Amoy Kumar: ప్రభుత్వ భూమిని దక్కించుకోవడం కోసం నాటి భారత రాష్ట్ర సమితి ప్రజాప్రతినిధి తప్పుడు ధ్రువీకరణ పత్రాలను తెరపైకి తెచ్చికొచ్చారు. కుటుంబ సభ్యులను ముందు పెట్టారు. ఆ భూమిని తమ పేరు మీద చేసుకోవడానికి ఆ పత్రాలను నాటి తహసీల్దార్ కు సమర్పిస్తే ఆయన తిరస్కరించారు.. అయితే ఈ వ్యవహారంలోకి మేడ్చల్ రంగారెడ్డి జిల్లాకు నాడు కలెక్టర్ గా పనిచేస్తున్న అమోయ్ కుమార్ రంగంలోకి వచ్చారు. అంతే ఒక్కసారిగా సీఎం మారిపోయింది. సరిగ్గా 2023 అక్టోబర్ 12న ఆయన బదిలీ అయ్యే నాటికి ఆ 12 ఎకరాల భూమిని ఆ భారత రాష్ట్ర సమితి ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యుల పేరు మీద బదలాయించారు. సర్వేనెంబర్ 174/1/1/1/1/2 లో ఒకరికి మూడు ఎకరాలు, 174/2 లో ఒకరికి మూడు ఎకరాలు, 174/2 లో మరొకరికి మూడు ఎకరాలు, 174/1/2 లో ఇంకొకరికి రెండు ఎకరాలు, 174/1/1/2 లో ఒక వ్యక్తికి రెండు ఎకరాలు, 174/1/1/1/2 లో మరొక వ్యక్తికి రెండు ఎకరాల చొప్పున పట్టాదారు పుస్తకాలు ఇచ్చేశారు. ఇది ఒక్కసారిగా సంచలనమైంది. ప్రస్తుతం అమోయ్ కుమార్ భూ అక్రమాలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో.. ఏకంగా ఈడీ ఎంట్రీ ఇచ్చిన క్రమంలో.. మేడ్చల్ రంగారెడ్డి కలెక్టర్ గౌతమ్ స్పందించారు. వెంటనే నివేదిక తెప్పించారు.. ప్రభుత్వ భూమిని కాపాడేందుకు రికార్డులను మార్చారు.
ప్రభుత్వం కాపాడుకుందిలా..
మేడ్చల్ జిల్లా హైదరాబాద్ మహానగరానికి కూత వేటు దూరంలో ఉంటుంది. ఇక్కడ భూముల ధరలు విపరీతంగా ఉంటాయి. ఈ ప్రాంతంలో 100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని మేడ్చల్ మల్కాజ్ గిరి కలెక్టర్ గౌతమ్ కాపాడారు. ఈ భూమి ఘట్ కేసర్ మండలం వెంకటాపూర్ పంచాయతీలోని కొర్రెముల రెవెన్యూ పరిధిలో ఉంది. 174 సర్వే నెంబర్లు 18 ఎకరాల 12 గుంటల ప్రభుత్వ భూమి ఉంది. 2017 లో అప్పటి ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం కోసం ఆరు ఎకరాల 12 గంటల భూమిని దానికోసం కేటాయించింది. అయితే ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించిన మిగతా 12 ఎకరాల భూమిపై నాటి భారత రాష్ట్ర సమితి ప్రజా ప్రతినిధి కన్ను వేశారు. ఆ భూమిని దక్కించుకోవడానికి నకిలీ ధ్రువపత్రాలు తెరపైకి తీసుకొచ్చారు. పాస్ పుస్తకాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. అయితే విచారణ చేసిన తహసీల్దార్ దానిని రద్దు చేశారు. అయితే వారు మళ్లీ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. అదే సమయానికి మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కలెక్టర్ గా అమోయ్ కుమార్ 2023 అక్టోబర్ 12న బదిలీ అయ్యే నాటికి ఆధారకాస్తుకు క్లియరెన్స్ ఇచ్చారు. 100 కోట్ల ప్రభుత్వ భూమిని ప్రవేట్ వ్యక్తుల పరం చేశారు. అయితే ఈ వ్యవహారం ఇప్పుడు వెలుగులోకి రావడంతో ప్రస్తుత కలెక్టర్ గౌతం విచారణ చేశారు. 100 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడారు. మొత్తంగా నాటి భారత రాష్ట్ర సమితి పరిపాలన కాలంలో నిర్లజ్జగా సాగిన భూ దందాను బయటపెట్టారు. అయితే అమోయ్ కుమార్ కాలంలో సాగిన భూ వ్యవహారాలపై ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించింది. వాటన్నింటిపై నివేదిక ఇవ్వాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.