WhatsApp Group Scam: రోజురోజుకు వాట్సాప్ వినియోగం పెరిగిపోతోంది. మెసేజ్ నుంచి మొదలుపెడితే వీడియో కాల్ వరకు ప్రతిదీ వాట్సాప్ ద్వారానే జరిగిపోతోంది. ఇప్పుడు కొత్తగా పేమెంట్స్ ఫీచర్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఫలితంగా అడుగు బయట పెట్టకుండా.. చెమట చుక్క చిందించకుండా.. కేవలం బొటనవేలితో టచ్ చేసే దూరంలోనే పనులు మొత్తం జరిగిపోతున్నాయి. మంచి వెనకే చెడు ఉన్నట్టు.. ఇప్పుడు ఈ వాట్సాప్ ద్వారా కొంతమంది మోసగాళ్లు అడ్డగోలుగా సంపాదనకు అలవాటు పడుతున్నారు. యూజర్లను మోసం చేస్తూ.. భారీగా దండుకుంటున్నారు.. వాట్సాప్ గ్రూపుల పేరుతో స్కామర్లు సరికొత్త అవతారం ఎత్తుతున్నారు.. స్టాక్ మార్కెట్ పెట్టుబడి ప్రణాళికల పేరుతో యూజర్లను ఆకర్షిస్తున్నారు.. అనంతరం పెట్టుబడులు పెట్టాలంటూ.. అకౌంట్ నెంబర్లు ఇస్తున్నారు. తీరా డబ్బులు వాటికి జమ చేసిన తర్వాత.. ఆ గ్రూపులను డిలీట్ చేస్తున్నారు. పూణె నగరానికి చెందిన ఇద్దరు సోదరులు ఇలా వాట్సాప్ గ్రూప్ స్కాంలో ఇరుక్కుపోయి 2.45 కోట్ల వరకు మోసపోయారు.
ఎలా మోసం చేస్తారు అంటే..
స్కామర్లు ముందుగా యూజర్ ను సోషల్ మీడియా అకౌంట్లో ఫాలో అవుతుంటారు. ఆ తర్వాత నెంబర్ తెలుసుకొని మాటలు కలుపుతుంటారు. సులువుగా డబ్బు సంపాదించే ప్రణాళికల గురించి వారితో చర్చిస్తుంటారు. ఒకసారి యూజర్ వారి ట్రాప్ లో ఇరుక్కున్న తర్వాత.. మెల్లిగా తమ వాట్సాప్ గ్రూప్ లో ఆ నెంబర్ యాడ్ చేస్తారు.. అనంతరం షేర్ ట్రేడింగ్ ద్వారా లాభాలు సంపాదించవచ్చని అరచేతిలో వైకుంఠం చూపిస్తారు.. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు, లాభాలు ఎలా పొందాలి, ఎలాంటి షేర్లు కొనుగోలు చేయాలి.. అనే వాటి పట్ల వివరంగా చెబుతుంటారు.. ఇవన్నీ విన్న తర్వాత.. అలా పెట్టుబడులు పెడితే లాభాలు సంపాదించవచ్చని యూజర్ కు నమ్మకం కుదురుతుంది. ఆ తర్వాత అతని ద్వారా మిగతా వారికి స్కామర్లు చెప్పించే ప్రయత్నం చేస్తారు. ఇలా గొలుసుకట్టు పథకంలాగా స్కామర్ల మోసం స్ప్రెడ్ అవుతూ ఉంటుంది.
ఫిషింగ్ విధానంలో..
ఇది పూర్తయిన తర్వాత.. స్కామర్ గ్రూపులలో యూజర్లు భాగమైన అనంతరం.. వారు తమ మోసాన్ని అమల్లో పెట్టడం మొదలుపెడతారు. షేర్ ట్రేడింగ్ ఖాతా ఓపెన్ చేయాలని యూజర్లకు నిర్దేశిస్తారు. సాఫ్ట్ వేర్ ఉపయోగించాలని సూచిస్తారు.. యూజర్ సాఫ్ట్ వేర్ వాడటం మొదలు పెట్టిన తర్వాత.. స్కామర్లు ఫిషింగ్ విధానం ద్వారా రాని లాభాలను వచ్చినట్లు చూపిస్తారు. దానిని నిజమని యూజర్లతో నమ్మిస్తారు. అంతేకాదు యూజర్ల ద్వారా పెట్టించిన పెట్టుబడిని తమ ఖాతాలో మళ్ళించేలాగా స్కామర్లు ప్రేరేపిస్తారు. ఒకసారి వారి ఖాతాల్లో డబ్బులు పడిన తర్వాత.. పత్తాకు కనిపించరు. ఫోన్లో కూడా రెస్పాండ్ కారు. అప్పటికి గాని యూజర్లకు తాము మోసపోయిన విషయం అర్థం అవుతుంది..
ఆ సోదరుల విషయంలో..
పూణే నగరానికి చెందిన సోదరుల విషయంలోనూ స్కామర్లు ఇలానే చేశారు.. తాము చేస్తున్న మోసాన్ని పసిగట్టకుండా ఉండేందుకు సెబీ( సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) లాంటి నియంత్రణ సంస్థలు ఖాతాలను లాక్ చేయకుండా, నిధులను యాక్సెస్ చేయకుండా నిరోధించారు. దీంతో స్కామర్ల పాచికలు పారాయి. ఫలితంగా స్కామర్లు చెప్పింది మొత్తం నిజమేనని ఆ పూణె సోదరులు నమ్మారు. చివరికి మోసపోయిన తర్వాత.. పోలీసులను ఆశ్రయించారు. అప్పటికే స్కామర్లు ఆ డబ్బులను తమ ఖాతాలలో మళ్ళించుకున్నారు.
మోసగాళ్ల బారిన పడకుండా ఉండాలంటే..
ఇంటర్నెట్లో ఎవరిని అంత సులభంగా నమ్మొద్దు. ఎవరైనా అవకాశాలు ఇస్తామని చెప్తే కచ్చితంగా వారిని పక్కన పెట్టాలి. మీ నెంబర్ ఏదైనా వాట్సాప్ గ్రూపులో యాడ్ అయితే.. వెంటనే ఈ ఎగ్జిట్ కావడం మంచిది. అనుమానాస్పద పేర్లతో ఉన్న గ్రూపులలో ఉండడం అంత శ్రేయస్కరం కాదు. చైన్ లింక్ గురించి ఎవరైనా చెబితే సాధ్యమైనంతవరకు అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిది. ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే ప్రశ్నలు అడగడం మంచిది. అవాస్తవ రివార్డులు, అద్భుతమైన పెట్టుబడులు, ప్రత్యేకమైన డీల్ లు అందించే వారిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు. అన్నిటికంటే వాట్సాప్ గ్రూపులలో లింక్ లేదా డౌన్ లోడ్ ఫైల్స్ పై అస్సలు క్లిక్ చేయకూడదు. వాటిల్లో ప్రమాదకరమైన వైరస్ లేదా ఫిషింగ్ వ్యవహారం ఉండి ఉండవచ్చు. ముఖ్యంగా ఫోన్ నెంబర్, బ్యాంకు ఖాతా నెంబర్, ఇతర వ్యవహారాలు ఎవరితోనూ పంచుకోవద్దు. చివరికి ఓటీపీలను కూడా షేర్ చేయొద్దు.