
కరోనా, లాక్ డౌన్ వల్ల దేశంలో లక్షల సంఖ్యలో నిరుద్యోగులు ఉద్యోగాలు కోల్పోయారు. వీళ్లు కొత్త ఉద్యోగాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో కేంద్రం ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సీహెచ్ఎస్‌ఎల్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎల్డీసీ, జేఎస్ఏ, పీఏ ఉద్యోగాల భర్తీ జరగనుంది.
ఆసక్తి ఉన్న అభ్యర్థులు డిసెంబర్ నెల 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. మూడు దశల్లో పరీక్షల నిర్వహణ జరగనుండగా ఖాళీల సంఖ్య తెలియాల్సి ఉంది. 5,000కు అటూఇటుగా ఖాళీలు ఉండే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ ఉద్యోగాలకు అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మొదటి దశలో అబ్జెక్టివ్ ప్రశ్నలు, రెండో దశలో వ్యాసరూప ప్రశ్నలు మూడో దశలో స్కిల్ టెస్ట్ ద్వారా ఈ ఉద్యోగాల భర్తీ జరగనుంది.
ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు 100 రూపాయలు కాగా డిసెంబర్ 17 2020లోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. https://ssc.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
మొదటి దశలో 200 మార్కులకు గంట సమయం ఉంటుంది. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, జనరల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. రెండో దశలో 100 మార్కులకు 200 నుంచి 250 పదాల్లో సమాధానాలు రాయాల్సి ఉంటుంది. మూడో దశలో స్కిల్ టెస్ట్ కు హిందీ, ఇంగ్లీష్ భాషల్లో టైపింగ్ ఎగ్జామ్ ఉంటుంది.