Liquor Sales: తెలంగాణ మద్యం అమ్మకాల్లో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అమ్మకాలకన్నా.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత లిక్కర్ సేల్స్ భారీగా పెరిగాయి. మంచైనా, చెడైనా.. బాధైనా సంతోషమైనా.. ఫ్రెండ్స్ కలిసినా, బంధవులు వచ్చినా.. ఇలా చిన్న కారణం దొరికితే చాలు మద్యం తాగేస్తున్నారు. పండుగలు, వేడుకలు అయితే అమ్మకాలు జోరుగా సాగుతాయి. తాజాగా రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. దసరా పండుగ నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం ఏరులై పారింది. పండుగ పది రోజుల్లో రూ.1000 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. బార్లు, మద్యం దుకాణాలతోపాటు పబ్‌లలోనూ భారీగా లిక్కర్ సేల్స్ జరిగాయి. దీంతో ఖజానాకు భారీగా ఆదాయం సమకూరింది. హైదరాబాద్ నంగరంలోనే భారీగా మద్యం అమ్మకాలు జరిగినట్లు అధికారులు తెలిపారు.
మద్యం లెక్కలు ఇలా..
తెలంగాణలో 2,260 మద్యం షాపులు, 1,171 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. వీటితోపాటు పబ్‌లలోనూ మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. ఏటా దసరా వేళ తెలంగాణలో భారీగా మద్యం అమ్మకాలు జరుగుతాయి. ఈసారి కూడా అదే అంచనాలతో ముందుగానే ఎక్సైజ్ శాఖ భారీగా మద్యం నిల్వలను సిద్ధం చేసింది. అంచనాలకు తగినట్లుగానే అమ్మకాలు జరిగాయి. దీంతో బార్లు, మద్యం దుకాణాలు భారీగా స్టాక్‌ను నిల్వ చేశాయి. దసరా ప్రారంభానికి ముందు నుంచే అమ్మకాల కిక్కు మొదలైంది. 2024, సెప్టెంబర్ 30 వరకు 2,838.92 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి.
అక్టోబర్ 1 నుంచి 11 వరకు..
ఇక అక్టోబర్ నెల ప్రారంభం నుంచి 11వ తేదీ వరకు రూ.1,057.42 కోట్ల మేర మద్యం అమ్మకాలు జరిగాయి. 17.59 లీటర్ల బీర్ల కేసులు అమ్మకాలు జరిగాయి. అమ్మకాల్లో రంగారెడ్డి జిల్లా అగ్రస్థానంలో ఉండగా, కరీంనగర్, నల్గొండ, వరంగల్ జిల్లాలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. పండగకు చివరి మూడు రోజులు భారీగా అమ్మకాలు జరిగాయి. ఎక్సైజ్ డిపోల నుంచి రూ.205.42 కోట్ల విలువైన మద్యం రిటైల్ దుకాణాలకు చేరింది. అందులో లిక్కర్, బీర్లు అమ్మకాలకు పోటీ పడ్డాయి.
ఖజానాకు ఆదాయం..
మద్యం అమ్మకాలతో ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం వచ్చింది. శనివారం, ఆదివారం రెట్టిపు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. మొత్తం 11 రోజుల్లో రూ.1000 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. దీంతో ఖజానాకు భారీగా సొమ్ము చేరింది.