WPL 2026 DC Vs RCB: ఒక జట్టుకు నాయకత్వం వహించడం అంటే అంత ఈజీ కాదు. పరుగులు చేయడంలో ముందుండాలి లేదా వికెట్లు తీయడంలో అగ్రభాగంలో ఉండాలి. ఫీల్డింగ్ లో చురుకైన పాత్ర పోషించాలి. ప్లేయర్లతో సమన్వయం సాధించాలి. నిన్న జరిగినప్పుడే ఆ సారధికి విలువ ఉంటుంది. జట్టుపై పట్టు ఏర్పడుతుంది. విజయం సాధించడానికి దారి ఏర్పడుతుంది. ప్రస్తుతం జరుగుతున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో పై ఉపోద్ఘాతానికి తగ్గట్టుగా జెమీమా రోడ్రిగ్స్ ఆడుతోంది. అందువల్లే ఆమె నాయకత్వం వహిస్తున్న ఢిల్లీ జట్టు ఫైనల్ వెళ్ళిపోయింది.
ఫైనల్ మ్యాచ్ కంటే ముందు
జెమీమా రోడ్రిగ్స్ గురించి ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి. గత ఏడాది జరిగిన మహిళల వన్డే వరల్డ్ కప్ సెమి ఫైనల్ మ్యాచ్లో భారత్ ఆస్ట్రేలియాతో తలపడింది. ఆస్ట్రేలియా జట్టు ముందుగా బ్యాటింగ్ చేసి 338 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా జట్టులో లిచీ ఫీల్డ్ సెంచరీ తో అదరగొట్టింది.
ఆస్ట్రేలియా విధించిన 339 పరుగుల లక్ష్యాన్ని సాధించే క్రమంలో.. జెమీమా రోడ్రిగ్స్ ఒంటరి పోరాటం చేసింది. 134 బంతుల్లో 127 పరుగులు చేసింది. అంతేకాదు చివరి వరకు ఉండి జట్టును గెలిపించి వెళ్ళింది. ఏకంగా 341 పరుగులు చేసి.. అది కూడా ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి ఆస్ట్రేలియా మీద భారత్ విజయం సాధించింది అంటే జెమీమా రోడ్రిగ్స్ సత్తా ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
ఇప్పుడు తన ప్రాణ స్నేహితురాలు స్మృతి మందాన జట్టు బెంగళూరు తో ఫైనల్ మ్యాచ్ ఆడుతున్న నేపథ్యంలో.. జెమీమా రోడ్రిగ్స్ మరోసారి తన మ్యాజిక్ ప్రదర్శించింది. లిజెల్ లీ(37), షఫాలీ వర్మ (20) అంచనాలను అందుకోలేకపోయినప్పటికీ.. లారా (27*) తో కలిసి మూడో వికెట్ కు 76 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. అంతేకాదు, హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసింది. 37 బంతుల్లో 8 ఫోర్ల సహాయంతో జెమీమా రోడ్రిగ్స్ ఏకంగా 57 పరుగులు చేసింది. తద్వారా ఒత్తిడి కలిగించే మ్యాచ్లలో తాను అద్భుతంగా ఆడతానని నిరూపించింది. సయాలి బౌలింగ్లో జెమీమా రోడ్రిగ్స్ అవుట్ అయింది. లేకుంటే మ్యాచ్ పరిస్థితి మరో విధంగా ఉండేది.
జెమీమా రాకముందు ఢిల్లీ జట్టు స్కోర్ 49/1 గా ఉంది. ఆమె వచ్చిన తర్వాత ఢిల్లీ జట్టు స్కోరు 148/3 కి మారిపోయింది. దీనిని బట్టి జెమీమా ఏ స్థాయిలో బ్యాటింగ్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. తన ప్రాణ స్నేహితురాలైన జెమీమా ను ఔట్ చేయించడానికి స్మృతి ఏకంగా ఆరుగురు బౌలర్లను రంగంలోకి దింపింది. చివరికి జెమీమా వికెట్ సయాలికి దక్కింది.