Hyderabad IIT: మూగవారు ఇకపై మాట్లాడవచ్చు.. హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ ఆవిష్కరించిన అత్యాధునిక సాంకేతికత ఇదీ..

మన సమాజంలో మాట్లాడే అవకాశం లేని వారు చాలామంది ఉన్నారు. పుట్టుకతోనే మాట్లాడే అవకాశాన్ని కోల్పోవడం.. ఏదైనా ప్రమాదం వల్ల గొంతు భాగం ప్రభావితం కావడం వల్ల.. చాలామంది తమ స్వరాన్ని ఇతరులకు వినిపించలేకపోతున్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : October 22, 2024 3:26 pm

Hyderabad IIT

Follow us on

Hyderabad IIT: సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కినప్పటికీ ఇప్పటికీ మూగవారికి మాట్లాడే అవకాశం కలగడం లేదు. ఎన్నెన్నో అత్యాధునిక ఆపరేషన్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ మూగవారు ఉత్తమ స్వరాన్ని సవరించుకోలేకపోతున్నారు. చెవిటివారు ఇతర శబ్దాలను వినే విధంగా మిషన్లు వచ్చినప్పటికీ.. మూగవారికి మాత్రం ఆ అవకాశం లభించడం లేదు. అందువల్ల వారు సైగలతోనే తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. మూగవారు పరస్పరం సైగల ద్వారా సంభాషించుకుంటారు. అదే మూగ వారు తమ స్పందనను ఎదుటివారికి చెప్పడంలో చాలా ఇబ్బంది పడుతుంటారు. అయితే ఇప్పుడు మూగవారికి హైదరాబాద్ త్రిబుల్ ఐటీ గుడ్ న్యూస్ చెప్పింది. స్టెతస్కోప్ సహాయంతో మూగవారి భావాలను మాటలుగా రూపొందించగలిగే ఆధ్యాత్మిక సైలెంట్ స్పీచ్ ఇంటర్ఫేస్ (ఎస్ ఎస్ ఐ) ను అభివృద్ధి చేసింది.. దీని అభివృద్ధి వెనుక హైదరాబాద్ ట్రిబుల్ ఐటీ ప్రొఫెసర్లు ప్రొఫెసర్ రామనాథన్ సుబ్రహ్మణ్యం, వినీత్ గాంధీ, నీల్ షా, నేహా సహిప్ జాన్ ఉన్నారు.

ఇది పూర్తిగా భిన్నమైనది

సైలెంట్ స్పీచ్ ఇంటర్ఫేస్ కోసం ఎక్కువగా పెదాల కదలికలను ఉపయోగిస్తారు. అల్ట్రా సౌండ్ టంగ్ ఇమేజింగ్, ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఆర్టికులోగ్రఫీ, రియల్ టైం ఎమ్మారై వంటి పరిజ్ఞానాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ.. మూగవారికి మాట భాగ్యం కల్పించాలంటే సాధ్యమయ్యే పని కాదు. పైగా అది అత్యంత ఖర్చుతో కూడుకున్నది. అయితే దీనికి ప్రత్యామ్నాయంగా హైదరాబాద్ త్రిబుల్ ఐటీ పరిశోధకులు “స్టెతో టెక్స్ కార్పస్” అనే పరికరాన్ని రూపొందించారు. ముందుగా దీనిని పరిశోధకులు ప్రయోగించారు. అది పనిచేసే విధానాన్ని పరిశీలించారు. వేరువేరు ప్రదేశాలలో మనుషులు మాట్లాడుతున్నప్పుడు వారి గొంతులో కలిగే ప్రతిస్పందనలను, మాటలను రికార్డ్ చేశారు. ఆ తర్వాత ఆ ప్రతిస్పందనలను మాటలుగా మార్చే ఒక నమూనా రూపొందించారు. మూగవారు మాట్లాడుతున్నప్పుడు కొంత ప్రతిస్పందనలు నమోదవుతాయి. వాటిని సాధారణ స్టెత స్కోప్ గుర్తిస్తుంది. బ్లూటూత్ ద్వారా మొబైల్కు చేరేలా చూస్తుంది. అయితే హైదరాబాద్ త్రిబుల్ ఐటీ పరిశోధకులు రూపొందించిన పరికరం ఇన్ స్టాల్ అయి ఉన్న ఫోన్ ఈ ప్రతిస్పందనలను ఎప్పటికప్పుడు మాటలుగా రూపాంతరం చెందిస్తుంది. దీనివల్ల మూగవారు తమ స్పందనలను మాటలుగా ఎదుటివారికి చెప్పే అవకాశం ఉంటుంది. అయితే ఈ యంత్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని.. కృత్రిమ మేధను దీనికోసం ఉపయోగిస్తామని వివరిస్తున్నారు. అయితే ఈ యంత్రానికి ఇంకా పేటెంట్ రైట్ రాలేదు. ఒకవేళ ఇది అందుబాటులోకి వస్తే మూగవారికి మాట అనే వరం లభించినట్టే. అయితే ఈ పరికరాలను తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకొస్తేనే మూగవారికి ప్రయోజనకరంగా ఉంటుందని పలువురు శాస్త్రవేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు.