Telangana Congress Party State Incharge : దశాబ్ద కాలం ఎదురుచూపుల తరువాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. గద పదేళ్లు ఒన్నో ఒడిదుడుకులు చూసింది ఆ పార్టీ. ఎంతో మంది కేడర్‌ను కోల్పోయింది. పదేళ్ల పాటు పార్టీని నమ్ముకుని ఉన్న వారి సంఖ్య కూడా తక్కువే. చాలా మంది సీనియర్లు పార్టీని వీడి మరో పార్టీ గూటికి చేరినా.. కొంత మంది మాత్రం అన్నిరకాల పరిస్థితులను దీటుగా ఎదుర్కొని ముందుకు సాగారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డిలో కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆ పార్టీలో కొంత ఊపు వచ్చింది. అదే ఊపును కొనసాగించిన పార్టీ చివరకు రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకుంది.
కట్‌చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి పది నెలలు కావస్తోంది. అయితే.. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జిగా దీపాదాస్ మున్షీ కొనసాగుతున్నారు. ఆమె వైఖరి ఇప్పుడు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ చర్చకు దారితీస్తోంది. గతంలో పార్టీలో చేరికల విషయంలో ఆమె పార్టీలో ఇన్వాల్వ్ అయి దూకుడుగా వ్యవహరించారని టాక్. అయితే.. పార్టీ వ్యవహారాల్లో ఊహించిన దానికంటే ఆమె ఎక్కువ జోక్యం చేసుకుంటుండడంతో పార్టీ నేతలను అసంతృప్తికి గురిచేసింది. అంతేకాకుండా.. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లోనూ ఆమె ఇన్వాల్వ్ అవుతుండడంతో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఆగ్రహంతో ఉన్నారు. ఆమెకు చెప్పలేక అయోమయంలో ఉన్నారు.
అయితే.. ఇదే విషయాన్ని ఇటీవల పలువురు పార్టీ ముఖ్యనేతలు కాంగ్రెస్ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. దాంతో ఆ సమయంలో ఆమె మార్పు తప్పనిసరి అనే టాక్ నడిచింది. ఈ విషయం కాస్త మున్షీ చెవిన పడింది. దాంతో ఆమె తన సీటును కాపాడుకునే ప్రయత్నంలో ఉండిపోయారు. వెంటనే హుటాహుటిన హైకమాండ్ వద్దకు వెళ్లారు. పార్టీ పెద్దలను కలిశారు. మరికొన్ని రోజులపాటు తాను తెలంగాణ ఇంచార్జిగా కొనసాగుతానని రెక్వెస్ట్ పెట్టుకున్నారు. ఆమె ఇక్కడే పాతుకుపోవాలని ప్రయత్నించారు. దాంతో హైకమాండ్ కూడా ఆమె రెక్వెస్ట్‌ను కన్సిడర్ చేసినట్లు తెలిసింది.
తెలంగాణ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జిగా రాహుల్ గాంధీ అనుచరుడు నియామకం అవుతున్నట్లు ప్రచారం జరిగింది. ఛతీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ నియామకం అవుతున్నారని టాక్ వినిపించింది. కానీ.. మున్షీ అభ్యర్థనతో వెనక్కి తగ్గినట్లు సమాచారం. అయితే.. మున్షీ వ్యవహారం పార్టీలో రోజురోజుకూ కోపానికి దారితీస్తోంది. రాష్ట్రంలో ఇంతకాలం తరువాత అధికారంలోకి రావడంతో చాలా మంది ఆశావాహులు నామినేటెడ్ పదవుల కోసం వేచి చూస్తున్నారు. ముందు నుంచి పార్టీని పట్టుకొని ఉన్న వారికి కాకుండా మున్షీ ఇష్టారాజ్యంగా జోక్యం చేసుకొని పలువురిని రెకమండ్ చేస్తున్నారట. ఆ విషయం కాస్త రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలకు నచ్చడం లేదు. నామినేటెడ్ పోస్టుల్లో జోక్యం చేసుకోవడానికి వారు తట్టుకోలేకపోతున్నారు. అటు కార్యకర్తలు సైతం మున్షీపై కోపంతో ఊగిపోతున్నారు. పార్టీ కోసం ముందు నుంచి కష్టపడిన వారిని కనీసం గాంధీభవన్ మెట్లు తొక్కనివ్వడం లేదని ఆమెపై ఫైర్ అవుతున్నారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఇప్పుడు గాంధీభవన్ వర్గాల్లో పూర్తిగా ఇదే చర్చ నడుస్తోంది.