CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి దూకుడు కొనసాగిస్తున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన రోజే రిటైర్ అయినా సలహాదారు పోస్టుల్లో కొనసాగుతున్న ఏడుగురిని తొలగించారు. తర్వాత రెండు రోజులకే.. ఆరు గ్యారంటీ హామీల్లో రెండు అమలులోకి తెచ్చారు. తాజాగా రాష్ట్రంలో పలు కార్పొరేషన్ ఛైర్మన్ల నియామకాలు, పదవీకాలం పొడిగింపు నిర్ణయాలను రద్దు చేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేశారు.
54 మంది ఊస్ట్..
మొత్తం 54 మంది కార్పొరేషన్ ఛైర్లన్లు నియామకాలు దర్దు చేస్తున్నట్లు ఆదివారం (డిసెంబర్ 10) ప్రకటించింది. వీరంతా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఛైర్మన్లుగా బాధ్యతలు స్వీకరించారు. తాడికొండ రాజయ్య, కొండబాల కోటేశ్వరరావు, గట్టు తిమ్మప్ప, మార గంగారెడ్డి, కంచర్ల రామకృష్ణారెడ్డి, వరప్రసాద్ రావు, వేద రజిని, పిట్టల రవీందర్, దూదిమెట్ల బాలరాజు యాదవ్, భరత్ కుమార్, పల్లె రవికుమార్, నంది కంటి శ్రీధర్, రవీందర్ సింగ్, ఆయాచితం శ్రీధర్, ప్రొఫెసర్ కె.లింబాద్రి.. తదితర మొత్తం 54 మంది కార్పొరేషన్ ఛైర్మన్ల పదవులు రద్దయ్యాయి.
కేసీఆర్ కు పరామర్శ..
డిసెంబర్ 7న రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అదేరోజు సాయంత్రం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి విద్యుత్ శాఖపై సమీక్ష చేశారు. మరుసటి రోజు ప్రజాభవన్ లో ప్రజా దర్బార్ నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా దరఖాస్తులు స్వీకరించారు. మధ్యాహ్నం విద్యుత్ శాఖపై పూర్తి సమీక్ష చేశారు. డిస్కంలు 80 వేల కోట్ల రూపాయల అప్పులు ఉన్నట్లు తేల్చారు. సాయంత్రం ఢిల్లీ వెళ్లి మంత్రుల శాఖలు తేల్చారు. శనివారం అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే లతో ప్రమాణం చేయించారు. ఆదివారం యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్ ను పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.