Ande Sri Passed away : తెలంగాణ ఉద్యమంలో ఆయన గళం ఉవ్వెత్తున ఎగిసింది. ఆయన కలం మహోజ్వలంగా రాసింది. తెలంగాణ ఆకాంక్షను.. ఉద్యమ అవసరతను నొక్కి చెప్పింది. నాటి పాలకులను ధిక్కారస్వరం లాగా ప్రశ్నించింది.. ఉద్యమాన్ని ఒక దీప శిఖ లాగా నిలబెట్టింది. సంవత్సరాలుగా సాగిన ఉద్యమంలో ఆయన ప్రమేయం ప్రత్యక్షంగా ఉండేది. అటువంటి కవి.. ఉద్యమాన్ని ముందుండి నడిపిన ప్రభా రవి ఆస్తమించారు. తన పాట ద్వారా.. తన మాట ద్వారా యావత్ తెలంగాణను ప్రభావితం చేసిన ప్రజా కవి
అందెశ్రీ కన్నుమూశారు.
జయ జయహే తెలంగాణ గేయం ద్వారా విశేషమైన గుర్తింపు సంపాదించుకున్న అందెశ్రీ(64) ఇక లేరు. అందెశ్రీ అసలు పేరు అంజయ్య. సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్ నగరంలో లాలాగూడ ప్రాంతంలో ఉంటున్న ఆయనకు ఆకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. చూస్తుండగానే కుప్పకూలిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆయన కన్నుమూశారని వైద్యులు చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. నిన్నటిదాకా తమతో మాట్లాడిన వ్యక్తి.. ఇంట్లో చలాకీగా తిరిగిన వ్యక్తి కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు.. అందెశ్రీ కన్నుమూశారని తెలిసి సాహితీ అభిమానులు.. తెలంగాణ ఉద్యమకారులు ఆయన పార్థివ దేహాన్ని చూసేందుకు గాంధీ ఆసుపత్రికి వెళ్తున్నారు.
అందెశ్రీ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ల్యబర్తి గ్రామంలో జన్మించారు. చిన్నప్పటినుంచి ఆయనకు ధిక్కార స్వభావం అధికంగా ఉండేది. అదే ఆయనను ప్రశ్నించే వ్యక్తిగా మార్చింది. సాహితీ అభిలాష కూడా అందెశ్రీ కి చాలా ఎక్కువగా ఉండేది. అందువల్లే ఆయన విశేషమైన పాటలు.. అద్భుతమైన రచనలు చేశారు. అంతేకాదు తెలంగాణ గీత రచయితగా పేరు తెచ్చుకున్నారు.. ప్రకృతిని ఇష్టపడేవారు. ప్రజాకవిగా సమస్యలను తన సాహిత్యానికి ఇతివృత్తంగా చేసుకున్నారు. “మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు” అనే పాట ద్వారా అద్భుతమైన గుర్తింపు సంపాదించుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో “జయహే జయహే తెలంగాణ” అనే పాటను రాసి ఉద్యమానికి సరికొత్త రూపు తీసుకొచ్చారు. గడిచిన 10 సంవత్సరాల కాలంలో జయ జయహే పాట పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేదు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి అందెశ్రీ రాసిన ఆ పాటను రాష్ట్ర గీతంగా ప్రకటించారు. అంతేకాదు ఆయనకు కోటి రూపాయల పురస్కారం అందించారు..