Uday Ruddarraju: ప్రపంచంలోని అగ్రశ్రేణి టెక్నాలజీ కంపెనీల్లో భారతీయులు సత్తా చాటుతున్నారు. ఇప్పటికే సత్యం నాదెళ్ల, సుందర్ పిచాయ్, శంతన్ నాయాయణ్ వంటి వారు తమ నైపుణ్యంతో కీలక పదవుల్లో కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు మరో తెలుగు తేజం ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న OpenAI సంస్థలో అత్యున్నత స్థానాన్ని అధిరోహించాడు. ప్రస్తుతం కాలంలో చాలా మంది ChatGPT వాడుతున్న విషయం తెలిసిందే. అయితే దీని రూపకర్త అయిన OpenAI సంస్థ CTO ఉదయ్ రుద్దరాజు నియామకం అయ్యారు. విశేషమేంటంటే ఈయన ఈ సంస్థలో చేరి ఏడాది అవుతోంది. ఇంతలోనే ఈ పదవిని చేపట్టడం గర్వకారణంగా కొనియాడుతున్నారు. అసలు ఈ రుద్ద రాజు ఎవరు? ఆయన ప్రస్థానం ఏంటీ? ఈ స్థాయికి ఎలా చేరుకున్నారు?
ఉదయ్ రుద్దరాజు (Uday Ruddarraju) భారత సంతతికి చెందిన టెక్నాలజీ నిపుణుడు. హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ చదివిన ఆయన, ప్రస్తుతం ప్రపంచంలోనే ప్రముఖ కృత్రిమ మేధ సంస్థ అయిన OpenAIలో Chief Technology Officer (CTO – Compute) గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్ లో విద్యాభ్యాసం:
ఉదయ్ హైదరాబాద్‌లోని చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (CBIT) లో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. విద్యార్థి దశలోనే Amazon Web Services లో ఇంటర్న్‌గా పనిచేసి క్లౌడ్ కంప్యూటింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై అనుభవం సంపాదించారు. అనంతరం అమెరికాలోని University of Minnesotaలో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు.
eBayలో కెరీర్ ప్రారంభం:
2013 నుంచి 2018 వరకు ఉదయ్ eBayలో పనిచేశారు. ఈ సంస్థ క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆధునీకరణ, Kubernetes అమలు, భారీ స్థాయి ఇంజినీరింగ్ సిస్టమ్‌ల నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. ఈ అనుభవం ఆయనను ప్రపంచ స్థాయి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంజినీర్‌గా తీర్చిదిద్దింది. ఆ తర్వాత Robinhoodలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విభాగానికి నాయకత్వం వహించారు. ఆయన పనిచేసిన కాలంలో Robinhood వినియోగదారుల సంఖ్య సుమారు 10 లక్షల నుంచి 2.4 కోట్లకు పెరిగింది. అంత పెద్ద స్థాయిలో కూడా సేవలు అంతరాయం లేకుండా కొనసాగేందుకు అవసరమైన టెక్నాలజీ వ్యవస్థలను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు.
ఎలాన్ మస్క్‌తో కలిసి:
2024లో ఎలాన్ మస్క్ స్థాపించిన xAIలో Head of Infrastructure Engineeringగా చేరారు. అక్కడ Compute, Networking, Storage, Data Platforms, Research Infrastructure, Data Centers వంటి కీలక విభాగాలకు నాయకత్వం వహించారు. Grok AI శిక్షణ కోసం ఉపయోగించిన Colossus అనే భారీ GPU సూపర్‌కంప్యూటింగ్ వ్యవస్థ నిర్మాణంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు.
OpenAIలో చేరిక
ఆ తరువాత 2025లో xAIను వీడి OpenAIలో Head of Compute and Infrastructureగా చేరారు. ChatGPT, GPT సిరీస్ వంటి ఆధునిక AI మోడళ్లకు అవసరమైన కంప్యూటింగ్ వనరులు, డేటా సెంటర్లు, GPU క్లస్టర్లు, నెట్‌వర్కింగ్ వ్యవస్థల అభివృద్ధికి నాయకత్వం వహించారు. ప్రస్తుతం 2026 జూలైలో OpenAI ఆయనను Chief Technology Officer (CTO – Compute) గా పదోన్నతి కల్పించింది. ఈ బాధ్యతలో భాగంగా OpenAIకి అవసరమైన భారీ కంప్యూటింగ్ మౌలిక సదుపాయాల రూపకల్పన, విస్తరణ, డేటా సెంటర్ల నిర్మాణం, GPU క్లస్టర్ల నిర్వహణ, తదుపరి తరం AI మోడళ్లకు అవసరమైన Compute సామర్థ్యాల అభివృద్ధిని పర్యవేక్షిస్తున్నారు.
CTO – Compute బాధ్యతలు ఏమిటి?
ఈ పదవిలో ఉదయ్ రుద్దరాజు ప్రధానంగా AI మోడళ్ల శిక్షణకు అవసరమైన Compute Infrastructure అభివృద్ధి
ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్ల విస్తరణకు కృషి చేస్తారు. లక్షలాది GPUsతో పనిచేసే కంప్యూటింగ్ వ్యవస్థల నిర్వహణ
Networking, Storage, Distributed Systems పర్యవేక్షణ చేస్తారు. భవిష్యత్ GPT మోడళ్లకు అవసరమైన సాంకేతిక మౌలిక వసతుల నిర్మాణం వంటి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద Compute Infrastructure లక్ష్యంగా ముందుకెళ్తారు. ఈ పదవిలో ఉదయ్ రాజు బేస్ శాలరీ (వార్షిక వేతనం) సుమారు 5 లక్షల నుంచి 10 లక్షల అమెరికన్ డాలర్లు (దాదాపు రూ.4.3 కోట్లు – రూ8.6 కోట్లు) ఉండే అవకాశం ఉంది. పనితీరు ఆధారంగా బోనస్ పెరుగుతుంది.
తెలుగు యువతకు స్ఫూర్తి
హైదరాబాద్‌లో సాధారణ ఇంజినీరింగ్ విద్యార్థిగా ప్రారంభమైన ఉదయ్ రుద్దరాజు ప్రయాణం, నేడు ప్రపంచ AI రంగాన్ని ముందుకు నడిపిస్తున్న సంస్థలో CTO (Compute) స్థాయికి చేరడం విశేషం. కష్టపడి నేర్చుకోవడం, సాంకేతిక నైపుణ్యాలను నిరంతరం పెంపొందించుకోవడం, ప్రపంచ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకోవడం ద్వారా ఎంతటి ఉన్నత స్థానానికైనా చేరుకోవచ్చని ఆయన ప్రస్థానం నిరూపిస్తోంది.


