Siddipet: ఆన్ లైన్ గేమ్ ఆ కుటుంబాన్ని బలి చేసింది.. చేసిన అప్పులు ప్రాణాలు తీశాయి.. కానీ అభం, శుభం తెలియని చిన్నారులు ఏం పాపం చేశారు? వారెందుకు ఈ ఘోరంలో భాగమయ్యారు? అన్నది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సిద్ధిపేట జిల్లా కలెక్టర్ గన్ మేన్ కుటుంబంతో సహా కాల్చుకున్న ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది.స్కూల్ యూనిఫాంలో ఉన్న తన పిల్లలను కాల్చి, భార్యను పాయింట్ బ్లాక్ లో కాల్చి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే స్కూల్ డ్రెస్ లో ఉన్న పిల్లలను చూసి చాలా మంది కలత చెందుతున్నారు. తండ్రి చేసిన పాపానికి పిల్లలు బలయ్యారు? అని అంటున్నారు. కొందరు పిల్లలేం పాపం చేశారు? అని చర్చించుకుంటున్నారు.
సిద్ధపేట జిల్లా చిన్నకోడూరు మండలం రాముని పట్ల గ్రామానికి చెందిన ఆకుల నరేష్ కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ వద్ద గన్ మెన్ గా పనిచేస్తున్నాడు. నరేష్ కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాడు. అందుకు కారణం ఆన్ లైన్ గేమ్ తో పాటు ఇల్లు కట్టుకోవడానికి చేసిన అప్పులే కారణమని తెలుస్తోంది. అయితే ఈ అప్పుల వేధింపులు మూడు నెలల నుంచి తీవ్రమయ్యాయి. తనకు అప్పు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరగడంతో తనకున్న భూమిలో ఒక ఎకరం అమ్మివేశాడు. దీంతో రూ.24.80 లక్షలు రాగా కొంత రుణాన్ని తీర్చాడు. కానీ మిగతా అప్పుల బాధలు తగ్గలేదు.
దీంతో మరికొంత భూమిని విక్రయించి అప్పులు తీర్చాలని అనుకున్నాడు. కానీ కుటుంబ సభ్యులు అందుకు ఒప్పుకోలేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన నరేష్ ఆత్మహత్య చేసుకోవడమే మంచిదని అనుకున్నాడు. ఈ క్రమంలో ఆయన ముందుగా తన కుమారుడు రేవంత్, కూతురు హితాశ్రీ లను కాల్చి వేశాడు. ఆ తరువాత భార్య చైతన్యను పాయింట్ బ్లాక్ లో కాల్చి తాను ఆత్మహత్యకు ఒడిగట్టాడు. తన భార్య చైతన్య సిద్ధిపేటలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్ గా పనిచేస్తుంది.
అయితే అప్పుల ఊబిలో చుక్కుకున్న నరేష్ తాను చేసిన పాపానికి కుటుంబాన్ని ఎందుకు బలి చేశాడని సర్వత్రా చర్చ సాగుతోంది. ఎంతో అపురూపంగా ఉన్న పిల్లలను, భార్యను కాల్చి వేయడంపై రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా నరేస్ సొంత గ్రామం రామునిపట్లలో కలకలం రేపింది. కలెక్టర్ సెలవులో ఉన్న సమయంలో నరేష్ సొంత గ్రామానికి వచ్చి అందరితో కలిసి ఉండేవాడని అంటున్నారు.