Starlink Kit: భారతదేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించడానికి మార్గం సుగమం అయింది. ఈ నేపథ్యంలో ఎలాన్ మస్క్ కు చెందిన స్టార్‌లింక్ కిట్‌లో ఏముంటుంది, దానికి ఎంత ఖర్చవుతుంది అనేది తెలుసుకుందాం. ఎలాన్ మస్క్ కంపెనీకి ప్రభుత్వం నుంచి అవసరమైన జీఎంపీసీఎస్ లైసెన్స్ లభించింది. జియో, భారతి ఎయిర్‌టెల్ సపోర్ట్ ఉన్న వన్ వెబ్ ఇప్పటికే ఈ లైసెన్స్‌ను పొందింది. ఇప్పుడు స్పెక్ట్రం కేటాయింపు తర్వాత, దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్‌ను ప్రారంభించడానికి మార్గం స్పష్టమవుతుంది. మీ ఇంట్లో కూడా శాటిలైట్ ఇంటర్నెట్‌ను ఏర్పాటు చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే, స్టార్‌లింక్ కిట్‌లో ఏమేమి ఉంటాయి అనేది తెలుసుకోవడం అవసరం. మీ ఇంట్లో శాటిలైట్ ఇంటర్నెట్ రావాలంటే ఏ పరికరాలు అమర్చాలి? కంపెనీ నెలకు రూ. 810 ప్లాన్‌ను తీసుకురావచ్చని చెబుతున్నప్పటికీ, కిట్ కోసం ఎంత డబ్బు చెల్లించాలో వివరంగా తెలుసుకుందాం.
స్టార్‌లింక్ కిట్‌లో ఏముంటుంది?
స్టార్‌లింక్ కిట్‌లో ముఖ్యంగా 4 వస్తువులు ఉంటాయి. ఇందులో స్టార్‌లింక్ డిష్, వైఫై రౌటర్, పవర్ సప్లై కేబుల్, అమర్చే స్టాండ్ (mounting tripod) ఉంటాయి. స్టార్‌లింక్ డిష్‌ను ఇంటి పైకప్పుపై లేదా స్తంభం పైన అమరుస్తారు. ఇది డీటీహెచ్ గొడుగు లాగే ఆరుబయట ఉంటుంది. అంతరిక్షం నుండి వచ్చే సిగ్నల్స్ (signal beams) ఈ గొడుగుపై పడతాయి. అవి కిట్‌తో వచ్చే వైఫై రౌటర్‌కు చేరుతాయి. ఆ రౌటర్ ద్వారా మీ ఫోన్, ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్‌లో వైఫై ఇంటర్నెట్ నడుస్తుంది.
నెలకు రూ. 810 రీఛార్జ్ అంటే ఏమిటి?
స్టార్‌లింక్ నెలవారీ ప్లాన్ ఎంత నుంచి ప్రారంభమవుతుంది అనేది ఇంకా అధికారికంగా చెప్పలేదు. ఒక నివేదిక ప్రకారం, స్టార్‌లింక్ భారతదేశంలో తన సేవలను నెలకు రూ. 810 నుంచి ప్రారంభించవచ్చని తెలిపింది. అయితే, అమర్చే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఇది సామాన్యుడికి అందుబాటులో లేకపోవచ్చు. ఎందుకంటే ఇందులో కిట్ ఖర్చు కూడా కలుస్తుంది.
స్టార్‌లింక్ కిట్ ధర ఎంత ఉంటుంది?
వివిధ వెబ్ సౌట్లలో పేర్కొన్న ప్రకారం.. అమెరికాలో లభించే కిట్ ధరను, కెన్యాలో లభించే స్టార్‌లింక్ కిట్ ధరను పరిశీలిస్తే. భారతీయ రూపాయలలో ఈ ధర సుమారు 30 వేల నుండి 36 వేల రూపాయల మధ్య ఉంది. అంటే, స్టార్‌లింక్ కనెక్షన్ పొందే ముందు కిట్ కోసం సుమారు 30 వేల రూపాయల బడ్జెట్‌ను రెడీగా ఉంచుకోవాలి. కంపెనీ ఫిట్టింగ్ ఛార్జీలను తీసుకోకపోయినా, కిట్ ధర ఇంకా ఎక్కువగా ఉంది. దీనిని రాయితీ పథకం కింద అందించే అవకాశం ఉంది. అయితే, ఖచ్చితమైన ధర కోసం అధికారిక సమాచారం కోసం వేచి చూడాలి. భారతదేశంలో ఈ సేవలు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో, ఏ రకమైన ప్లాన్‌లు అందిస్తారో వేచి చూడాలి. దీని ద్వారా మారుమూల ప్రాంతాలకు కూడా వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వస్తాయి.