https://oktelugu.com/

Sunita Williams: స్టార్ లైనర్ లో హీలియం లీకులు.. సునీతా విలియమ్స్ ను ఎలాన్ మస్క్ రక్షిస్తారా?

బోయింగ్ సంస్థకు చెందిన స్టార్ లైనర్ లో హీలియం లీకులు ఏర్పడుతున్న నేపథ్యంలో.. సునీతా విలియమ్స్, విల్మోర్ ను సురక్షితంగా తీసుకువచ్చే బాధ్యతను ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలుస్తోంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : June 26, 2024 / 03:45 PM IST

    Sunita Williams

    Follow us on

    Sunita Williams: బోయింగ్ స్టార్ లైనర్ ద్వారా జూన్ 5న భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, బూచ్ విల్మోర్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు వెళ్లారు. మిషన్ ప్రకారం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో 9 రోజుల పాటు వారు ఉండాల్సి ఉంది. అక్కడికి ప్రయాణం సాఫీగానే సాగినప్పటికీ.. తిరిగి వచ్చే క్రమంలో స్టార్ లైనర్ లో హీలియం లీకులు ప్రారంభమయ్యాయి. ఫలితంగా వారు తిరిగి వచ్చే సమయం పై ఆనిశ్చితి ఏర్పడింది. సునీతా విలియమ్స్, విల్మోర్ భూమి మీదకి జూలై రెండున తిరిగి రావాల్సి ఉండగా.. దానిపై స్టార్ లైనర్ ఎటువంటి స్పష్టత ఇవ్వడం లేదు.

    బోయింగ్ సంస్థకు చెందిన స్టార్ లైనర్ లో హీలియం లీకులు ఏర్పడుతున్న నేపథ్యంలో.. సునీతా విలియమ్స్, విల్మోర్ ను సురక్షితంగా తీసుకువచ్చే బాధ్యతను ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలుస్తోంది.. సునీతా, విల్మోర్ 2022 నవంబర్ మూడు నుంచి హ్యూస్టన్ జాన్సన్ స్పేస్ సెంటర్ లోని బోయింగ్ స్టార్ లైనర్ సిమ్యూలేటర్ లో పనిచేస్తున్నారు.. బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్యూల్ మొదటి విమానంలో వారు ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ కు జూన్ లో బయలుదేరారు. వాస్తవానికి ఈ మిషన్ ఎప్పుడో చేపట్టాల్సి ఉన్నప్పటికీ.. హీలియం లీక్ ల వల్ల పలుమార్లు వాయిదా పడింది..

    ఈ మిషన్ కోసం నాసా 4.5 బిలియన్ డాలర్లను బోయింగ్ కు సంస్థకు ఇచ్చేటట్టు ఒప్పందం కుదుర్చుకుంది. అయితే హీలియం లీకుల వల్ల ఒప్పందంలో భాగంగా నాసా ఇచ్చే 4.5 బిలియన్ డాలర్లకు మించి అదనంగా 1.5 బిలియన్ డాలర్లను ఖర్చుపెట్టింది. ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ కు వెళ్లిన సునీతా విలియమ్స్, విల్మోర్ తిరిగి భూమ్మీదికి రావడంలో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. స్పేస్ ఎక్స్ అవసరం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇదే క్రమంలో నాసా, బోయింగ్ అధికారులు మాత్రం స్పేస్ ఎక్స్ ప్రమేయాన్ని, అవసరాన్ని తగ్గించి చూపుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత సమస్య పరిష్కారానికి స్పేస్ ఎక్స్ జోక్యం అవసరం లేదని, స్టార్ లైనర్ మరమ్మతులను చేసుకునే సత్తా తమ వద్ద ఉందని బోయింగ్ అధికారులు చెబుతున్నారు. గత మార్చి నెలలో నలుగురు వ్యోమగాములను స్పేస్ ఎక్స్ కు చెందిన క్రూ డ్రాగన్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు తీసుకెళ్ళింది.. స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ ఇద్దరు నుంచి నలుగురు వ్యోమగాములకు వసతి కల్పిస్తుంది. అత్యవసర సమయంలో అదనపు వ్యోమగాములకు కూడా వసతి అందిస్తుంది. 2020 నుంచి వ్యోమగాములు, ఇతర అంతరిక్ష పరికరాలను ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు స్పేస్ ఎక్స్ తన క్రూ డ్రాగన్ ద్వారా రవాణా చేస్తోంది.

    అయితే సునీతా విలియమ్స్, విల్మోర్ తిరిగి భూమి మీదకి వచ్చేందుకు సమయం పడుతుందని బోయింగ్ అధికారులు చెబుతున్నారు. జూలై రెండు వరకు వారు ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ లోనే ఉంటారు. విస్తారమైన హీలియం వాయువు మిగిలి ఉన్నందున.. ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లో ఏదైనా భయంకరమైన సమస్యలు తలెత్తితే విల్మోర్, సునీతా విలియమ్స్ లీకులు ఉన్నప్పటికీ సురక్షితంగా భూమిని చేరుకుంటారని బోయింగ్ అధికారులు చెబుతున్నారు.”స్టార్ లైనర్ ఇప్పటికీ వ్యోమగాములు తిరిగి వచ్చే వాహనంగా ఉంటుంది. ప్రస్తుతం స్పేస్ ఎక్స్ అవసరం అంతగా లేదు. వచ్చే రోజుల్లో సమస్య పెద్దగా మారుతుందో చూడాలి. అప్పుడు దానికి అనుగుణంగా అడుగులు వేయాల్సి ఉందని” యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ అర్బానా ఛాంపెయిన్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్, బోయింగ్ మాజీ స్పేస్ ఫ్లైట్ కన్సల్టెంట్ మైకేల్ లెంబెక్ అన్నారు.

    2022లో నాసాకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది.. ఆ సమయంలో ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లో ఉన్న వ్యోమగామి ఫ్రాంక్ రూమియో చిక్కుకుపోయాడు.. అప్పుడు అతడు రష్యాలోని సోయిజ్ క్యాప్సుల్ లో ప్రయాణిస్తున్నాడు.. అందులో హీలియం గ్యాస్ లీక్ కావడంతో ఇబ్బంది ఏర్పడింది.. అతడిని కాపాడేందుకు నాసా స్పేస్ ఎక్స్ ను పరిగణలోకి తీసుకున్నప్పటికీ.. చివరికి రూబియో రష్యా పంపించిన ఖాళీ సోయిజ్ క్యాప్సుల్ ద్వారా తిరిగి భూమ్మీదికి వచ్చాడు.. అయితే అతడు రికార్డు స్థాయిలో 371 రోజులు మిషన్ లోనే ఉన్నాడు.