
వచ్చే ఏడాది ప్రథమార్ధంలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకే ఒకరిపై మరొకరు ఎత్తులు పైఎత్తులు వేస్తున్నారు. డీఎంకే వ్యవసాయ చట్టాల విషయంలో అన్నాడీఎంకేను ప్రధానంగా టార్గెట్ చేస్తున్నది. బీజేపీ మిత్రపక్షమైన అన్నాడీఎంకే వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై ఎలాంటి వైఖరి వెల్లడించకపోవడంతో.. ఈ అంశాన్ని హైలెట్ చేసి వచ్చే ఎన్నికల్లో రైతుల ఓట్లు కొల్లగొట్టాలని డీఎంకే భావిస్తున్నట్లుగా తెలుస్తున్నది. అన్నాడీంఎకే, డీఎంకే మధ్య చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలను బట్టి చూస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తున్నది. తాజాగా ఇవాళ కూడా డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ వ్యవసాయ చట్టాలకు సంబంధించి ముఖ్యమంత్రి ఎడప్పడి పళనిస్వామికి లేఖ రాశారు.