
సాధారణంగా ఫుడ్ పాజిటివ్ కావడం వల్ల అస్వస్థతకు గురైన, ప్రాణాలు కోల్పోయిన ఘటనల గురించి మనం వినే ఉంటాం. అయితే తెలంగాణలో కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుడి వెనుక తండా గ్రామంలోని మర్లకుంట తండాలో మంచినీళ్లు తాగి 11 మంది అస్వస్థతకు గురయ్యారు. ఆ 11 మందిలో ఒకరు మృతి చెందగా మిగిలిన ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మంచినీటిలోనే ఏదో విషపూరిత పదార్థం కలిసి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గ్రామంలోని ఒకే ఇంట్లో 11 మంది అస్వస్థతకు గురి కావడం జిల్లావ్యాప్తంగా కలకలం రేపుతోంది. గ్రామంలోని రమావత్ మేగ్యా కుటుంబంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 11 మందిలో నిన్న రాత్రి శ్రీనిధి అనే 9 సంవత్సరాల బాలిక చికిత్సకు కోలుకోలేక చనిపోయింది. ప్రస్తుతం రమావత్ కుటుంబ సభ్యులంతా కామారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న వారిలో 10 నెలల బాలుడు ఉన్నాడు.
మంచినీళ్లను పరీక్షిస్తే మాత్రమే ఈ కేసులో అసలు నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకే కుటుంబానికి చెందిన వాళ్లంతా ఆస్పత్రిలో చేరడంతో వాళ్ల బంధువులు సైతం టెన్షన్ పడుతున్నారు. ఎవరో ప్లాన్ చేసి వీరిని ప్రమాదంలోకి నెట్టారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఈ ఘటన గురించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని తెలుస్తోంది.
పోలీసుల దర్యాప్తు తరువాత ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఒకరు మృతి చెందడంతో మిగిలిన వారి ఆరోగ్యం విషయంలో బంధవులు భయాందోళనకు గురవుతున్నారు.
Comments are closed.