Telangana High Court: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ.. ఆ ఆధారంగానే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ఈ బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్న నేపథ్యంలో ప్రత్యేకంగా జీవోను విడుదల చేసింది. ఆ జీవో ఆధారంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. దానికి తగ్గట్టుగానే స్థానిక ఎన్నికలను నిర్వహిస్తామని ప్రకటించింది. అంతేకాదు ఈ అంశం మీద ఎవరైన కోర్టుకు వెళ్తే బాగోదని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. అయినప్పటికీ కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టును ఆశ్రయించిన వారిలో గులాబీ పార్టీ వారు ఉన్నారని తెలుస్తోంది..
హైకోర్టు ఈ అంశంపై శనివారం సాయంత్రం పొద్దు పోయే వరకు విచారణ నిర్వహించింది. విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. “రిజర్వేషన్ల అంశం గవర్నర్ వద్ద పెండింగ్లో ఉంది. అలాంటప్పుడు ప్రభుత్వం జీవో ఎలా విడుదల చేస్తుంది. అవసరమైతే ఎన్నికలను 10 రోజులపాటు వాయిదా వేయవచ్చు. ఒకవేళ ఈ అంశంలో కోర్టు జోక్యం చేసుకోవద్దు అనుకుంటే ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెల్లడించాలి” అంటూ హైకోర్టు ప్రకటించింది. ఈ కేసు విచారణను అక్టోబర్ 8 కి వాయిదా వేసింది.
ప్రత్యేకమైన జీవో ద్వారా ఎన్నికల నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తున్న క్రమంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ఒకరకంగా బ్రేకు వేసినట్టు అయింది. దీంతో స్థానిక సంస్థల్లో పోటీ చేయాలనుకుంటున్న వారంతా ఒక్కసారిగా ఢీలా పడిపోయారు. ఏం చేయాలో తెలియక తలలు పట్టుకున్నారు. పది రోజులపాటు స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయాలని సాక్షాత్తు కోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో.. తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో అంతు పట్టడం లేదు. మరోవైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం కాబట్టి.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధిస్తామని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. అంతేకాదు తాము గట్టి పోటీ ఇస్తామని గులాబీ నేతలు చెబుతున్నారు. హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో గులాబీ నేతలు ప్రభుత్వాన్ని తప్పుపడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరోవైపు బీసీలకు న్యాయం చేయాలని ప్రభుత్వం చూస్తుంటే గులాబీ నేతలు అడ్డుపడుతున్నారని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.