Hyderabad Manhole: హైదరాబాద్‌లో మరో దారుణం జరిగింది. నాలుగో తరగతి చదివే చిన్నారిని నాలా మింగేసింది. రెండు గంటలపాటు కురిసిన భారీ వర్షానికి ఆ పాప బలైంది. ఇటీవలే నాలుగేళ్ల బాలుడిపై వీధికుక్కలు దాడిచేసి పొట్టన పెట్టుకున్నాయి. ఆ ఘటన ఇంకా జీహెచ్‌ఎంసీతోపాటు తెలంగాణ ప్రజల కళ్లలో ఇంకా కదలాడుతూనే ఉంది. ఈ క్రమంలో జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్యం మరో నాలుగో తరగతి చదువుతున్న పాప ప్రాణాన్ని కబళించింది.
కళాసిగూడలో ఘటన..
ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కూడా శనివారం ఉదయమే భారీ వర్షం కురిసింది. దీంతో నాలాలు ఉప్పొంగుతున్నాయి. ఈ క్రమంలో వర్షం కాస్త తెరిపివ్వడంతో కళాసిగూడాకు చెందిన ఓ చిన్నారి మౌనిక తన తమ్ముడిని తీసుకుని పాల ప్యాకెట్ కోసం సమీపంలోని షాప్‌కు బయల్దేరింది.
నోరు తెరిచిన నాలా..
అయితే అప్పటికే కురిసిన భారీ వర్షానికి మౌనిక ఇంటి సమీపంలోని నాలా నోరు తెరిచి ఉంది. షాప్‌కు వెళ్తున్న చిన్నారి తమ్ముడు అందులో పడబోయాడు.. తమ్ముడిని కాపాడిన మౌనిక తాను నాలాలో పడిపోయింది. నాలాలో వరద ఉధృతంగా ఉండడంతో కొట్టుకుపోయి పార్క్‌లైన్ వద్ద శవమైతేలింది.
రెండు గంటల వర్షానికే ఇలా..
కేవలం రెండు గంటల్లోనే హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. 7 సెంటీ మీటర్ల వర్షం కురిసిందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో నాలాలు ఉధృతంగా ప్రవహించాయి. ఈ క్రమంలో కాలువలో పడిన చిన్నారి వరదకు కొట్టుకుపోయిందని స్థానికులు చెబుతున్నారు.
జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్యంపై ఆగ్రహం..
ఇదంతా జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యమే అంటున్నారు స్థానికులు, రెండు గంటల పాటు వర్షానికి ఇలాంటి పరిస్థితి ఉంటే… రేపు వర్షాకాలంలో పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. పైపులైన్ కోసం తవ్విన గుంతను అలాగే వదిలేయడం, ఎలాంటి హెచ్చరిక బోర్డు పెట్టకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని పేర్కొంటున్నారు. మౌనిక మృతికి పూర్తిగా జీహెచ్‌ఎంసీ బాధ్యత వహించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
పరిశీలించిన మేయర్..
ఘటన స్థలాన్ని జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి పరిశీలించారు. గతంలో కుక్కల దాడిలో చిన్నారి చనిపోయినప్పుడు మేయర్ బయటకు రాకపోవడంపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మౌనిక మృతిపై వెంటనే స్పందించారు. కాళాసిగూడకు చేరుకుని నాలాను పరిశీలించారు. ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. ప్రమాదానికి కారణాన్ని స్థానికులకు వివరించారు. ఇదిలా ఉండగా, చిన్నారి నాలాలో పడిన తర్వాత జీహెచ్‌ఎంసీ సిబ్బంది అక్కడ బారికేడ్ ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కూడా స్పందించారు. ఈ ఘటనకు జీహెచ్‌ఎంసీ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.