉంది. చరిత్రకారుల పరిశోధనలో ఇప్పుడు మరోత్రివేణి సంగమం వెలుగులోకి వచ్చింది. కాళేశ్వరం సమీపంలో ఈ త్రివేణి సంగమం ఉంది. మేడిగడ్డ ఎత్తిపోతల పథకానికి 20 కిలోమీటర్లదూరంలో సోమనాథం శివేశ్వరాలయం ఉంది.
శివేశ్వరాలయంలో గోదావరి, ప్రాణహిత, ఇంద్రావతి నదులు కలుస్తాయి. దీనిని త్రివేణి సంగమం అని పిలుస్తారు. వరంగల్ జిల్లాకు చెందిన చరిత్రకారులు శ్యాంసుందర్, నరేందర్, నాగేశ్వరరావు పరిశీలనలో త్రివేణి సంగమం వెలుగులోకి వచ్చింది. స్థానికులు ఇక్కడ కొలువై ఉన్న శివుడికి నిత్యం పూజలు చేస్తారు. కాకపోతే దీనిని త్రివేణి సంగమం అని పిలుస్తారని వారికి తెలియదు.
ఇక్కడ మూడు నదులు కలుస్తాయి కాబట్టే శివుడు కొలువై ఉన్నాడని చరిత్రకారులు చెబుతున్నారు. త్రివేణి సంగమంవద్ద శివుడు కొలువై ఉన్నాడంటే.. ఇక్కడి ప్రాంతాలను మరింత లోతుగా పరిశీలిస్తే ఇంకా చాలా విషయాలు తెలుస్తాయని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు.
ఇక్కడ కొలువై ఉన్న శివుడిని, శివాలయాన్ని డెవలప్ చేస్తే ఆధ్యాత్మిక క్షేత్రంగా మారుతుందని స్థానికులు అంటున్నారు. మేడిగడ్డ ఎత్తిపోతల పథకం నిర్మించిన కొంత దూరంలో శివుడు కొలువై ఉండటం ఈ ప్రాంతం గొప్పదనాన్ని సూచిస్తోందని చరిత్రకారులు చెబుతున్నారు.
ఈ త్రివేణి సంగమంలో నిత్యం నీళ్లు ఉంటాయి. ఎంతటి కరువు కాటకాలు వచ్చినప్పటికీ అక్కడ నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. పైగా ఆ ప్రాంతం మొత్తం ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరుగా ఉంటుంది. అందువల్లే ఈ ప్రాంతంలో శివుడు కొలువై ఉన్నాడని చరిత్రకారులు చెబుతున్నారు. శివుడు ఈ ప్రాంతంలో నడయాడిన చరిత్ర తెలుసుకోవాలంటే లోతైన పరిశీలన చేయాల్సిన అవసరం ఉందని చరిత్రకారులు అంటున్నారు. తెలంగాణలో ఇప్పటికే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో త్రివేణి సంగమం ఉంది . ఇప్పుడు ఇదే జిల్లా పరిధిలో మరో త్రివేణి సంగమం వెలుగులోకి రావడంతో ఈ ప్రాంతం మరోసారి చర్చనీయాంశంగా మారింది.