దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. గతంలో ఏ వైరస్ వ్యాప్తి చెందని స్థాయిలో కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతోంది. ఒక్కరికి కరోనా సోకితే వారి నుంచి చాలా మందికి వైరస్ సోకుతూ ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. తాజాగా తెలంగాణలో చోటు చేసుకున్న ఒక ఘటన పాఠశాలలు తెరిస్తే ఎంత ప్రమాదమో చెప్పకనే చెబుతోంది. తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ మండలం అలుగునూర్ గురుకుల కేంద్రంలో 56 మంది కరోనా బారిన పడ్డారు.
కరోనా సోకిన వారిలో 50 మంది విద్యార్థులు కాగా ఆరుగురు టీచర్లు కావడం గమనార్హం. విద్యార్థులలో కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు నిర్వహించగా 56 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. అధికారికంగా స్కూల్ యాజమాన్యం నుంచి ఈ మేరకు ప్రకటన వెలువడాల్సి ఉంది. పాఠశాలలు తెరిస్తే ఎంత ప్రమాదమో ఈ ఘటన చెప్పకనే చెబుతోంది. దేశంలో పాఠశాలలు తెరిస్తే మాత్రం ఎక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యే అవకాశం ఉంది.
ప్రతిభ గల విద్యార్థులు ఉండే గురుకుల కేంద్రంలో ఈ స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కొన్ని రోజుల క్రితం నుంచి ఈ గురుకుల కేంద్రంలో పది, ఇంటర్ ఫస్టియర్, ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు ఈ గురుకుల కేంద్రంలో క్లాసులు నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రుల అనుమతితోనే గురుకుల కేంద్రం నిర్వాహకులు క్లాసులను నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.
గురుకుల కేంద్రంలో విద్యార్థులకు కరోనా సోకడం విద్యార్థుల తల్లిదండ్రులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేంత వరకు విద్యార్థులకు ఆన్ లైన్ ద్వారా క్లాసులు నిర్వహించడమే ఉత్తమమని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాఠశాలలను భౌతికంగా నిర్వహిస్తే మాత్రం విద్యార్థులు కరోనా బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.