Graduate MLC Election : తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జనవరి చివరి వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీతోపాటు, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు 2025, ఫిబ్రవరిలో ఖాళీ కానున్నాయి. ఈ మూడు స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కసరత్తు మొదలు పెట్టింది. దీంతో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తున్నాయి. మరోవైపు ఇటీవల పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేసిన అన్ని స్థానాల్లో ఓడిపోయి పరువు పోగొట్టుకున్న బీఆర్‌ఎస్.. ఎమ్మెల్యే ఎన్నికలతో మళ్లీ సత్తా చాటాలని చూస్తోంది. దీంతో తెలంగాణలో మూడు పార్టీలకు ఎమ్మెల్సీ ఎన్నికలు కీలకం కానున్నాయి. దీంతో మూడు పార్టీలు అభ్యర్థుల ఎంపికపై దృష్టిపెట్టాయి. తాజాగా బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై సమావేశం నిర్వహించింది. పార్టీ రాష్ట్ర కార్యలయంలో నిర్వహించిన సమావేశానికి జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి హాజరై నేతలకు దిశానిర్దేశం చేశారు. రెండు మూడు రోజుల్లో పార్టీ అభ్యర్థులను ఖరారు చేస్తామని ప్రకటించారు. మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ గెలవాలని సూచించారు. మూడు నియోజకవర్గాల్లో ఓటరు నమోదు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి సానుకూల ఫలితాలు రాబట్టాలని తెలిపారు.
విద్యా సంస్థల చైర్మన్‌కు టికెట్..
బీజేపీ కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాష్ట్రంలోని ప్రముఖ విద్యాసంస్థల చైర్మన్‌ను బరిలో దించాలని యోచిస్తున్నట్లు తెలిస్తోంది. ఆయన కూడా బీజేపీ టికెట్ ఇస్తే పోటీకి సై అన్నట్లు తెలిసింది. ఈమేరకు కమలం పార్టీ పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. బీజేపీ నుంచి టికెట్ కోసం చాలా మంది పోటీ పడుతున్నారు. అయితే ఉత్తర తెలంగాణలోని ఈ నాలుగు జిల్లాల్లో విద్యాసంస్థలు నెలకొల్పిన వ్యక్తి అందరికీ సుపరిచితుడు కావడంతో ఆయననే నిలపాలన్న ఆలోచనలో కమలం పెద్దలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈమేరకు రెండు మూడు రోజులు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
పోటీలో అల్ఫోర్స్ చైర్మన్..
ఇదిలా ఉంటే.. నెల క్రితమే అల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్‌వి. నరేందర్‌రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉంటానని ప్రకటించారు. తన అభ్యర్థిత్వాన్ని బలపర్చాలని కోరారు. ఈమేరకు ప్రచారం కూడా చేసుకుంటున్నారు. ఒకపైపు ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని నిర్ణయించుకున్న ఆయన.. ఇప్పుడు ఓ జాతీయ పార్టీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారని తెలిసింది. పార్టీ టికెట్ అయితే విజయం సులభం అవుతుందన్న భావనలో నరేందర్‌రెడ్డి ఉన్నారని సమాచారం ఈ క్రమంలో బీజేపీ నేతలు కూడా విద్యా సంస్థల చైర్మన్‌కు టికెట్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో నరేందర్‌రెడ్డి కమలం గుర్తుపై ఎన్నికల బరిలో దిగుతారన్న ప్రచారం జరుగుతోంది.