TATA New EV Car: దేశీయ కార్ల తయారీ కంపెనీ టాటా మోటార్స్ తన కస్టమర్ల కోసం ఎల్లప్పుడూ సరికొత్త మోడళ్లను అందుబాటులోకి తెస్తూనే ఉంటుంది. పైగా ఈ కంపెనీ ఎక్కువగా మిడిల్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని అనేక కార్లను ప్రవేశపెడుతుంది. అందులో భాగంగా తక్కువ ఖర్చుతో ప్రయాణించేందుకు కొత్త కారు తయారు చేసింది. దీని ఫీచర్స్.. కస్టమర్ల మతి పోగొడుతున్నాయి.

బడ్జెట్ ఎలక్ట్రిక్ కారు..
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా, టాటా మోటార్స్ ఈ సెగ్మెంట్లో తన పట్టును బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. టియాగో ఈవీ.. టాటా మోటార్స్ నుంచి మార్కెట్లోకి వచ్చిన మూడో ఎలక్ట్రిక్ కారు. కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల పోర్ట్‌ఫోలియోలో ఇప్పటికే నెక్సన్ ఈవీ, టిగ్రో ఈవీ కార్లు ఉన్నాయి. తాజాగా వచ్చిన టియాగో ఈవీ.. కారుకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. టాటా మోటార్స్ అందుబాటులోకి తెచ్చిన ఈ బడ్జెట్ ఎలక్ట్రిక్ కారు బుక్కింగ్స్ అక్టోబర్ 11 నుంచి ప్రారంభం అవుతున్నాయి.
ఖర్చు తగ్గించే కారు…
ప్రస్తుతం పెరుగుతున్న ఇంధన ధరలతో సొంత వాహనాలు కొనడానికి మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ ప్రజలు భయపడుతున్నారు. విధిలేని పరిస్థితిలో మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. కానీ తాజాగా టాటామోటార్స్ తెచ్చిన టియాగో ఈవీ ఖర్చును తగ్గించే కారని కంపెనీ చెబుతోంది. పెట్రోల్ మోడల్ కార్లతో పోల్చితే కిలోమీటరుకు దాదాపు రూ.6.50 ఆదా చేసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది. దీనికి సంబంధించి కంపేరిటివ్ డేటాను కంపెనీ సమర్పించింది. ఈ రేంజ్ పెట్రోల్ కారును 1000 కిలోమీటర్లు నడపటానికి రూ.7,500 ఆయిల్ ఖర్చవుతుందని, అదే టియాగో ఈవీని ఇదే దూరం నడపటానికి రూ.1,100 మాత్రమే ఖర్చవుతుందని కంపెనీ వెల్లడించింది. అలా వినియోగదారులు రూ.6,500 ఆదా చేసుకోవచ్చని తెలిపింది.

ఒక్కసారి చార్జి చేస్తే..
టియాగో ఈవీలో ఐపీ–67 రేటెడ్ బ్యాటరీ ప్యాక్, 24కెడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో సహా బహుళ చార్జింగ్ ఆప్షన్స్‌తో అందించబడుతుంది. టిగ్రోఈవీ 24కెడబ్ల్యూహోచ్ బ్యాటరీ ప్యాక్‌తో 315 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటుందని కంపెనీ పేర్కొంది. టాటా మోటార్స్ 19.2 కెడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో టియాగో ఈవీని కూడా పరిచయం చేసింది. మోటర్, బ్యాటరీలకు కంపెనీ 8 ఏళ్లు లేదా 1,60,000 కిమీల వారంటీని అందిస్తోంది. ఈవీ ఫాస్ట్ చార్జర్‌ని ఉపయోగించి వాటిని 57 నిమిషాల్లో 80 శాతం వరకు చార్జి చేయవచ్చని కంపెనీ చెబుతోంది. ఇన్ని సూపర్ ఫీచర్స్ ఉండటంతో అనేక మంది కస్టమర్లు ఈ కారు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు.
బుకింగ్ ఇలా..
అక్టోబర్ 11 మధ్యాహ్నం 12 గంటల నుంచి టియాగో ఈవీ కారు బుకింగ్స్ ప్రారంభిస్తున్నట్లు టాటా మోటార్స్ ప్రకటించింది. కస్టమర్లు ఏదైనా అధీకృత టాటా మోటార్స్ డీలర్‌షిప్ లేదా వెబ్‌సైట్‌లో రూ.21,000 టోకెన్ అమౌంట్ డిపాజిట్ చేసి బుక్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ కారు డెలివరీ 2023, జనవరి నుంచి ప్రారంభమవుతుందని కంపెనీ చెబుతోంది. టియాగో ఈవీ డిసెంబర్ నుంచి టెస్ట్ డ్రైవ్‌లకు అందుబాటులో ఉంటుంది. ఇది జిప్‌ట్రాన్ టెక్నాలజీపై ఆధారపడి ఉంటుందని, ధర రూ.8.49 లక్షల నుంచి 11.79 లక్షల వరకు ఉంటుందని కంపెనీ వెల్లడించింది.