BRS vs Congress : కేసీఆర్‌ కారుకు పంచర్‌.. పొంగులేటి, జూపల్లి మాత్రమే కాదు..కాంగ్రెస్ లైన్‌లో 35 మంది

పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్‌లో చేరుతున్న నేపథ్యంలో అధికార భారత రాష్ట్ర సమితికి చెందిన 35 మంది ప్రజాప్రతినిధులు కూడా కాంగ్రెస్‌ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

Written By: NARESH, Updated On : June 26, 2023 9:09 pm
Follow us on

BRS vs Congress : ఇది తెలంగాణలో అధికారాన్ని చెలాయిస్తున్న బీఆర్‌ఎస్‌కు ఒకింత షాకింగ్‌ వార్త. రెండు సార్లు ముఖ్యమంత్రై, మూడోసారీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్న కేసీఆర్‌కు మింగుడుపడని వార్త. ఇప్పటికే ఎమ్మెల్యేలు, మంత్రులు భూ వివాదాలు, అత్యాచార ఆరోపణల్లో పీకల్లోతు ఇరుక్కుపోయారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి కూతురు పేరు ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ తరుణంలోనే ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అధిష్ఠానానికి వ్యతిరేక స్వరం వినిపించారు. ఈరోజు(సోమవారం) ఢిల్లీలో ఏకంగా రాహుల్‌ గాంధీని కలిశారు. కేసీఆర్‌ ఓటమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

ఇక ఈ పరిణామాలు జరుగుతుండగానే బీఆర్‌ఎస్‌కు షాక్‌ లాంటి వార్త మరొకటి.. కేవలం పొంగులేటి, జూపల్లి కృష్ణారావు మాత్రమే కాకుండా కాంగ్రెస్‌ కండువా కప్పుకునేందుకు 35 మంది బీఆర్‌ఎస్‌ నేతలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. వీరిలో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నట్టు తెలుస్తోంది. వీరంతా కూడా కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ కేసీ వేణుగోపాల్‌తో టచ్‌లు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. కేసీఆర్‌ డేగ కన్ను పెట్టినప్పటికీ వారంతా కూడా కాంగ్రెస్‌కు జై కొట్టడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు.

వాస్తవానికి కర్ణాటకలో గెలిచిన నాటి నుంచి తెలంగాణ హస్తం పార్టీలో ఎక్కడా లేని జోష్‌ వచ్చింది. పైగా ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో కేంద్రం ఆశించినంత వేగంగా చర్యలు తీసుకోవడం లేదు. ఇది అంతిమంగా బీజేపీ నాయకుల మీద ప్రభావం చూపిస్తోంది. దీంతో ఆ పార్టీలో చేరాలనుకునేవారు కూడా చేరడం లేదు. పైగా ఆ పార్టీలో నాయకుల మధ్య లుకలుకలు ఇబ్బంది కలిగిస్తున్నాయి. వాస్తవానికి కాంగ్రెస్‌లో చేరబోతున్న పొంగులేటి, జూపల్లి మొదట బీజేపీ గూటికి వెళ్లాలి అనుకున్నారు. కానీ, అక్కడ జరుగుతున్న పరిణామాలు, కేసీఆర్‌పై చేస్తున్న యుద్ధంలో యూటర్న్‌ తీసుకోవడాన్ని గమనించి కాంగ్రెస్‌ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు.

పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్‌లో చేరుతున్న నేపథ్యంలో అధికార భారత రాష్ట్ర సమితికి చెందిన 35 మంది ప్రజాప్రతినిధులు కూడా కాంగ్రెస్‌ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌, నల్లగొండ, మహబూబ్‌ నగర్‌ జిల్లాలకు చెందిన వారు ఈ జాబితాలో ఉన్నట్టు తెలుస్తోంది. సిట్టింగ్‌లకు టికెట్లు ఇస్తామని ప్రకటించినప్పటికీ కేసీఆర్‌ మాటను కాదని పలువురు కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. మరోవైపు రేవంత్‌ రెడ్డి కూడా ఘర్‌ వాపసీకి పిలుపునివ్వడంతో చాలా మంది కారు నుంచి చేతిలోకి వెళ్లేందుకు సమాయత్తమవుతున్నారు. కొందరు ఎమ్మెల్యేలు తమ అనుచరులతో రహస్య సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు.