Dr Nageshwar Reddy: ప్రపంచ జనాభాలో మొదటి స్థానంలో భారత్ ఉంది. అత్యంత వినియోగదారుల మార్కెట్ ఉన్న దేశంగా పేరుపొందింది. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే.. ఊబకాయుల దేశంగా.. మధుమేహ రోగులు ఎక్కువగా ఉన్న ప్రాంతంగా భారత్ ముందుంది. ఇలా చెప్పడానికి కాస్త ఇబ్బందిగానే ఉన్నప్పటికీ.. భవిష్యత్తు కాలంలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మధుమేహం, రక్తపోటు, ఊబకాయం వంటి సమస్యలు ఇటీవల కాలంలో పెరగడం వైద్య వర్గాలను సైతం ఆందోళనకు గురిచేస్తుంది.
Also Read: గవర్నర్ గా విజయసాయిరెడ్డి.. నిజం ఎంత?
హైదరాబాదులోని ఏఐజి ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి సంచలన విషయాలు వెల్లడించారు. ఆహారం తీసుకోవడంలో చోటుచేసుకుంటున్న మార్పుల వల్ల ఊబకాయుల సంఖ్య పెరిగిపోతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాదులోని హైటెక్ సిటీ ఏరియాలో ఉండే ఐటీ ఉద్యోగులలో 80 శాతం మంది అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు. ఇక మనదేశంలో 60% జనాభా అధిక బరువుతో ఉన్నారు. ఇక ఇందులో 30% మంది బాడీ ఫ్యాట్ ఎక్కువ కావడంతో ఒబేసిటీ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి రోగులు రావడం ఆస్పత్రులకు పెరిగిపోతుందని నాగేశ్వర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ” తినే తిండి విషయంలో సమతుల్యం పాటించడం లేదు. జంక్ ఫుడ్ ఇష్టానుసారంగా తినేస్తున్నారు. ఆరోగ్యానికి మంచి చేసే తృణధాన్యాలను ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. పొట్టు తీసిన బియ్యానికి బదులుగా.. పాలిష్ చేసిన బియ్యాన్ని ఎక్కువగా వాడుతున్నారు. దేహానికి మంచి చేసే ఆహార పదార్థాలను తినడం పక్కనపెట్టి.. నాలుకకు రుచి కలిగించే ఆహార పదార్థాలను తింటున్నారు. నూనె వాడకం కూడా అధికం కావడంతో మధుమేహం వంటి రోగాలు వ్యాపిస్తున్నాయి. మధుమేహం అనేది కొందరిలో వంశపారంపర్యంగా వచ్చినప్పటికీ.. మిగతావారిలో మాత్రం శారీరక శ్రమలేమి.. అధికంగా ఆహార తీసుకోవడం వల్ల వస్తోందని” నాగేశ్వర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
ఎందుకీ అధిక బరువు
ఒకప్పుడు తినే తిండిలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, పీచు పదార్థాలు, విటమిన్లు ఉండేవి. పైగా బయట తిండి ఎక్కువగా తినే వారు కాదు. అందువల్ల ప్రజలు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడేవారు కాదు. వందమందిలో ఒకరికి మధుమేహం ఉండేది. వెయ్యి మందిలో ఒకరికి క్యాన్సర్ ఉండేది. ఇప్పుడు పదిమందిలో ఒకరికి మధుమేహం.. వందమందిలో ఒకరికి క్యాన్సర్ వంటి వ్యాధులు సర్వసాధారణమయ్యాయి. రక్త పోటు కూడా అధికమైంది. ప్రాసెస్డ్ ఫుడ్.. నూనెలో వేయించిన ఆహార పదార్థాలు ఎక్కువగా తినడం.. మాంసం వినియోగం పెరగడంతో రకరకాల వ్యాధులు వస్తున్నాయి. తిన్న తిండికి తగ్గట్టుగా శారీరక వ్యాయామం లేకపోవడంతో అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్ వంటివే కాకుండా ఇతర రోగాలు కూడా దేహం పై దాడి చేస్తున్నాయి. అందువల్ల వీటి చికిత్స కోసం ప్రజలు ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇవన్నీ జరగకూడదు అనుకుంటే ప్రతిరోజు వ్యాయామం చేయాలి. సమతుల ఆహారం తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు ఇంట్లో వండిన ఆహారాన్ని మాత్రమే తినాలి. ఐస్ క్రీమ్ లు, ఇతర జంక్ ఫుడ్స్ తీసుకోకూడదు. సాధ్యమైనంత వరకు ఉప్పు వినియోగాన్ని తగ్గించాలి. ఉప్పు వినియోగం పెరగడం వల్ల రక్తపోటు సమస్యలు పెరుగుతున్నాయి. మూత్రపిండాల వైఫల్యం వంటివి చోటుచేసుకుంటున్నాయి. అందువల్లే ఆహారం తీసుకునే విషయంలో జాగ్రత్తలు పాటిస్తేనే ఎటువంటి రోగాలు రాకుండా దేహాన్ని రక్షించుకోవచ్చు.
Also Read: నాగబాబు ఎమ్మెల్సీ.. కూటమి ఎట్టకేలకు ఫిక్స్!
హైటెక్ సిటీ ఏరియాలో ఉండే 80% మంది ఐటీ ఉద్యోగులు అధిక బరువుతో బాధపడుతున్నారు
ఇండియాలో 60% జనాభా అధిక బరువుతో ఉన్నారు
ఇందులో 30% మంది బాడీ ఫ్యాట్ ఎక్కువై ఒబేసిటీ సమస్యతో బాధపడుతున్నారు – డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, AIG హాస్పిటల్ pic.twitter.com/WtE6NevV6u
— Telugu Scribe (@TeluguScribe) March 5, 2025