MLA Raja Singh: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తన వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇప్పటికే పలుమార్లు ఓ వర్గాన్ని కించపరిచేలా చేసిన వ్యాఖ్యలకు పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అంతేకాదు ఎమ్మెల్యేపై పీడీ యాక్ట్ కూడా నమోదు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాజాసింగ్‌ను బీజేపీ అధిష్టానం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అయితే, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజాసింగ్ తన రాజకీయ భవిష్యత్తుపై దృష్టి పెట్టారని.. త్వరలో టీడీపీలో చేరుతారనే ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారంపై తాజాగా రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
బీజేపీని వీడేది లేదు..
తాను టీడీపీలో చేరబోతున్నాననే వార్తలను రాజాసింగ్ ఖండించారు. తాను బీజేపీని వీడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. కాషాయం వీడనని కుండ బద్దలు కొట్టారు. కాగా పార్టీ నుంచి సస్పెండ్ చేసి చాలా రోజులు కావొస్తున్నా.. బీజేపీ అధిష్టానం తన విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో రాజాసింగ్ గుర్రుగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌తో రాజాసింగ్ చర్చలు కూడా జరిపారని.. ఆయన త్వరలోనే టీడీపీలో చేరుతారనే ప్రచారం జరిగింది.
వరుసగా రెండుసార్లు గెలిచి..
తెలంగాణలో బీజేపీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రాజాసింగ్. అయితే ఓ వర్గం విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్ విషయంలో బీజేపీ నాయకత్వం కఠినంగా వ్యవహరించింది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఇది జరిగి కొన్ని నెలలు గడుస్తోంది. అప్పటి నుంచి తనపై సస్పెన్షన్ ఎత్తేయాలని రాజాసింగ్ పలుసార్లు బీజేపీ నాయకత్వాన్ని కోరుతూ వచ్చారు.
సస్పెన్షన్ ఎత్తివేతపై స్పష్టత ఇవ్వని బీజేపీ..
బీజేపీ నాయకత్వం మాత్రం సస్పెన్షన్ ఎత్తివేతపై క్లారిటీ ఇవ్వడం లేదు. ఈ విషయంలో తన నిర్ణయం మార్చుకోవడం లేదు. అంతేకాదు ప్రస్తుతం రాజాసింగ్ ప్రాతినిథ్యం వహిస్తున్న గోషామహల్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున మరో నాయకుడిని బరిలోకి దింపేందుకు ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తోందనే చర్చ కూడా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే రాజాసింగ్ పార్టీ మార్పుపై ప్రచారం మొదలైంది. అయితే వాటిని ఆయన కొట్టిపారేశారు. బీజేపీలోనే కొనసాగుతానని స్పష్టత ఇచ్చారు.