Aashritha Daggubati: లోక్‌సభ ఎన్నికల ప్రచారం మొన్నటి వరకు సినీతారల సందడి లేక వెలవెలబోయాయి. అసెంబ్లీ ఎన్నికల్లో సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు కనిపించారు. పార్లమెంటు ఎన్నికల వేళ కాస్త సందడి తగ్గినట్లు అనిపించింది. కానీ, వారం రోజులుగా మళ్లీ తారల సందడి ప్రచారంలో కనిపిస్తోంది. ఇటీవలే చిరుత హీరోయిన్ నేహాశర్మ తన తండ్రి కోసం కాంగ్రెస్ తరఫున ప్రచారం మొదలు పెట్టింది. ఇప్పుడు టాలీవుడ్ హీరో వెంకటేశ్ పెద్ద కూతురు ఆశ్రిత కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.
ఎండను మించిన ఎలక్షన్ వేడి..
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్ హీట్.. వేసవి ఎండలకన్నా ఎక్కువగా ఉంటోంది. ఒకవైపు భానుడి భగభగలు ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే.. మరోవైపు ఎన్నికల ప్రచారం, నేతల మాటలు మరింత హీటెక్కిస్తున్నాయి. ఈసారి ఎలాగైనా గెలవాలని అన్ని పార్టీలు చమటోడుస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు విభిన్న పద్ధతులు పాటిస్తున్నారు. రోడ్ షోస్, బస్సు యాత్ర, బహిరంగ సభలు నిర్వహిస్తూ ఇంటింటి ప్రచారం చేస్తున్నారు.
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తరఫున..
ఇక తెలంగాణలో ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రఘురామరెడ్డి తరఫున విక్టరీ వెంకటేశ్ పెద్ద కూతురు ఆశ్రిత ప్రచారం చేస్తున్నారు. ఈసారి ఖమ్మం లోక్‌సభ స్థానంపై అందరి దృష్టి పడింది. ఈస్థానం టికెట్ కోసం కాంగ్రెస్‌తోపాటు, బీజేపీలోనూ చాలా మంది పోటీ పడ్డారు. బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు, బీజీపీ నుంచి తాండ్ర వినోద్‌రావు పోటీ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వియ్యంకుడు రామసహాయం రాఘురామరెడ్డికి టికెట్ ఇచ్చింది. రాఘురామరెడ్డి కోసం హీరో వెంకటేశ్ ప్రచారం చేస్తారన్న టాక్ వినిపించింది. కానీ, ఆయనకు బదులు ఆయన పెద్దకూతురు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇటీవల ఖమ్మంలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర మీటింగ్‌లో ఆశ్రిత పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుని సమావేశానికి హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి రఘురామరెడ్డిని గెలిపించాలని కోరారు.