Manthani : తెలంగాణ గురుకుల పాఠశాలలకు ప్రసిద్ధి. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం.. రాష్ట్రంలో 2 వేలకుపైగా గురుకులాలు ఏర్పాటు చేసింది. విద్యార్థులకు మంచి విద్యతోపాటు నాణ్యమైన భోజనం అందిస్తోంది. దీంతో ఏటా గురుకుల పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. గురుకుల ప్రవేశ పరీక్షకు భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. అయితే గురుకుల పాఠశాల్లో కన్ని రోజులుగా దారుణాలు జరుగుతున్నాయి. ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన పాఠశాలలో ఓ విద్యార్థిని మృతిచెందింది. రాష్ట్రవ్యాప్తంగా చాలా గురుకులాల్లో ఆహారం సరిగా ఉండడం లేదనే ఫిర్యాదులు ఉన్నాయి. మెస్ జార్జీలు పెంచిన తర్వాత కూడా నాణ్యమైన భోజనం పెట్టడం లేదు. రోజుకో గురుకులంలో విద్యార్థులు నిరసన తెలుపుతున్నారు. ఇలాంటి తరుణంలో ఓ గురుకులంలో ఏకంగా క్షుద్ర పూజలు చేయడం కలకలం రేపింది. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో గురుకుల పాఠశాలలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. విద్యార్థులకు మాయమాటలు చెప్పి వారితోనే పూజలు చేయించడం సంచలనం రేపుతోంది.
మూఢ నమ్మకాలు..
మూఢ నమ్మకాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేవి విద్యాలయాలే. మూఢనమ్మకాలను చిన్నారుల మనసుల్లో నుంచి తొలగించాల్సిన బాధ్యత గురువులది. కానీ, అలాంటి గురువులు ఉండే విద్యాలయంలోనే క్షుద్ర పూజలు చేయడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. వర్షాలు కురవని సమయంలో కప్పల పెళ్లి చేస్తే వర్షాలు కురుస్తాయని రైతుల నమ్ముతారు. అది ఒక నమ్మకం. కానీ, నగ్నంగా పూజలు చేస్తే కాసులు కురస్తాయి అని ఇప్పటికీ కొందరు నమ్ముతున్నారు. ఇదే విషయాన్ని మంథనిలోని గురుకుల విద్యార్థినికి చెప్పారు. నమ్మించారు ఇద్దరు వ్యక్తులు. పూజలు చేస్తున్న సమయంలో భయం వేయడంతో బాలిక పారిపోయి విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
బాలికతో నగ్న పూజలు..
మంథని పట్టణంలోని ఓ హాస్టల్ పనిచేసే మహిళా వంటమనిషి.. ఓ బాలికకు క్షుద్రపూజల గురించి తెలిపింది. నగ్నంగా పూజలు చేస్తే డబ్బులు బాగా వస్తాయని నమ్మించింది. డబ్బులు కూడా ఇస్తామని చెప్పడంతో వంట మనిషి మాటలు నమ్మిన బాలిక క్షుద్రపూజలకు సరే అని చెప్పింది. దీంతో వంటమనిషి ఈ తతంగానికి తెరలేపింది. నగ్న పూజలు చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని వారం క్రితం హాస్టర్ వర్కర్ కొందరు పూజలు చేసేవారిని సంప్రదించింది. దీంతో ఆందోళన చెందిన బాలిక హాస్టల్ నుంచి తప్పించుకుంది. బంధువుల ఇంటికి వెళ్లింది. వారం రోజులు అక్కడే ఉండిపోయింది. సోమవారం(నవంబర్ 25న) తల్లిదండ్రులు రావడంతో వారికి విషయం చెప్పింది. దీంతో బాలిక బంధవులు, తల్లిదండ్రులు హాస్టల్‌కు చేరుకుని వంటమనిషితో వాగ్వాదానికి దిగారు.
రంగంలోకి పోలీసులు..
హాస్టల్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారినట్లు సమాచారం అందుకున్న మంథని పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. చదువుకునే ఆడపిల్లలతో ఇలాంటి పనులు చేయించడంతో విషయం తెలుసుకున్న పోలీసులు వంట మనిషిని అదుపులోకి తీసుకున్నారు. చిన్నారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.