The Birth of Earth: మన భూమి 4.5 బిలియన్ సంవత్సరాలలో చాలా పెద్ద మార్పులు చూసింది. అది పుట్టినప్పుడు అంటే సుమారు 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం ఒక మండే అగ్ని గోళంలా ఉండేది. అదంతా లావా సముద్రాలు, అగ్నిపర్వతాలతో నిండి ఉండేది. నిరంతరం అంతరిక్షం నుంచి రాళ్లు, శిథిలాలు పడుతూ ఉండేవి. అక్కడ జీవించడానికి అసలు వీలుండేది కాదు. ఖండాలు, సముద్రాలు, ప్రాణులు ఇవేవీ అప్పట్లో లేవు. కేవలం భూమి మొత్తం మంటలు మాత్రమే ఉండేవి.
దాదాపు 2.3 బిలియన్ సంవత్సరాల క్రితం భూమి బాగా చల్లబడింది. ఆ కాలాన్ని స్నోబాల్ ఎర్త్ అంటారు. అప్పుడు భూమి దాదాపు పూర్తిగా మంచుతో నిండిపోయింది. వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ తగ్గడం, లేదా మొక్కల వంటి జీవులు పెరిగి కిరణజన్య సంయోగ క్రియ చేయడం వల్ల ఇది జరిగి ఉండొచ్చు. ఈ సమయంలో, జీవం చాలా కష్టపడి, సముద్రాల లోపల లేదా అగ్నిపర్వతాల దగ్గర ఉన్న వెచ్చని ప్రదేశాల్లో బతికింది. భూమి అప్పుడు జీవం ఉన్న ప్రాంతంలా కాకుండా, ఒక పెద్ద మంచు గ్లోబులా కనిపించేది.
ఈ మంచు యుగం చాలా ఏళ్లపాటు కొనసాగింది. చివరకు అగ్నిపర్వతాల నుంచి మళ్ళీ కార్బన్ డయాక్సైడ్ వంటి వాయువులు ఎక్కువగా బయటికి రావడంతో భూమి వేడెక్కడం మొదలైంది. దీంతో భారీగా మంచు కరిగి, భూమిపై నీరు ఏర్పడటానికి సహాయపడింది. ఇప్పుడు మనం చూస్తున్న భూమి చాలా అందంగా, సమతుల్యంగా ఉంది. నీలి సముద్రాలు, తేలియాడే మేఘాలు, అన్నిచోట్లా పచ్చదనం, జీవం ఉన్నాయి. మన ఆధునిక భూమి చిన్న బ్యాక్టీరియా నుంచి మనుషుల వరకు అందరికీ ఆశ్రయాన్ని కల్పిస్తోంది. ఇప్పుడు భూమి ప్రశాంతంగా కనిపించినా ఇది ఎప్పుడూ మారుతూ ఉండే గ్రహం అని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనం చూస్తున్నది దాని చరిత్రలో ఒక చిన్న భాగాన్ని మాత్రమే.
Also Read: Chatgpt ని పక్కకు నెట్టిన భారతీయుడి కంపెనీ..
భూమిపై నిరంతరం జరిగే భౌగోళిక మార్పులు, భూమి పొరల కదలికలు, వాతావరణంలో మార్పులు, జీవుల పరిణామం వంటివి భూమి రూపాన్ని ఎప్పటికప్పుడు మారుస్తూనే ఉన్నాయి. ఈ మార్పులు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయి. భూమి రూపురేఖలను మరింత మారుస్తాయి.