Amrutha Pranay : తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా, దేశవ్యాప్తంగా ఈ సంఘటన సంచలనం సృష్టించింది. నాడు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ ఘటనలో నల్గొండ కోర్టు నిందితులకు సోమవారం శిక్ష విధించింది. ఈ కేసులో A6 గా ఉన్న శ్రావణ్ (అమృత బాబాయ్) కు నల్గొండ కోర్టు జీవిత ఖైదు విధించింది. దీంతో అతని భార్య పిల్లలు కోర్టు ప్రాంగణంలోనే కన్నీటి పర్యంతమయ్యారు..” మా నాన్నకు ఈ కేసుతో సంబంధం లేదు. ఆయన ఎటువంటి తప్పు చేయలేదు. తెల్ల పేపర్ మీద సంతకం పట్టించుకున్నారు. ఒక ఆధారం కూడా మా నాన్నకు వ్యతిరేకంగా లేదు. మొత్తం అమృతనే చేసింది. అన్నిటికి ఆమె కారణం. ఈ పరిస్థితుల్లో మా కుటుంబం మొత్తం ఆగమైంది. మా నాన్న లేకుండా మేము ఉండలేం. ఇప్పటికే మా నాన్న మాకు దూరమై ఐదు సంవత్సరాలయింది. ఇప్పటికే చాలా ఇబ్బంది పడ్డాం. పడుతూనే ఉన్నాం. చివరికి కోర్టు ఇలా తీర్పు చెప్పింది. అమృత చేసిన నిర్వాకం వల్ల మా కుటుంబం మొత్తం నాశనమైంది. మా నాన్న మాకు దూరం కావడంతో మా అమ్మ ఆరోగ్యం పాడయింది. ఆమెకు నిత్యం ఆసుపత్రిలో చూపించాల్సిన పరిస్థితి ఏర్పడిందని” అమృత బాబాయ్ కూతురు విలపిస్తూ చెప్పింది.
నాడు ఏం జరిగిందంటే..
నాడు 2018 సెప్టెంబర్ 14న కిరాయి వ్యక్తులు ప్రణయ్ పై దారుణానికి పాల్పడ్డారు. ఈ కేసును విచారించడం మొదలుపెట్టిన పోలీసులు.. 2019లో పూర్తి చేశారు. 8 మంది నిందితులపై చార్జ్ షీట్ దాఖలు చేశారు. కేసుకు సంబంధించి కోర్టులో ఐదు సంవత్సరాల పాటు విచారణ జరిగింది. ఇటీవల ఆ ప్రక్రియ ముగిసింది.. తీర్పును ఇన్నాళ్లపాటు రిజర్వులో ఉంచిన న్యాయమూర్తి.. సోమవారం తుది తీర్పును వెల్లడించారు. ఈ ఘటనలో ఒకరికి మరణశిక్ష విధించారు. మిగిలిన వారికి జీవిత ఖైదు విధించారు. ఇక ఈ కేసులో అమృత తండ్రి మారుతీ రావు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మిగతా ముగ్గురు నిందితులు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు.. ఇక నలుగురు బెయిల్ మీద బయట ఉన్నారు.. తీర్పు నేపథ్యంలో వారందరినీ పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. ఇక ఈ కేసులో అమృత తండ్రి మారుతీరావు ఏ 1 గా ఉన్నాడు. ప్రణయ్ పై దారుణానికి పాల్పడిన సుభాష్ శర్మ ఏ 2 గా ఉన్నాడు. సుభాష్ శర్మ కు నల్గొండ కోర్టు మరణ శిక్ష విధించింది. ఏ 3 గా ఉన్న అజ్గర్ అలీ, ఏ 4 గా ఉన్న అబ్దుల్ భారీ, ఏ 5 గా ఉన్న ఎం ఏ కరీం, ఏ 6 గా ఉన్న తిరునగరు శ్రవణ్ (మారుతీ అవ సోదరుడు), ఏ 7 గా ఉన్న సముద్రాల శివ (మారుతిరావు డ్రైవర్), ఏ 8 గా ఉన్న నజీమ్(ఇతడు నిందితులు ప్రయాణించిన ఆటోకు డ్రైవర్ కం ఓనర్) కు నల్గొండ కోర్టు జీవిత ఖైదు విధించింది.