Kavitha sensational truth revealed: తెలంగాణ రాజకీయాలలో రోజురోజుకు అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య రాజకీయాలు మొన్నటిదాకా కేంద్రీకృతంగా ఉండేవి. ఇప్పుడు ఏకంగా ఇందులోకి కవిత కూడా వచ్చి చేరారు. గులాబీ పార్టీ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆమె రోజుకో తీరుగా సంచలన విషయాన్ని బయటపెడుతున్నారు.
తెలంగాణలో గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిందని భావిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్ రావుకు ప్రత్యేక దర్యాప్తు బృందం పోలీసులు నోటీసులు ఇచ్చారు. తాము విచారణ నిర్వహిస్తామని.. తాము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆయనకు పంపించిన నోటీసులలో కోరారు. ఇప్పటికే ఈ కేసులో హరీష్ రావు, కేటీఆర్ ను ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించింది. ఇప్పుడు ఈ జాబితాలో సంతోష్ రావు కూడా చేరిపోయారు. సంతోష్ రావు విచారణకు రావాలని ప్రత్యేక దర్యాప్తు బృందం పోలీసులు ఆయనకు నోటీసులు అందించారు.
వాస్తవానికి సంతోష్ రావు స్థానంలో ఇంకా ఎవరైనా కీలక నాయకులు ఉంటే గులాబీ పార్టీ రచ్చ రచ్చ చేసేది. కానీ సంతోష్ రావు తెరవెనక వ్యక్తి కాబట్టి.. దీనిని గులాబీ పార్టీ అంతగా పట్టించుకోనట్టు కనిపిస్తోంది. అయితే సంతోష్ రావు కు నోటీసులు అందించిన నేపథ్యంలో మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. అంతేకాదు, కీలకమైన విషయాలను బయటపెట్టారు.
“వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ ఫుల్ ఇడ్లీ తింటున్నారా? సగం ఇడ్లీ తింటున్నారా? ఇలా ఎప్పటికప్పుడు ప్రతి సమాచారాన్ని గుంపు మేస్త్రికి సంతోష్ రావు చేరవేరుస్తారు. ఇప్పుడు ఈ గూఢచారిపై చర్యలు తీసుకుంటాడనే నమ్మకం నాకు లేదు. ఎంతో మంది ఉద్యమకారులను రక్త కన్నీరు పెట్టించిన చరిత్ర సంతోష్ రావుది. సంతోష్ రావుకు అనుకూలంగా కేటీఆర్, హరీష్ రావు ఎందుకు ట్వీట్లు చేస్తున్నారో అర్థం కావడం లేదు. నేను మొదటినుంచి చెప్తున్నా.. గులాబీ పార్టీలో పెద్ద దయ్యం ఇతడే.. చట్టం తన పని తాను చేసుకో పోవాలి. తెలంగాణ పోలీసులు సమర్థవంతంగా పనిచేయాలి. ఇటువంటి వారిపట్ల కఠిన చర్యలు తీసుకోవాలని” కవిత పేర్కొన్నారు.
మరోవైపు సిట్ ఎదుట విచారణకు సంతోష్ రావు విచారణకు హాజరయ్యారు. ఆయన విచారణకు హాజరవుతున్న క్రమంలో కొంతమంది గులాబీ పార్టీ నాయకులు మాత్రమే ఉన్నారు.. సంతోష్ రావు ను విచారణకు పిలిచిన నేపథ్యంలో హరీష్ రావు, కేటీఆర్ ట్విట్టర్లో ఆయనకు అనుకూలంగా ట్వీట్ లు చేయడం విశేషం.